logo

ఇదేం జగన్‌.. ఇలా చేశావ్‌

చేతికందినా.. నోటికందలేదన్న సామెత పింఛన్ల లబ్ధిదారులకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది.

Published : 07 May 2024 02:59 IST

వినియోగంలో లేని ఖాతాల్లో నగదు
బ్యాంకుల చుట్టూ పండుటాకుల ప్రదక్షిణ

  • చిత్తూరు 23వ డివిజన్‌ పరిధిలోని జానకారపల్లికి చెందిన మహిళకు..వినియోగంలేని ఖాతాకు పింఛను నగదు జమచేశారు. ఈ విషయం తెలియక వార్డు సచివాలయం చుట్టూ పలుమార్లు పింఛను కోసం కాళ్లరిగేలా తిరిగిన ఆమెకు.. వినియోగంలో లేని ఖాతాకు నగదు జమ చేసినట్లు తెలుసుకుని చేసేదేమీలేక మిన్నకుండిపోయారు.
  • పుత్తూరు పురపాలక సంఘంలో 5,877 పింఛను లబ్ధిదారులు ఉండగా.. 1,504 మందికి ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. మిగిలిన వారికి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. వీరిలో కొందరికి వినియోగంలో లేని ఖాతాలకు నగదు జమ అయింది.

న్యూస్‌టుడే, చిత్తూరు నగరం: చేతికందినా.. నోటికందలేదన్న సామెత పింఛన్ల లబ్ధిదారులకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. నగరంలో పింఛన్ల కోసం లబ్ధిదారులకు పాట్లు తప్పడం లేదు. నగరంలో కొందరికి వినియోగంలేని ఖాతాలకు డీబీటీ విధానం ద్వారా జమ చేయడంతో..ఇప్పటికీ వారికి నగదు అందలేదు. వృద్ధులకు ప్రతి నెల వైద్య ఖర్చులకు ఉపయోగపడుతున్న పింఛను నగదు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అందకుండా పోతోంది.

చిత్తూరు నగరంలో మొత్తం 16627 మంది పింఛన్ల లబ్ధిదారులు ఉండగా..వీరిలో 11587 మందికి డీబీటీ విధానం ద్వారా బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. మిగిలిన 5040 మందికి ఇంటి వద్దకు వెళ్లి నేరుగా పంపిణీ చేశారు.డీబీటీ విధానం ద్వారా బ్యాంకులో చేసిన పింఛను నగదు 400 మందికి పైగా అందలేదు. గతంలో పింఛను లబ్ధిదారులు ఇచ్చిన బ్యాంకు ఖాతా నంబర్లకు నగరపాలక అధికారులు జమ చేసేశారు. ప్రస్తుతం ఇందులో కొన్ని బ్యాంకు ఖాతాలను లబ్ధిదారులు వివిధ కారణాలతో కొనసాగించలేదు. మరికొన్ని ఖాతాలను క్లోజ్‌ చేసుకున్నారు. సదరు వినియోగంలేని ఖాతాలకు నగదును జమ చేయగా..సంబంధిత వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు నగదు అందక ఇబ్బందులు పడుతున్నారు.

నగదు పంపిణీ చేశాం..

వినియోగంలేని ఖాతాలకు జమ చేసిన నగదును సంబంధిత లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టాం. సంబంధిత బ్యాంకు వద్దకు లబ్ధిదారుల్ని పిలిపించుకుని వారికి నగదును నేరుగా డ్రాచేసి అందజేస్తున్నాం.

గోపి, మెప్మా సీఎంఎం, చిత్తూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు