logo

జాలిలేని జగన్‌ మామ..

మారుమూల మడకశిర ప్రాంతంలో నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యను అందించాలనే సదుద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి రెండు బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు మంజూరు చేయించారు.

Published : 01 May 2024 04:13 IST

90 శాతం పూర్తయిన గురుకుల భవనాలపై ఇంత కక్షనా?

గుడిబండలో అర్ధాంతరంగా ఆగిన బాలికల గురుకుల పాఠశాల, కళాశాల భవనం పనులు

మడకశిర గ్రామీణం, గుడిబండ, న్యూస్‌టుడే: మారుమూల మడకశిర ప్రాంతంలో నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యను అందించాలనే సదుద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి రెండు బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు మంజూరు చేయించారు. వాటి నిర్మాణానికి ఒక్కో భవనానికి రూ.27 కోట్ల వంతున కేటాయించారు. నియోజకవర్గంలోని మడకశిర మండలం గుండుమలలో మహాత్మాజ్యోతిబాఫులె బాలుర గురుకుల పాఠశాల, గురుకుల జూనియర్‌ కళాశాల, మండల కేంద్రమైన గుడిబండలో బాలికల గురుకుల పాఠశాల, జూనియర్‌ కళాశాలలు మంజూరుచేసి నిధులు విడుదల చేశారు. అప్పట్లో పనులు శరవేగంగా చేపట్టి 90 శాతం పూర్తి చేశారు.

గుండుమల వద్ద బాలుర గురుకుల భవన సముదాయం

వైకాపా అధికారంలోకి వచ్చాక గ్రహణం

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకులాల నిర్మాణాలకు గ్రహణం పట్టింది. అప్పటి నుంచి తట్టెడు సిమెంటు, ఇటుక వేయలేదు. ఒక్కో భవనానికి రూ.3 నుంచి రూ.5 కోట్ల మేర వెచ్చించి పూర్తిచేసి ఉంటే ఒక్కో విద్యాలయంలో 1,200 మంది విద్యార్థులు చదివేవారు. తెదేపాకు మంచిపేరు వస్తుందన్న అక్కసుతో జగన్‌ నిర్లక్ష్యం వహించారు. గుండుమల బాలుర గురుకుల పాఠశాలను మూడు విభాగాలుగా చేసి 5 నుంచి 7 వరకు ఆర్‌.అనంతపురం వద్ద ఓ భవనంలో, 8 నుంచి 10 వరకు మడకశిర డిగ్రీ కళాశాల భవన సముదాయంలోని కొన్ని గదుల్లో నిర్వహిస్తున్నారు. ఇంటర్‌ కళాశాలను ఎస్సీ బాలికల పాత హాస్టల్‌ భవనంలో అసౌకర్యాల నడుమ నిర్వహిస్తున్నారు. గుడిబండ బాలికల గురుకుల పాఠశాలను మడకశిర సమీపంలోని మెట్టిబండ ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఓ భవనంలో, జూనియర్‌ కళాశాలను గుడిబండలోని బీసీ బాలుర పాత హాస్టల్‌ భవనంలో నిర్వహిస్తున్నారు.  నాడు-నేడు అంటూ విద్యాభివృద్ధికి రూ.కోట్లు వెచ్చించామని ప్రగల్బాలు పలికిన వైకాపా ప్రభుత్వం గురుకులాలపై నిర్లక్ష్యమెందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని