logo

జగన్‌ పాలనలో అన్నీ కోతలే

యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది.

Published : 19 Apr 2024 03:50 IST

రైతుకు రాయితీ.. యువతకు ఉపాధి మాయం

పొలంలో తుంపర సేద్య పరికరాలు అమర్చుతున్న ఆంజనేయులు తదితరులు (పాత చిత్రం)

కదిరి, నల్లచెరువు, న్యూస్‌టుడే: యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన వైకాపా చివరకు.. ఆ వర్గానికే షాకిచ్చింది. కొత్తగా ఉపాధి కల్పన చర్యలు దేవుడెరుగు.. ఉన్నవాటికీ మంగళం పాడుతూ యువతకు, అటు రైతుకు తీవ్ర నష్టం మిగిలిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రైవేటు రంగాల్లో పనులు చేసుకుంటున్న యువతకూ ఉపాధి కోల్పోయే పరిస్థితి ఎదురైంది. దీనికితోడు గడచిన ఐదారు నెలల కష్టానికి వేతనాలు కూడా రాకపోవటంతో లబోదిబోమనే దయనీయం నెలకొంది. ఐదేళ్ల కిందట తెదేపా హయాంలో ఏపీఎంఐపీ పర్యవేక్షణలో రైతులకు బిందు, తుంపర సేద్య పరికరాలను 90 శాతం రాయితీతో అందించింది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో రైతుల పంటల సాగుకు సులువుగా ఉండేది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పథకానికి నిర్లక్ష్యం ఆవహించింది. ఫలితంగా రైతులకు రాయితీ సదుపాయం, బిందు, తుంపర సేద్య పరికాల కంపెనీల్లో పనిచేసే యువతకు ఉపాధి లేకుండాపోయింది. సూక్ష్మసేద్య సామగ్రి ఏడెనిమిది కంపెనీల నుంచి వచ్చేవి. శ్రీసత్యసాయి జిల్లాలో ఆయా కంపెనీలకు ఎఫ్‌సీఓలుగా 25 మంది వరకు ఉన్నారు. కంపెనీలకు రైతులకు మధ్య ఉండే డీలర్లకు రావాల్సిన సొమ్ములు ఆగాయి. వేలాదిమంది రైతులకు రాయితీ పరికరాలు అందక ప్రైవేటుగా కొనాల్సి వస్తోంది. దీంతో ప్రతి రైతు హెక్టారు సాగుకు రూ.1.60 లక్షల దాకా బిందు సామగ్రి భారం మోయాల్సి వస్తోంది. జగన్‌ రైతు భరోసా అంటూనే సాగు సామగ్రి రాయితీ ఇవ్వకుండా వెన్ను విరిశాడని, సంబంధిత సామగ్రి కంపెనీల్లో పనిచేసే యువతకూ ఉపాధి దెబ్బతీశాడని వాపోతున్నారు.

రూ.5 లక్షల బకాయి రావాలి

కొఠారి కంపెనీలో బిందు, తుంపర సేద్య పరికరాల డీలరుగా ఉన్నాను. ప్రభుత్వం రైతులకు రాయితీ ఇస్తున్నప్పుడు బాగుండేది. రాయితీకి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఇప్పటికే రైతులకు అందించిన సామగ్రికి సుమారు రూ.5 లక్షల వరకు రావాల్సి ఉంది. ఎంతో కొంత కమీషన్‌పై ఆధారపడి చేసే వ్యాపారం ప్రభుత్వ తీరుతో దెబ్బపడింది. కంపెనీలకు బకాయితో మాలాంటి డీలర్ల ఆదాయంపై ప్రభావం పడింది.   

లక్ష్మీపతి, డీలరు


ఆర్నెల్ల జీతభత్యాలు రాలేదు..

వైకాపా ప్రభుత్వం రైతులకు బిందు, తుంపర పరికరాల రాయితీ పథకం ముందుకు తీసుకెళ్లని ఫలితం కారణంగా మాలాంటి యువత ఉపాధిపై దెబ్బ పడింది. సిగ్నెట్‌ కంపెనీలో క్షేత్ర సమన్వయ అధికారిగా పనిచేశాను. నెలకు రూ.13 వేల వేతనం, రూ.8,500 టీఏ, డీఏ అలవెన్సులు ఇచ్చేవారు. అక్టోబరు నుంచి ఇప్పటి దాకా వేతనాలు ఆపేశారు. ఆర్నెళ్ల జీతాలు రాకపోవడంతో కుటుంబ నిర్వహణ ఇబ్బందిగా మారింది. ప్రభుత్వ నిర్ణయంతోనే ప్రైవేటులో పనిచేసే యువత ఉపాధిపై ప్రభావం పడటంతో కష్టాలు పడుతున్నాం.  

ఆంజనేయులు, ఎఫ్‌సీఓ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని