logo

ద్విచక్ర వాహనాల దొంగల అరెస్టు

జిల్లాలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ పొరుగు రాష్ట్రాల్లో విక్రయిస్తూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.26 లక్షల విలువ చేసే 20 ద్విచక్ర వాహనాలను

Published : 29 Jun 2022 02:24 IST

ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసిన పోలీసులు

చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే: జిల్లాలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ పొరుగు రాష్ట్రాల్లో విక్రయిస్తూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.26 లక్షల విలువ చేసే 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో చిత్తూరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. ‘ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాలతో.. చిత్తూరు ఒకటో పట్టణ సీఐ నరసింహరాజు, ఎస్సైలు సుమన్‌, వసంతకుమారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం. పాత నేరస్థులపై నిఘా పెట్టడంతో పాటు నేరాలోచనలున్న వారిని గుర్తించి వారి కదలికలపై దృష్టి పెట్టాం. పక్కా సమాచారంతో మంగళవారం ప్రత్యేక బృందం సభ్యులు స్థానిక రెడ్డిగుంట వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించగా.. రెండు వాహనాల్లో నలుగురు యువకులు వస్తుండగా.. వారిని ఆపే ప్రయత్నం చేశారు. వారు పారిపోయే ప్రయత్నం చేయగా బృందం సభ్యులు వారిని వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పారిపోయారు. అందులో పట్టుబడిన తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాకు చెందిన కార్తిక్‌(26), వసంత్‌(23)లను విచారించగా కొంత కాలంగా చోరీలకు పాల్పడుతున్నట్లు తేలింది. జిల్లాలో బైక్‌లను చోరీ చేస్తూ వాటిని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విక్రయిస్తూ.. జల్సాలు చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. వారి విచారణలో రూ.12 లక్షల విలువ చేసే ఆరు బుల్లెట్‌ వాహనాలు, రూ.14 లక్షల విలువ చేసే 12 బైక్‌లు స్వాధీనం చేసుకున్నాం. వారిని విచారిస్తుండగా.. మరికొన్ని వాహనాల వివరాలు వచ్చాయి. సుమారు 30 వాహనాలు వారికి సంబంధించిన వ్యక్తుల వద్ద ఉన్నట్లు తేలింది. త్వరలోనే వాటిని కూడా స్వాధీనం చేసుకుంటాం. పారిపోయిన మరో ఇద్దరిని కూడా అరెస్టు చేస్తాం’ అని వివరించారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు చెందిన బైక్‌ల చోరీ కేసును ఛేదించడానికి కృషి చేసిన సీఐ, ఎస్సైలు, సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని