logo

ఆహారశుద్ధి.. మాటల్లోనే లబ్ధి..!

రైతులు అధికంగా పండిస్తున్న పంటల మేరకు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలి. ఆహారశుద్ధి రంగంలో అనుసరిస్తున్న కొత్త సాంకేతిక విధానాలు అనుసరిద్దాం. ఇందుకోసం రూ.2,900 కోట్లు వెచ్చించనున్నాం. రైతులకు మంచి ధరలు అందించడమే మనం లక్ష్యం.

Updated : 11 Mar 2024 05:17 IST

కొత్త పాలసీ అంటూ సమీక్షలతో సరి
ఐదేళ్లుగా నాన్చుతున్న జగన్‌

రైతులు అధికంగా పండిస్తున్న పంటల మేరకు పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలి. ఆహారశుద్ధి రంగంలో అనుసరిస్తున్న కొత్త సాంకేతిక విధానాలు అనుసరిద్దాం. ఇందుకోసం రూ.2,900 కోట్లు వెచ్చించనున్నాం. రైతులకు మంచి ధరలు అందించడమే మనం లక్ష్యం. నిర్ణీత ధరలకు కొనుగోలు చేస్తామని ముందుగానే చెబుతాం.

2020 నవంబరు 11 న ఫుడ్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్లపై సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ హామీలు

ప్రణాళికలను అనుసరించి అద్భుతాలు సృష్టిస్తామని సీఎం గొప్పలు చెప్పగా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా తయారయ్యాయి. ఏపీ ఆహారశుద్ధి పాలసీ 2020-25 తెచ్చిన ప్రభుత్వం రాయితీలు ప్రకటించి మిన్నకుండిపోయింది. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించలేదు. చిన్న, మధ్య తరహా పరిశ్రమకు రూ.కోట్ల రాయితీ ఉన్నా ఇందుకు తగు ప్రోత్సాహాలు కరవయ్యాయి. ఎన్నికల ముందు నిర్మించు.. నిర్వహించు పద్ధతిలో యూనిట్లు తీసుకురావడానికి యత్నిస్తున్నట్లు నటిస్తోంది. వీటిని ప్రజలు, రైతులు నిశితంగా గమనిస్తున్నారు.

గూడూరు, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో ఐదేళ్లుగా మూడు ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చినా అవి పూర్తి కాలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వాయల్పాడు మండలంలో ఓ కంపెనీకి ఏపీఐఐసీ 45 ఎకరాలు కేటాయించింది. ఇక్కడ స్పెషలైజ్డ్‌ ఫుడ్స్‌ ప్రై లిమిటెడ్‌ ముందుకొచ్చింది. ఇక్కడ డ్రై వేర్‌ హౌజ్‌, కోల్ట్‌ స్టోరేజ్‌, ప్యాక్‌ హౌజ్‌, రైపనింగ్‌ ఛాంబర్స్‌, డెమోనిస్ట్రేషన్‌ ప్లాంట్‌, మెటీరీయల్‌ హ్యాండ్లం్ వంటి మౌలిక వవసతులు సమకూర్చాల్సి ఉంది. ఈ పరిశ్రమకు అడుగులు తడబడుతున్నాయి.

కోట మండలం కొత్తపట్నం గ్రామంలో 53.74 ఎకరాల్లో భూములు తీసుకున్న మరో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రై లిమిటెడ్‌ నిర్మాణ దశ దాటలేదు. కోర్‌ ప్రాసెసింగ్‌ కింద ఎగ్‌ లిక్విడ్‌ కన్‌వర్షన్‌, ఎగ్‌ పౌడర్‌ మేకింగ్‌, డీప్‌ ఫ్రీజ్‌, బ్లాస్ట్‌ ఫ్రీజింగ్‌ లైన్‌, డ్రై వేర్‌హౌజ్‌ వంటి వసతులు సమకూర్చాల్సి ఉంది. మూడేళ్లుగా దీన్ని నాన్చుతున్నారు. ఇదే ప్రాంతంలో 52.22 ఎకరాల్లో మెగా ఫుడ్‌ పార్కు ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఆక్వా ఫీడింగ్‌, కోల్డ్‌ స్టోరేజ్‌ తదితర వసతులు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఆక్వా ఉత్పత్తుల శుద్ధి, ఎగుమతులకు అవకాశం ఉంటుంది. తద్వారా గిట్టుబాటు ధరలు లభిస్తాయని భావించారు. కాగా ఈ పరిశ్రమ ఇంకా సంపూర్ణంగా పూర్తి చేయలేదు.

ఈ పంటలెక్కువ..

ఉమ్మడి జిల్లాలో మామిడి, టమాటా, అరటి, బత్తాయి, చెరకు, బొప్పాయి వంటి పంటలకు; చికెన్‌, కోడిగుడ్లు, పాలు వంటి ఉత్పత్తులకు ఆహార శుద్ధి పరిశ్రమల ఆవశ్యకత ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓ పరిశ్రమ తెదేపా హయాంలో మంజూరు కాగా ప్రస్తుతం రన్నింగ్‌లో ఉంది. వైకాపా వచ్చిన తర్వాత ఒక్కటీ ముందుకు రాకపోవడం గమనార్హం.

ఎన్నికల ముందు టెండర్లు..

ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో తాజాగా టెండర్లు పిలిచారు. గంగవరం మండలం అటుకురాళ్లపల్లిలో ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్‌ లీజుకు ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ మోడల్‌ బ్లాక్‌ ఏర్పాటుకు రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ కోరడం గమనార్హం. ఇవి మార్చి 3 చివరి తేదీ కాగా ఎన్నికల ముందు ఎలా ప్రక్రియ ముందుకెళ్తోందో తెలపాల్సి ఉంది.

కేంద్ర పథకాలు పట్టించుకుంటేగా?

ప్రధానమంత్రి కిసాన్‌ సంపద యోజన వంటి పథకాల ద్వారా మెగా ఫుడ్‌ పార్కులు, కోల్డ్‌చైన్‌, వాల్యూ అడిషన్‌ మౌలిక వసతులు, అగ్రో శుద్ధి క్లస్టర్‌లు ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ఇందుక రాయితీలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికి  వీలుండగా.. చాలా చోట్ల ప్రభుత్వ చొరవ లేక బ్యాంకులు ముందుకు రావడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని