logo

దుర్గంలో ఎర్రమట్టి దోపిడీ

రాయదుర్గంలో అధికారం అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పట్టణం సరిహద్దున ఉన్న చెరువులు, కొండల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. ఐదేళ్లుగా దందా సాగిస్తూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడు.

Published : 01 May 2024 04:18 IST

వైకాపా నాయకుల బరితెగింపు

నాన్‌చెరువులో మట్టిని తవ్వి ట్రాక్టరులో నింపుతూ...

రాయదుర్గం, న్యూస్‌టుడే: రాయదుర్గంలో అధికారం అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పట్టణం సరిహద్దున ఉన్న చెరువులు, కొండల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు. ఐదేళ్లుగా దందా సాగిస్తూ రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడు. అధికారులకు తెలిసినా అటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు.

రాయదుర్గం పట్టణ సరిహద్దున మొలకాల్మూర్‌ రోడ్డులో నాన్‌ చెరువు ఉంది. ఇది నిండితే 74.ఉడేగోళం చెరువుకు, వేలాది బోర్లలో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయి. రెండేళ్లుగా వర్షాలు రాకపోవటంతో చెరువు ఖాళీ అయ్యింది. దాంతో అధికార పార్టీ నాయకుల పంట పండింది. చెరువులో 10 నుంచి 15 అడుగుల లోతు వరకు మట్టి తవ్వకాలు జరిపారు. ఆ మట్టిని పట్టణంలోనూ, కర్ణాటకలోని మొలకాల్మూర్‌లోని ఇటుకల బట్టీలకు తరలించి రూ.లక్షలు ఆర్జించారు. అక్రమార్కులకు స్థానిక రెవెన్యూశాఖ అధికారులు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. చెరువు మధ్యలో ఒక రోడ్డు తప్పా మిగిలిన ప్రాంతమంతా తవ్వేశారు. కట్ట ముందు కనీసం పది అడుగుల స్థలం వదలాల్సి ఉంది. అయితే కట్టను ఆనుకుని మట్టిని తరలిస్తుండటంతో వరదనీటితో కట్టకు పైపింగ్‌ ఏర్పడి తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. గతంలో కట్ట తెగిపోతే రైతులు చందాలు వేసుకొని మరమ్మతులు చేశారు. పట్టణ సమీపంలోని బొమ్మక్కపల్లి, మల్లాపురం చెరువు, గుమ్మఘట్ట మండలం రంగసముద్రం చెరువు పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది.

ఎక్కడెక్కడ తవ్వారంటే...: రాయదుర్గం పట్టణంలోని గౌడ లేఅవుట్‌ వద్ద ఉన్న జగన్న కాలనీ, మల్లాపురం లేఅవుట్‌, అడిగుప్పరోడ్డు, ఎంసీఏ లేఅవుట్‌ వద్ద కొండపైన, జాతీయ రహదారి పక్కన ఉన్న కొండలో, జగనన్న లేఅవుట్‌ల సమీపంలోని ఖాళీ స్థలాల్లో ఎర్రమట్టి కోసం తవ్వేశారు.


వాటాలు వేసుకొని..

నియోజకవర్గ ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితులైన కొందరు నాయకులు ఎర్రమట్టిని దోచారు. నాకిది.. నీకిది అన్నట్లు కొండలను పంచేసుకుని మట్టిని లూటీ చేశారు. ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలకు సర్వే నంబరు 502-1, 503-2,504-3లో ఉన్న కొండలో మట్టిని తరలించి, బోడి కొండను మిగిల్చారు. ప్రస్తుతం కొండలో బండ రాళ్లు మిగలడంతో వర్షం వస్తే నీరు కాలనీల్లో ప్రవేశిస్తోంది. ఇక్కడ పట్టపగలే పొక్లెయిన్‌లు, వందకుపైగా ట్రాక్టర్లతో పెద్దఎత్తున మట్టి తరలించినా రెవెన్యూ శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదు. వారికి పెద్ద ఎత్తున మామూళ్లు ముట్టినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి.


కణేకల్లు రోడ్డుపైభాగాన సర్వేనంబరు 491లో గౌడ లేఅవుట్‌కు వెళ్లే మార్గంలోని అయ్యప్ప కొండను ఇష్టారాజ్యంగా తవ్వారు.  ట్రాక్టరు మట్టిని రూ.1200కు పట్టణంలోని ఇళ్ల నిర్మాణాలు, అక్రమ లేఅవుట్‌లకు విక్రయించారు. తవ్విన ప్రదేశాన్ని చదును చేసి సుమారు వంద ప్లాట్ల దాకా వేశారు. ఒక్కో ప్లాటును రూ.40 వేల చొప్పున విక్రయించినట్లు తెలిసింది. ఇక్కడ 10-15 అడుగుల లోతు దాకా మట్టి తవ్వారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని