logo

జరుగు జరుగు.. జాబుల్లేవ్‌ జగన్‌

ఏటా ప్రారంభంలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తా.. మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తా.. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అంతమొందించడమే ధ్యేయంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికల సమయాన నిర్వహించిన పాదయాత్రలో గొప్పగొప్ప హామీలు గుప్పించారు..

Updated : 05 May 2024 03:08 IST

క్యాలెండర్‌ ఎక్కడన్నా ఉద్యోగాలంటూ ముంచేశావ్‌
మండిపడుతున్న నిరుద్యోగులు
న్యూస్‌టుడే, చిత్తూరు గ్రామీణ, పెనుమూరు, ఐరాల, జీడీనెల్లూరు

ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు

ఏటా ప్రారంభంలోనే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తా.. మెగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తా.. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని అంతమొందించడమే ధ్యేయంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గత ఎన్నికల సమయాన నిర్వహించిన పాదయాత్రలో గొప్పగొప్ప హామీలు గుప్పించారు.. అడుగడుగునా చిలుక పలుకులు పలికారు.. నిరుద్యోగులపై ఎక్కడాలేని ప్రేమ ఒలకబోశారు.. తీరా ఎన్నికలయ్యాయి.. అధికారం చేపట్టారు.. చివరకు అంతా తుస్‌.. తుస్‌.. మనిపించి నిరుద్యోగ యువతను నిట్టనిలువునా ముంచారు.. జాబ్‌ క్యాలెండర్‌ మాట అటుంచితే అసలు క్యాలెండరే లేకుండా చేశాడని యువత వాపోతున్నారు.. ఉద్యోగ, ఉపాధి కోసం ఐదేళ్లుగా నిరీక్షించి తమ కళ్లు కాయలు కాశాయని, చివరకు ఒరిగిందేమీ లేదని.. కనీసం డీఎస్సీ పెట్టిన దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


చివరకు నిరాశే మిగిలింది..

మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో తమ జీవితాల్లో ఎంతో వెలుగు వస్తుందని ఆశపడ్డాం. అదికాస్తా నిరాశగానే మిగిలింది. చివరకు డీఎస్సీపై ఎలాంటి చర్యలు లేవు. ఇంతకన్నా దారుణం మరోటి లేదు. దీంతో ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసుకోవాల్సి వచ్చింది.

జ్యోతి, పెనుమూరు


విన్నాం.. మోసపోయాం..

ముఖ్యమంత్రి జగన్‌ మాటలు ఎంతగానో నమ్మాం. జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశ పడ్డాం. భవిష్యత్తులో ఆర్థికంగా ఎదగడానికి భరోసా వస్తుందని భావించాం. చివరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. ఎన్నికల సమయాన హడావుడిగా డీఎస్సీ ప్రకటించినా ఫలితంలేదు.

యోగనందిని, పేటనత్తం, జీడీనెల్లూరు


ఎదురుచూపులు తప్ప మేలు లేదు..

మెగా డీఎస్సీ నిర్వహించి యువతను ఆదుకుంటామనే ముఖ్యమంత్రి మాటలు గుడ్డిగా నమ్మాం. ఐదేళ్లుగా ఉద్యోగావశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా రాలేదు. ఎదురు చూపులు తప్ప ఫలితం లేదు.

ఆశాగ్రేసి, తెల్లగుండ్లపల్లె, ఐరాల మండలం


జాబ్‌ క్యాలెండర్‌ ఏదీ..?

నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన సీఎం మాటలు కార్యరూపం దాల్చలేదు. దీంతో నిరుద్యోగ యువత నిరాశలో మునిగిపోయింది. ఒక్కసారి కూడ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన దాఖలాలు లేవు. దీంతో నిరుద్యోగం పెరిగిపోతోంది.

మోహన్‌కుమార్‌, డీఈడీ విద్యార్థి, కుక్కలపల్లె, చిత్తూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని