logo

గడిచాయి ఐదేళ్లు.. ఏవీ నీళ్లు?

‘వడ్డించే వాడు మనవాడైతే.. బంతిలో చివర కూర్చున్నా అన్నీ అందుతాయి’ అన్నది సామెత. రాష్ట్ర ప్రభుత్వం, వైకాపాలో నంబరు-2 అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, ఎంపీ మిథున్‌రెడ్డిది మన జిల్లానే కావడంతో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని ప్రజలు భావించారు.

Published : 05 May 2024 03:13 IST

కొలిక్కిరాని వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు
జగన్‌ సన్నిహిత సంస్థకు పన్నులు కట్టబెట్టినా సాగని పనులు

కుప్పం మున్సిపాలిటీ ఏడో వార్డు రాజీవ్‌కాలనీలో ట్యాంకరు వద్ద నీటి కోసం వేచిచూస్తున్న మహిళలు

ఈనాడు, చిత్తూరు: ‘వడ్డించే వాడు మనవాడైతే.. బంతిలో చివర కూర్చున్నా అన్నీ అందుతాయి’ అన్నది సామెత. రాష్ట్ర ప్రభుత్వం, వైకాపాలో నంబరు-2 అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, ఎంపీ మిథున్‌రెడ్డిది మన జిల్లానే కావడంతో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతాయని ప్రజలు భావించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చకచకా సాగుతాయని ఆశలు పెట్టుకున్నారు. సీఎం ఇచ్చిన హామీలే కాక ఇవ్వనవీ అమలవుతాయని భావించింది. వారే స్వయంగా చెప్పిన వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు పనులైతే వాయువేగంతో సాగుతాయని, ప్రతి ఇంటికీ 24 గంటలూ రక్షిత నీరు అందుతుందనుకున్నా ఇవన్నీ తలకిందులయ్యాయి. ఐదేళ్లుగా కాగితాల్లోనే నీళ్లు ప్రవహించాయి. వైకాపాను నమ్మి ఓటేసినందుకు ప్రజానీకం నట్టేట మునిగింది.

ఇదీ తెదేపా ప్రణాళిక: తెదేపా పాలనలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించేందుకు వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని అమలు చేయాలని తలచారు. తొలిదశలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులున్న పడమటి మండలాలకు కడప జిల్లా గండికోట జలాశయం నుంచి 2.20 టీఎంసీల నీటిని తెచ్చి 28 మండలాల్లోని 4,780 గ్రామాలకు అందించాలనేది లక్ష్యం. ఆపై తూర్పు ప్రాంతంలో పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రూ.4,375 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసి టెండర్లు ఖరారు చేశారు. 2019 జూన్‌ నెలాఖరులో పనులు ప్రారంభించి 2021 జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పుంగనూరుకే పరిమితం చేసి: పుంగనూరు నియోజవర్గంలోని ఆరు మండలాల్లోని 59,607 గృహాల్లో 2.38 లక్షల మందికి తాగునీటి అవస్థలు తప్పిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితమైన, తెలంగాణలో మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన సంస్థకు రూ.2,340 కోట్లతో టెండర్‌ను కట్టబెట్టారు. గతేడాది ఫిబ్రవరి 9న ఆ సంస్థతో అధికారులు ఒప్పందం చేసుకున్నారు. పనుల పూర్తికి 30 నెలల గడువు విధించారు.

‘విపక్ష నేత హోదాలో జగన్‌ సుదీర్ఘ పాదయాత్రలో జిల్లా ప్రజల కష్టాలు స్వయంగా చూశారు. ప్రజలు నీటి కోసం పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. అందుకే శాశ్వత పరిష్కారానికి వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును అమలు చేసి నీటిఎద్దడిని తీరుస్తాం’

2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేట ఎంపీ, వైకాపా లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి.

‘కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్‌ గ్రాంట్‌తో రాష్ట్రవ్యాప్తంగా వాటర్‌గ్రిడ్‌ పథకం చేపడుతున్నాం. రానున్న రోజుల్లో జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం’

సీఎం జగన్‌ కేబినెట్‌లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అధికారులతో నిర్వహించిన సమీక్షలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన మాటలివి.

రోజుకు ఒక్కో వ్యక్తికి 105 లీటర్లు అంటూ.. : గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి రోజుకు 105 లీటర్లు, మున్సిపాలిటీలలో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రస్తుతం డిజైన్లు, డ్రాయింగ్‌, సర్వే పనులే జరుగుతున్నాయి. ఒప్పందం జరిగి 13 నెలలు దాటినా పైప్‌లైన్ల ఏర్పాటే ప్రారంభం కాలేదు. ఇక పనులు ఎప్పుడు మొదలవుతాయి? ఎప్పుడు పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకమే.

ట్యాంకర్లకే రూ.110 కోట్లు

కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో ఐదేళ్లలో ట్యాంకర్ల ద్వారా అరకొరగా నీరు సరఫరా చేసేందుకు దాదాపు రూ.110 కోట్లు ఖర్చయింది. రాబోయే రోజుల్లో ఇది మరింత అధికం కానుంది. అదే వాటర్‌గ్రిడ్‌ను ఈ రెండు నియోజకవర్గాల్లోనూ అమలు చేస్తే దాదాపు 6.20 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.


ఇదీ వైకాపా విఫల చరితం

రామకుప్పం మండలం 89.పెద్దూరులో నీటి కోసం వేచిచూస్తున్న మహిళలు

2019 మే నెలలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని పక్కనపెట్టింది. నూతనంగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందిస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పారు. అనంతరం తీవ్ర తర్జనభర్జనలు పడి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరుకు మాత్రమే పరిమితం చేశారు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకూ నీళ్లు అందించాలని ప్రజల నుంచి డిమాండ్లు వచ్చినా వైకాపా నేతలు బుట్టదాఖలు చేశారు. దీంతో ప్రస్తుత చిత్తూరు జిల్లాలో ఒక్క పుంగనూరుకే వాటర్‌గ్రిడ్‌ ప్రతిపాదించారు. 2022 చివరి నాటికి ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. గండికోట రిజర్వాయర్‌ నుంచి పైప్‌లైన్లతో తంబళ్లపల్లె, మదనపల్లె మీదుగా పుంగనూరుకు నీళ్లు చేర్చి శుద్ధి చేస్తామని పేర్కొన్నారు.


ఎద్దడి నివారణ పట్టించుకోక

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఐదేళ్లలో నీటిఎద్దడి నివారణకు ఒక్క అడుగూ వేయలేదు. తెదేపా హయాంలో పూర్తి చేసిన టెండర్లకు అనుగుణంగా పనులు మొదలుపెట్టి ఉంటే ఈపాటికి ఇంటింటికీ నీళ్లు వచ్చేవి. తాగునీటి సమస్య అధికంగా ఉండే కుప్పం వరకు వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును పొడిగిస్తే బాగుంటుంది.

సతీష్‌కుమార్‌, కుప్పం పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని