logo

జగన్‌ పాలనలో 108 కుయ్యో.. మొర్రో

108కి ఫోన్‌ చేసి సమాచారం ఇస్తే అర్బన్‌ ప్రాంతంలో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాలు, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లోపు అంబులెన్స్‌ బాధితులు ఇచ్చిన అడ్రస్‌కు చేరుకోవాల్సి ఉంది.

Updated : 01 May 2024 05:12 IST

తరచూ మొరాయిస్తున్న అంబులెన్స్‌లు
సమయానికి రోగుల వద్దకు చేరక తప్పని తిప్పలు

108కి ఫోన్‌ చేసి సమాచారం ఇస్తే అర్బన్‌ ప్రాంతంలో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాలు, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లోపు అంబులెన్స్‌ బాధితులు ఇచ్చిన అడ్రస్‌కు చేరుకోవాల్సి ఉంది. కానీ, ఎక్కువ శాతం వాహనాలు అనుకున్న సమయానికి చేరుకోవడం లేదు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి.

అనంతపురం (వైద్యం), న్యూస్‌టుడే: ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే కుయ్‌ కుయ్‌ అంటూ.. సంఘటనా స్థలానికి చేరుకోవాల్సిన 108 వాహనాలు నిర్వహణ లేక, మరమ్మతులకు నోచుకోక కుయ్యి.. కుయ్యిమంటున్నాయి. ఆరోగ్యం బాగోలేకపోయినా, రోడ్డు ప్రమాదాలకు గురైనా.. బాధితులు, క్షతగాత్రులను ఆసుపత్రులకు తీసుకురావడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 108 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ, వైకాపా పాలనలో 108 వాహనాల నిర్వహణ అధ్వానంగా తయారైంది. వాహనాలు మరమ్మతులకు గురై ఎక్కడపడితే అక్కడ ఆగిపోతున్నాయి. దీంతో రోగులు, క్షతగాత్రులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యామ్నాయంగా ఉన్న అంబులెన్స్‌లకు మరమ్మతులు చేయకపోవటంతో అవి కూడా నిలిచిపోయాయి.

ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇలా ..

ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో మొత్తం 108 వాహనాలు 66 ఉన్నాయి. అలాగే నాలుగు అంబులెన్స్‌లు బ్యాకప్‌కు అదనంగా ఏర్పాటు చేసి వినియోగిస్తున్నారు. మిగిలిన వాటిని మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. కొన్ని తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. టైర్లు పాతబడిపోవటంతో వేగంగా వెళ్లలేకపోతున్నామని డ్రైవర్లు చెబుతున్నారు. స్టెఫ్నీ టైర్లు అందుబాటులో లేకపోవడంతో టైర్‌ పంక్చరైతే ఇబ్బందులు తప్పడం లేదు. సగానికిపైగా పాత వాహనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నవాటిలో రెండు నుంచి నాలుగు లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగాయి. 80 వేల కిలోమీటర్లు తిరిగిన వాహనాలకు టైర్లు మార్చాల్సి ఉంటుంది. టైర్లు అందుబాటులో లేవు. 108 వాహనాల పర్యవేక్షణ, నిర్వహణ మొత్తం బాధ్యతలను 2020 జులైలో ఒక ప్రైవేట్‌ సంస్థ టెండర్‌ను దక్కించుకుని నిర్వహిస్తోంది. కొన్ని అంబులెన్స్‌లకు సైరన్‌లు పనిచేయకపోవటంతో ట్రాఫిక్‌లో వాహనాలను త్వరితగతిన నడపలేని పరిస్థితి.


ఆలస్యం.. బలైన నిండు ప్రాణం

మడకశిర: నియోజకవర్గంలో 108 వాహనాల ఆలస్యం వల్ల ప్రమాదంలో ఉన్నవారు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలున్నాయి. గత నెల 1న మడకశిర మండలం జమ్మానిపల్లిలో పెద్దరంగప్ప అనేవ్యక్తికి మొదట కడుపునొప్పి అంటూ 108 వాహనానికి కాల్‌ చేయగా కన్నడ భాషలో మాట్లాడారు. మరో చరవాణి నుంచి కాల్‌ చేయగా మడకశిరలో అంబులెన్స్‌ అందుబాటులో లేదని చెప్పారు. 10 కిలోమీటర్లు ఉన్న జమ్మానిపల్లికి 15 నిమిషాల్లో రావాల్సిన 108 వాహనం గంట ఆలస్యంగా వచ్చింది. వైద్యులు పరీక్షించి పెద్దరంగప్ప మృతి చెందినట్లు నిర్ధారించారు. కొన్నిచోట్ల వాహనాలు ఆలస్యంగా వస్తుండటంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.


ఊడుతున్న చక్రాలు.. ఆగుతున్న వాహనాలు

కదిరి పట్టణం: కదిరి పరిసరాల్లోని వాహనాల్లో పాతవే ఎక్కువ. తరచూ మరమ్మతుకు గురవుతుండటం వల్ల సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. తలుపుల వాహనం చక్రాలు పూర్తిగా పాతదైంది. ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందోనన్న భయంతో సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. 2023 మేలో కదిరి పట్టణంలో సైదాపురం వద్ద జాతీయ రహదారిపై తలుపుల మండలానికి చెందిన 108 వాహనం రోడ్డు మధ్యలో ఆగిపోయింది. వాహనం ముందు చక్రం ఊడిపోవడంతో చోదకుడు ఆపేశారు. మెకానిక్‌ సాయంతో రోడ్డుపైనే మరమ్మతు చేసుకోవాల్సి వచ్చింది.


మరమ్మతుకు ఐదారు రోజులు

రాప్తాడు: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు సర్వీస్‌ సెంటర్‌ రాప్తాడులో ఉంది. ఇక్కడకు రోజూ 5, 6 వాహనాలు మరమ్మతులకు వస్తుంటాయి. వాటిని రిపేరు చేయడానికి ఐదారు రోజుల సమయం పడుతుంది. రాప్తాడు సర్వీస్‌ సెంటర్‌కు 100 కిలోమీటర్లు దూరంలో ఉన్న కదిరి, గాండ్లపెంట, రాయదుర్గం వాహనాలు వచ్చినప్పుడు అక్కడ ప్రమాదాలు జరిగితే ప్రత్యామ్నాయంగా 108 అంబులెన్స్‌లు అందుబాటులో ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు.


ప్రైవేటును ఆశ్రయించాల్సిందే..

కళ్యాణదుర్గం గ్రామీణం: నియోజకవర్గంంలో కళ్యాణదుర్గం 2, కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాలకు ఒక్కో 108 వాహనం ఉంది. ఏవైనా ప్రమాదాలు జరిగితే సమాచారం అందిస్తే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు సమాచారం ఇచ్చినా గంటల తరబడి రాకపోవడంతో బాధితులు, క్షతగాత్రులు ప్రైవేట్‌ వాహనాల్లో ఆస్పత్రులకు చేరుతున్నారు.  కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రి ఆవరణలో కాలం చెల్లిన వాహనం శిథిలావస్థకు చేరుతోంది.


పట్టించుకునేవారేరీ?

రాయదుర్గం పట్టణం: రాయదుర్గం వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రికి కేటాయించిన అంబులెన్స్‌ మరమ్మతుకు గురై 20 రోజులు గడుస్తున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. రెండేళ్ల కిందట అన్ని మండలాలకు కొత్త అంబులెన్స్‌లు కేటాయించినప్పటికీ రాయదుర్గానికి ఇవ్వలేదు. దీంతో పాత వాహనాన్నే వినియోగించేవారు. ప్రస్తుతం పాడైంది. అంబులెన్స్‌ను అనంతపురానికి తరలించి 20 రోజులైనా పట్టించుకోవడం లేదు. మరోవైపు పాడైన ప్రభుత్వ అంబులెన్స్‌ అయిదేళ్ల నుంచి ఆసుపత్రి ఆవరణలో నిలిచిపోయింది. దాని గురించి పట్టించుకునేవారే లేరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు