logo

Tirupati: నే చూసుకుంటా.. నువ్వు అమ్మేయ్‌!

రెవెన్యూ రికార్డులు, ఆన్‌లైన్‌లోనూ అది ప్రభుత్వ భూమే. పైగా న్యాయస్థానంలో కేసు నడుస్తోంది.

Updated : 14 Mar 2024 08:31 IST

ప్రభుత్వ భూమిలో స్థిరాస్తి వ్యాపారం!
వైకాపా నేత అండతో దందా


ప్రభుత్వ భూమిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు

ఈనాడు-తిరుపతి; న్యూస్‌టుడే, మంగళం: రెవెన్యూ రికార్డులు, ఆన్‌లైన్‌లోనూ అది ప్రభుత్వ భూమే. పైగా న్యాయస్థానంలో కేసు నడుస్తోంది. ఈ స్థలం జోలికి వెళ్లకూడదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందిన కాడికి దోచుకోవాలని ఆరాటపడుతున్న ఓ వైకాపా నేత అండగా నిలవడంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. సదరు స్థలంలో ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. అందులో నిర్మాణాలు చేస్తున్నారు. ఇదీ రేణిగుంట మండలంలో అధికార పార్టీ నేత ఆధ్వర్యంలో నడుస్తున్న కబ్జాపర్వం.

రేణిగుంట మండలం అన్నాసామిపల్లిలోని సర్వే నంబరు 385లో 31.65 ఎకరాల భూమి ఉంది. దీన్ని 2012 ఏప్రిల్‌లోనే అనాధీనం (ప్రభుత్వ భూమి)గా పేర్కొంటూ మ్యుటేషన్‌ చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. భూ రిజిస్టర్‌తోపాటు రెంట్‌ రిజెక్షన్‌ చట్టం 1947ని అనుసరించి అన్నాసామిపల్లె గ్రామంలోని సర్వే నంబరు 385 పట్టా భూమి కాదని ప్రత్యేక కమిషనర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ సెటిల్‌మెంట్స్‌ 1997లోనే ఉత్తర్వులు ఇచ్చారు. రెంట్‌ రిజెక్షన్‌ చట్టాన్ని గ్రామానికి వర్తించే సమయంలో ఇక్కడ 16.50 ఎకరాల మేరకు మాత్రమే పట్టా భూమి ఉందని స్పష్టం చేశారు. అందువల్ల సర్వే నంబరు 385లోని భూమి రైత్వారీ భూమి కాదని నిర్ధారించారు. దీంతో 1986లో నెల్లూరు సెటిల్‌మెంట్‌ అధికారి కొందరి పేరిట జారీ చేసిన రైత్వారీ పట్టాలను సైతం రద్దు చేశారు. ఆపై సీసీఎల్‌ఏ (అప్పీల్స్‌) కొందరు వ్యక్తులకు అనుకూలంగా ఆదేశాలివ్వడంతో ప్రభుత్వం దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

అడ్డగోలుగా విక్రయాలు

న్యాయస్థానంలో కేసు నడుస్తుండటంతోపాటు రెవెన్యూ రికార్డుల్లో ప్రస్తుతం ఎక్కడా ప్రైవేటు వ్యక్తుల పేర్లు పొందుపర్చలేదు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం మొదలుపెట్టారు. సుమారు 24 అంకణాలు (96 గజాలు) రూ.7 లక్షలకు విక్రయిస్తున్నారు. కొనుగోలు చేస్తున్న వ్యక్తులకు రూ.100 స్టాంపు పేపరుపై రాసి ఇస్తున్నారు. ఎక్కడా రిజిస్ట్రేషన్లు చేయట్లేదు. ఇబ్బంది వస్తే తాము చూసుకుంటామని, ఇళ్లు నిర్మించుకోవచ్చని నమ్మబలుకుతున్నారు.

రికార్డుల్లో లేకుండానే

రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబరు 385లోని భూమి ప్రభుత్వ భూమిగానే చూపిస్తున్నారు. 2019లో అప్పటి కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎఫ్‌8/4495/2013 కింద రిజిస్ట్రేషన్లు చేయకుండా సర్వే నంబరును నిషేధిత జాబితాలోనూ పొందుపర్చారు. దీంతో రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పు చేసుకోకుండా నిబంధనలు అతిక్రమించి విక్రయాలు ఎలా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. న్యాయస్థానంలో పోరాటం చేస్తున్న వ్యక్తుల వెనుక కొందరు వైకాపా నేతలు ఉండి వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎన్నికలు పూర్తయ్యే నాటికి వీలైనన్ని ప్లాట్లు విక్రయించాలని చూస్తున్నారు. న్యాయస్థానంలో అది ప్రభుత్వ భూమిగా నిర్ధారిస్తే నష్టపోయేది నిరుపేదలేనన్న వాదనలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు