Kanipakam: కాణిపాకంలో వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

వినాయకచవితి సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

Updated : 11 Sep 2021 06:11 IST

ఐరాల: ఐరాల : చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి 9 రోజులపాటు బ్రహోత్సవాలు, 11 రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.వెంకటేశు తెలిపారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పట్టువస్త్రాలను స్వామివారి ఉత్సవ మూర్తులకు అలంకరించి శాస్త్రోక్తంగా వినాయక వ్రతకల్పాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహా మంగళహారతిని నివేదించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉత్సవాలు పూర్తి చేస్తామని తెలిపారు. అధికారులు మంత్రికి స్వామి వారి జ్ఞాపికను అందజేయగా.. పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు ఎన్‌.ఎస్‌.బాబు, ఎ.శ్రీనివాసులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11న ఉదయం ధ్వజారోహణం, రాత్రి హంస వాహన సేవ నిర్వహించనున్నారు. 12న నెమలి, 13న మూషిక, 14న శేష, 15న ఉదయం చిలుక, రాత్రి వృషభ, 16న గజ వాహన సేవలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 17న రథోత్సవం, 18న తిరుకల్యాణం, అశ్వవాహన సేవ, 19న తీర్థవారి త్రిశూల స్నానం, వడాయతు ఉత్సవం నిర్వహించనున్నారు. అదే రోజు జరిగే ఏకాంత సేవతో వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని