logo

బరిలో పెరిగిన పోటీదారులు

జనాలకు రాజకీయాల పట్ల ఆసక్తి నానాటికి పెరుగుతోంది. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

Published : 01 May 2024 03:58 IST

గతంతో పోల్చితే ఈ దఫా ఎక్కువే

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జనాలకు రాజకీయాల పట్ల ఆసక్తి నానాటికి పెరుగుతోంది. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత 2014, 2019లో ఎన్నికలు జరిగాయి. తాజాగా.. మూడోసారి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మూడింటిని పరిగణనలోకి తీసుకుని తరిచి చూస్తే.. గడిచిన రెండు ఎన్నికల కంటే ఈదఫా జరిగే ఎన్నికల్లో పోటీతత్వం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా తెదేపా, వైకాపా, కాంగ్రెస్‌తోపాటు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల తరఫునే కాదు, స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య సైతం పెరగడం విశేషం. రాష్ట్ర చరిత్రలో అత్యధిక ఏళ్లు అధికార పాలన సాగించిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత కనుమరుగయ్యే పరిస్థితికి వెళ్లింది. దశాబ్దకాలం తర్వాత ప్రస్తుత ఎన్నికల్లో ఉనికి, బలాన్ని నిరూపించుకునే రీతిలో కదనరంగంలోకి దూకింది. ఇక విభజన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో అనంత, హిందూపురం లోక్‌సభ స్థానాలకు కలిపి 25 మంది పోటీ చేస్తే.. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో 23కు తగ్గింది. ఇపుడు ఈ రెండు స్థానాలకు ఏకంగా 34 మంది పోటీ పడుతున్నారు. ఇందులో అనంత స్థానానికి 21 మంది, హిందూపురానికి 13 మంది చొప్పున ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య 191 ఉంది. గత ఎన్నికలో ఈ సంఖ్య 163 మాత్రమే. ప్రస్తుత ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలోనే ఎక్కువగా 18 మంది పోటీ పడుతున్నారు. అతి తక్కువగా పెనుకొండలో 9 మంది బరిలో ఉన్నారు. 11 నియోజకవర్గాల్లో 13 నుంచి 15 మంది చొప్పున పోటీ చేస్తున్నారు. ఉరవకొండలో మాత్రమే 11 మంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని