logo

ట్రాఫిక్‌ పద్మవ్యూహం.. అభిమన్యుడూ ఛేదించలేడు

వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో చలాన్లు వేస్తున్న వైకాపా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది.

Updated : 20 Apr 2024 04:56 IST

ఉమ్మడి అనంత జిల్లాలో అంతులేని కష్టాలు
ఐదేళ్లుగా నియంత్రణ పట్టని జగన్‌ ప్రభుత్వం

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మొత్తంలో చలాన్లు వేస్తున్న వైకాపా ప్రభుత్వం తన కర్తవ్యాన్ని మాత్రం పూర్తిగా విస్మరించింది. ఐదేళ్లలో ట్రాఫిక్‌ నియంత్రణ అనే పదాన్ని పూర్తిగా మరిచిపోయింది. అనంతపురం నగరంతో పాటు ఉమ్మడి జిల్లాలోని హిందూపురం, గుంతకల్లు, తాడిపత్రి, కదిరి, రాయదుర్గం తదితర పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద నిత్యం ట్రాఫిక్‌ రద్దీ వాహనదారుల్ని అవస్థలకు గురిచేస్తోంది. నియంత్రణ అస్తవ్యస్తంగా మారడంతో గమ్యం చేరేందుకు వాహనదారులు నరకం చూస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో పాఠశాలకు పిల్లలను తీసుకెళ్లే తల్లిదండ్రుల అవస్థలు వర్ణనాతీతం. ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు కూడా నియంత్రణను గాలికొదిలేశారు. అంబులెన్సు వంటి అత్యవరస వాహనాలతో పాటు వృద్ధులు, పిల్లలతో వెళ్తున్నవారు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.

సిగ్నల్‌ వ్యవస్థ ఏదీ?

దేశంలోని చిన్నచిన్న పట్టణాల్లోనూ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థను పటిష్ఠపరిచారు. అయితే రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపురం నగరంలో ఎక్కడా ట్రాఫిక్‌ సిగ్నళ్లు పనిచేయడం లేదు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిగ్నల్‌ వ్యవస్థ నిర్వహణకు నిధులు నిలిపివేసింది. వాస్తవానికి మున్సిపాలిటీ పరిధిలోనే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కరెంటు బిల్లులు మున్సిపాలిటీనే చెల్లిస్తుంది. నిర్వహణ మాత్రం ట్రాఫిక్‌శాఖ చూసుకుంటుంది. అభివృద్ధి పన్ను పేరుతో పురవాసుల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేస్తున్నారు. గతంలో ఈ మొత్తాన్ని స్థానికంగానే ఖర్చు చేసేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నులను దారి మళ్లించారు. దీంతో మున్సిపాలిటీలు ట్రాఫిక్‌ నియంత్రణకు నిధులు కేటాయించడం లేదు. దీనికితోడు సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించడం లేదు. కొందరిని ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై నియమించి మమ అనిపించేశారు.


అడ్డదిడ్డంగా వాహన రాకపోకలు

హిందూపురంక్రాస్‌లో అస్తవ్యస్తంగా రాకపోకలు

కదిరి: పట్టణంలో వాహనాల రద్దీ పెరుగుతోంది. లక్షకు పైగా జనాభా, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే 15 వేల నుంచి 20 వేల మంది జనాభాతోపాటు వేలసంఖ్యలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, లారీలతో రోడ్లు కిక్కిరిస్తున్నాయి. దీనికితోడు శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శన భక్తుల వాహనాలు వస్తుంటాయి. కాలేజీ కూడలి నుంచి జీవిమాను కూడలి జాతీయ రహదారిపై ఉన్నాయి. బెంగళూరు మార్గంలో ఆలయం ఉంది. వ్యాపార సముదాయాలైన వలీసాబ్‌, ఇక్బాల్‌రోడ్లు 30 ఏళ్ల కిందట ఏర్పడినవి కావడంతో ఇరుకుగా మారాయి. రద్దీ నియంత్రణకు ప్రత్యేక పోలీసు వ్యవస్థ లేకపోవటంతో వాహనాల రాకపోకలు పద్మవ్యూహాన్ని తలపిస్తున్నాయి.


అనంతలో నరకమే

గాంధీనగర్‌లో వాహనాల రద్దీ

అనంత నేరవార్తలు: జిల్లా కేంద్రమైన అనంతపురం నగరంలో జనాభా ఏటా పెరుగుతోంది. తదనుగుణంగా వాహనాల సంఖ్య అధికమయ్యాయి. దీనికి తోడు నగరం విస్తరణతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. అందుకు ఇరుకైన రోడ్లు ఓ కారణమైతే, సిగ్నల్స్‌ వ్యవస్థ లేకపోవడం మరో కారణం. నగరంలో సిగ్నల్స్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సిగ్నల్స్‌ లేనిచోట్ల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో నిమిషాల తరబడి రోడ్లపై ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాతూరులో గాంధీరోడ్డుతో పాటు, తిలక్‌ రోడ్డు, మార్కెటు రోడ్డు విస్తరణకు ఇప్పటికీ గ్రహణం వీడకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.


ఎవరిదారి వారిదే..

ధర్మవరం ఎన్టీఆర్‌ కూడలి వద్ద ట్రాఫిక్‌ ఇక్కట్లు

ధర్మవరం: వాహనాల రాకపోకల రద్దీతో ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. తాడిపత్రి నుంచి ధర్మవరం మీదుగా బెంగళూరుకు భారీ వాహనాలు వెళుతున్నాయి. ఇసుక టిప్పర్లు ఇదే మార్గంలో వెళుతున్నాయి. దీంతో భారీ వాహనాలు వచ్చినప్పుడు వాహనదారులు హడలెత్తుతున్నారు. రోడ్డు దాటాలంటే పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. లారీ డ్రైవర్లు పట్టణంలో దూసుకెళుతుండటంతో ద్విచక్ర వాహనదారులను ఢీకొంటున్నారు. ఏడాది కిందట ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ ఏర్పాటు చేశారు. జీవో ఇచ్చినా సిబ్బందిని నియమించకపోవడంతో ట్రాఫిక్‌ పోలీసుల సంఖ్య తక్కువగానే ఉంది. వాహనాల సంఖ్య పెరిగినా కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ లేకపోవడంతో ఎవరికిష్టం వచ్చిన దారిలో వారు వెళుతున్నారు.


బండి తీయాలంటే భయపడాల్సిందే..

దుకాణాల ముందు రోడ్డుకు అడ్డంగా ద్విచక్ర వాహనాలు

రాయదుర్గం పట్టణం: పట్టణ జనాభాతోపాటు నిత్యం వేలాది మంది పట్టణానికి వస్తుండటం, వాహనాలు ఎక్కడపడితే అక్కడ ఆపేస్తుండటంతో ట్రాఫిక్‌ కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పట్టణవాసులు బండి తీయాలంటేనే జంకే పరిస్థితి ఏర్పడింది. కట్టడి చేయాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తుండటంతో ఇష్టమొచ్చినట్లు రోడ్డుపైనే వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు. బళ్లారి నుంచి వచ్చే వాహనాలు నిత్యం రద్దీగా ఉన్న వినాయక సర్కిల్‌లోనే రిటర్న్‌ చేస్తుండటంతో ప్రతి అరగంటకు అయిదు నిమిషాలపాటు ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వినాయక సర్కిల్‌ నుంచి తహసీల్దార్‌ రోడ్డుకు వెళ్లే దారిలో మిఠాయి దుకాణాల ముందు రోడ్డుకు ఇరువైపులా ద్విచక్ర వాహనాలు ఆపేస్తుండటంతో ముందుకు కదలలేని పరిస్థితి.


ప్రతిపాదనలన్నీ కాగితాలకే పరిమితం

గుంతకల్లులోనూ అదే పరిస్థితి..

గుంతకల్లు: పట్టణ జనాభా 1.60 లక్షలుండగా అన్నిరకాల వాహనాలు 18 వేల వరకు ఉన్నాయి. ఇరుకైన రోడ్లు, కూడళ్లు ఎక్కువ. రహదారుల విస్తరణ జరగకపోవడంతో వాహన రాకపోకలు అస్తవ్యస్తంగా మారాయి. ఫలితంగా నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్‌ నియంత్రించడానికి పదిమంది పోలీసుల అవసరం ఉండగా నలుగురు మాత్రమే ఉన్నారు. సిగ్నల్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నాలుగేళ్ల కిందట మున్సిపల్‌ కౌన్సిల్‌లో నిర్ణయించారు. ఎన్టీఆర్‌ కూడలి నుంచి భారతీయ స్టేట్‌బ్యాంకు వరకు ప్రధాన రహదారిలో, ధర్మవరంగేట్‌, గుత్తి, కసాపురం రోడ్లలో డివైడర్లు ఏర్పాటు చేయలేదు. సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం కూడా లేదు. ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ ఏర్పాటు కాగితాలకే పరిమితమవుతోంది.

  • ఉమ్మడి జిల్లా మొత్తం జనాభా: 45 లక్షలకుపైగా
  • అన్నిరకాల వాహనాల సంఖ్య: సుమారు 12 లక్షలు
  • జిల్లాలో ప్రధాన కూడళ్లు : 90
  • ట్రాఫిక్‌ నియంత్రణ సిగ్నళ్లు: ఎక్కడా పనిచేయవు
  • ట్రాఫిక్‌ పోలీసులు ఉండాల్సింది: 250
  • ప్రస్తుతం ఉన్నవారు: 110
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని