logo

విశ్రాంత ఉద్యోగుల పాలిట జగనాసురుడు

సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్‌ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది.

Updated : 19 Apr 2024 06:06 IST

శేష జీవితంలో ముప్పుతిప్పలు పెడుతున్న వైనం
జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే

సుమారు 35 ఏళ్ల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు జగన్‌ సర్కారు పగలే చుక్కలు చూపిస్తోంది. శేష జీవితాన్ని హాయిగా..ఆనందగా గడపాల్సిన వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రతి నెలా పింఛను కోసం కళ్లుకాయలు కాసేలా నిరీక్షించాల్సి వస్తోంది. సమస్యల పరిష్కారం కోసం జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారన్న అక్కసుతో అష్టకష్టాలు పెడుతోంది. ప్రతి నెలా పింఛను మొత్తం రాకపోవడంతో నరకయాతన పడుతున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపులో తాత్సారం చేస్తూ ఇబ్బంది పెడుతోంది. దీర్ఘకాలిక జబ్బులతో సతమతమయ్యే వారి పరిస్థితి వర్ణనాతీతం. రీఎంబర్స్‌మెంటు బిల్లులు ఇవ్వకపోవడం.. ఈహెచ్‌ఎస్‌ కింద నగదు రహిత వైద్యం లేకపోవడంతో విలవిల్లాడుతున్నారు. రాష్ట్ర చరిత్రలో వైకాపా మినహా ఏ ప్రభుత్వం పింఛనుదారుల పట్ల మొండిగా వ్యవహరించిన దాఖలాలు లేవు.

సమస్యలు, అనారోగ్యం

అనంత, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలో మొత్తం 38వేల మంది విశ్రాంత ఉద్యోగులు, కుటుంబ పింఛనుదారులు ఉన్నారు. వీరిలో అత్యధిక శాతం మందికి పింఛనే ఆధారం. వృద్ధాప్యంలో మానసిక సమస్యలే కాదు.. రక్తపోటు(బీపీ), మధుమేహం, గుండె సంబంధిత, నరాలు-కీళ్ల నొప్పులు.. తదితర దీర్ఘకాలిక జబ్బులు వేధిస్తాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో పింఛను సకాలంలో రాకపోవడంతో వైద్యం, మందుల కోసం నానా తంటాలు పడుతున్నారు. ఈహెచ్‌ఎస్‌ కింద నగదు రహిత వైద్యం అందడం లేదు, రీఎంబర్స్‌మెంటు బిల్లులు రావడం లేదు.   పెన్షనర్లు డబ్బు చెల్లిస్తున్నా రూ.2 లక్షలకే పరిమితం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే... పింఛనుదారులు కేడర్ల ఆధారంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్‌) కింద ప్రతి నెలా రూ.225, రూ.300 ప్రకారం ప్రభుత్వం కోత పెడుతోంది. వారికి ఏ ఆస్పత్రిలోనూ నగదు రహిత వైద్యం అందడంలేదు. కనీసం రీఎంబర్స్‌మెంటు బిల్లులు చెల్లించలేని దయనీయ దుస్థితి నెలకొంది.

ఉమ్మడి అనంత జిల్లా వ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులు 38 వేల మంది ఉన్నారు. ఒకటో తేదీ పింఛను చెల్లింపు పగటి కలగా మారింది. జగన్‌ పాలనలో నరకయాతన అనుభవిస్తున్నారు.

అటకెక్కిన బకాయిలు

వైకాపా ప్రభుత్వం 11వ పీఆర్‌సీ అమలులో రివర్స్‌ నిర్ణయం తీసుకుంది. 27 ఐఆర్‌తో పింఛను వస్తుంటే.. 23 శాతం ఫిÆÆట్‌మెంటుకు తగ్గించింది. 2018 నుంచి రావాల్సిన డీఆర్‌ ఎరియర్స్‌, పీఆర్‌సీ బకాయిల ఊసేలేదు. విడతల వారీగా ఇస్తామంటూ జీవో వచ్చినా అమలు మాత్రం అటకెక్కింది.

మట్టి ఖర్చులకు రూ.25వేలు చెల్లించే ప్రక్రియను సర్కారు మరిచిపోయింది. విశ్రాంత ఉద్యోగి లేదా కుటుంబ పింఛనుదారు మృతి చెందితే మట్టిఖర్చుల కింద డబ్బు ఇవ్వడంలో తీవ్ర జాప్యం సాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా మందికి చెల్లించాల్సి ఉంది. దీనిపై వైకాపా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు.


భారంగా జీవనం

కళ్యాణదుర్గం గ్రామీణం: పట్టణంలోని పార్వతీనగర్‌కు చెందిన నరసింహులు ఉపాధ్యాయుడిగా పనిచేసి 24 ఏళ్ల కిందట పదవీ విరమణ చేశారు. కొన్ని నెలల కిందట ఆపరేషన్లు చేయించారు. ఇందు కోసం రూ.80 వేలు ఖర్చు చేశారు. నెలనెలా పింఛన్‌ సక్రమంగా రావడం లేదు. నెలకు ఔషధాల కోసం రూ.10 వేలు, ఇతర అవసరాలు, కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భార్యతో పాటు, కుమారుడు, కోడలు, మనవడు, మనవరాలు మొత్తం ఆయన పైనే ఆధారపడ్డారు. ఆపరేషన్‌ అనంతరం ఆరోగ్యం క్షీణిస్తోంది. పెన్షన్‌ సొమ్ము వస్తే తప్ప జీవనం సాగడం కష్టమవుతోంది. ఈ వయసులోనూ ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని, శేషజీవితం భారమైందని నరసింహులు ఆవేదన చెందుతున్నారు.


ఔషధాల కోసం అప్పులు

గుత్తి: గుత్తికి చెందిన బేతుల్‌బీకు భర్త రషీద్‌ పెన్షÆ£న్‌ వస్తోంది. నెలనెలా ఒకటో తేదీన రావడం లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మందుల కొనుగోలుకు ఇబ్బంది పడుతున్నారు. ఈఎంఐ చెల్లింపునకు, ఒక్కోసారి మందులు కొనుగోలుకు సొమ్ములేక అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆమె తన కుమారుడి వద్ద ఉంటున్నారు. అప్పులు చేసి వడ్డీలు కట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతినెలా పెన్షన్‌ సక్రమంగా చెల్లిస్తామని ప్రకటించిందని, కానీ, ఏనాడూ ఒకటో తేదీ ఇవ్వలేదని బేతుల్‌బీ ఆవేదన వ్యక్తం చేశారు.


మలివయసులోనూ కష్టాలే..

కదిరి, కొత్తచెరువు: కొత్తచెరువుకు చెందిన గఫూర్‌ వయసు 79 సంవత్సరాలు. మండల పరిషత్‌ సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేశారు. ఉద్యోగ విరమణతో వచ్చే పింఛను సొమ్ముతో ప్రశాంత జీవనం చేయలేని పరిస్థితి. వైకాపా ప్రభుత్వంలో ఏ నెలా సమయానికి రాని పింఛను సొమ్ము అవసరాలకు సమకూరక బతుకు దయనీయంగా మారింది. దీనికితోడు గఫూర్‌కు బీపీ, షుగర్‌తో పాటు నడవటానికి సహకరించని కాళ్లు, గుండెజబ్బు భార్య ఉన్నారు. ఆరోగ్యం కాపాడుకోవటానికి మందులకు వచ్చే పింఛనులో రూ.10 వేలతో పాటు బ్యాంకు రుణం కంతులు రూ.13 వేల పైచిలుకు ప్రతినెలా చెల్లించాల్సిన పరిస్థితి. పింఛను సకాలంలో అందక బ్యాంకుకు రూ.2,500 వరకు అపరాధ రుసుం చెల్లించాల్సిన దుస్థితి.


ఇంటి అద్దె చెల్లింపునకూ ఇబ్బందులు..

అనంతపురం: నగరానికి చెందిన కోర్టు విశ్రాంత ఉద్యోగి వేణుగోపాల్‌ పింఛన్‌ మీద ఆధారపడి జీవిస్తున్నారు. పింఛన్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పిరిస్థతి. ప్రతి నెలా అద్దె చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఐదేళ్లుగా ఎటువంటి రాయితీలూ ప్రభుత్వం చెల్లించిన పాపాన పోలేదు. నిత్యవసరాలు, మందుల ధరలు పెరగడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ప్రతినెలా 1వ తేదీన పింఛన్‌ అందితేనే తమ బతుకులు మారతాయంటున్నారు వేణుగోపాల్‌.


నియంత ప్రభుత్వం

ఐదేళ్లుగా ఈ ప్రభుత్వం నరకం చూపిస్తోంది. కనీసం ఒకటో తేదీన పింఛను చెల్లింపు జరగలేదు. ప్రతి నెలా 15వ తేదీ దాకా ఎదురుచూడాల్సి వస్తోంది.మూడేళ్లుగా ఇదే తంతు. ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న ప్రయోజనాలను సైతం రద్దు చేస్తోంది. ఇది రద్దుల ప్రభుత్వం. విశ్రాంత ఉద్యోగుల పాలిట శాపంలా తయారైంది. వృద్ధులపై కనీస గౌరవం లేదు. నియంత, మొండి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

బి.పెద్దన్నగౌడ్‌, అనంతపురం జిల్లా అధ్యక్షుడు, ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం


ఈహెచ్‌ఎస్‌తో అన్యాయం

డీఆర్‌, పీఆర్‌సీ బకాయిల చెల్లింపులోనే కాదు... ఈహెచ్‌ఎస్‌, రీఎంబర్సుమెంటులోనూ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది. 75ఏళ్లకు ఇచ్చే అదనపు క్వాంటమ్‌ను తగ్గించింది. 10, 15 శాతం ఉంటే... ప్రతి శ్లాబులో 3శాతం కోత పెట్టింది. ఇది కోతల ప్రభుత్వంగా రాష్ట్ర చరిత్ర పుటల్లో ఎక్కింది. వృద్ధాప్యంలో వ్యాధులు వెంటాడుతాయి. ఈహెచ్‌ఎస్‌ పథకం చాలా కీలకం. అది కూడా సక్రమంగా అమలు కాలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం.

శీలా జయరామప్ప, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి, పెన్షనర్ల సంఘం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని