logo

జగన్‌ సర్కార్‌పై మత్స్యకారులు గుర్రు

‘మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వైకాపా అడుగు ముందుకేస్తోంది. వాకాడు మండలం రాయదొరువు వద్ద మత్స్యకారుల వలసల నివారణ, స్థితిగతులు మెరుగు పరచడానికి ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం’.

Published : 29 Mar 2024 02:34 IST

ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్ల పేరిట దగా
మూడు చోట్ల మంజూరైనా ఒక్క చోటే శంకుస్థాపన

‘మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా వైకాపా అడుగు ముందుకేస్తోంది. వాకాడు మండలం రాయదొరువు వద్ద మత్స్యకారుల వలసల నివారణ, స్థితిగతులు మెరుగు పరచడానికి ఇక్కడ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నాం’ అంటూ ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గతేడాది నవంబర్‌ 21న వర్చువల్‌గా సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. తీర ప్రాంతాల్లో మూడు చోట్ల మంజూరైతే ఒక్క చోట శంకుస్థాపనతో సరిపెట్టేశారు.

గూడూరు, న్యూస్‌టుడే: తీరప్రాంతంలో ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటు.. ఉపాధి పెరుగుదలకు చేస్తున్న చొరవ.. ఎక్కడెక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారన్న వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రశ్నకు లోకసభలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పరుషోత్తం రుపాల గతేడాది సమాధానం ఇచ్చారు. తిరుపతి జిల్లాలో మూడు చోట్ల ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు లిఖిత పూర్వకంగా వివరించారు.

గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లోని 3 ప్రాంతాల్లో రూ.59.10 కోట్లు ఫిషింగ్‌ ల్యాండ్‌సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం నిధులు కేటాయించింది. ఇందులో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రూ.25.02 కోట్లు వాకాడు మండలం రాయదొరువుకు కేటాయిచింది. దుగరాజపట్నం, భీములవారిపాళెంలో రెండు చోట్ల సెంటర్‌లకు సాగరమాల కింద నిధులు అందజేసినా ఉపయోగించుకోలేదు. చెబుతున్నదొకటి.. చేస్తున్నదొకటిగా వీరి పాలన ఉందంటూ ఆగ్రహిస్తున్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని జగన్‌.. ఎన్నికల ముందు పనులకు శంకుస్థాపనలు చేసి మమ అనిపించారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఉపయోగించుకోలేని దుస్థితి ఉంది.

నాలుగు నెలలు కావస్తున్నా ఒక్క అడుగు పడలేదు. నిధులు లేక ఏర్పాటుకు టెండర్లు పిలవలేదు. పరిపాలనా అనుమతులూ లేకుండా నాటకం ఆడినట్లు  తెలిసింది. మత్స్యశాఖ శాఖ కనీసంగా టెండర్ల ప్రక్రియ చేపట్టలేదు. రాష్ట్రం నుంచి నిధులు వెచ్చించాల్సి రావడం బడ్జెట్‌లో ఇందుకు కేటాయింపులు లేకపోవడంతో శంకుస్థాపన డ్రామా ఆడారు.

ఆ రెండు చోట్ల తొక్కిపెట్టి...:  సాగరమాల పథకంలో భాగంగా ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌లు, ఫ్లోటింగ్‌ జెట్టీలు.. ఇతర మౌలిక వసతులకు కేంద్రం సాగరమాల కింది నిధులు కేటాయించింది. ఇందులో వాకాడు మండలం దుగరాజపట్నంలో రూ.17.79 కోట్లు, తడ మండలం భీములవారిపాళెంలో రూ.16.29 కోట్లు నిధులు కేటాయించినట్లు గతేడాది మార్చిలో వైకాపా ఎంపీ ప్రశ్నకు వచ్చిన సమాధానం కాగా.. ఏడాదిగా రాష్ట్ర ప్రభుత్వం దాటేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని