logo

మురిపించి.. విస్మరించి..

 గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనే బండికి వ్యవసాయం, పాడి.. జోడుచక్రాలు. ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో వ్యవసాయ రంగం కుదేలైంది.

Published : 07 May 2024 03:05 IST

మందులివ్వక.. ఖాళీలు భర్తీ చేయక
ఐదేళ్లుగా పాడి పరిశ్రమపై జగన్‌ సర్కార్‌ నిర్లక్ష్యం
ప్రభుత్వ వైఖరితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలు 

గుడుపల్లెలోని ప్రభుత్వ పశువైద్యశాల

ఈనాడు, చిత్తూరు- న్యూస్‌టుడే, గుడుపల్లె:  గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనే బండికి వ్యవసాయం, పాడి.. జోడుచక్రాలు. ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో వ్యవసాయ రంగం కుదేలైంది. ఈ సమయంలో పాడి ఎంతోకొంత చేయూతనందిస్తుందని ఆశించినా వైకాపా ప్రభుత్వ నిర్వాకంతో వారూ నష్టపోయారు. ఫలితంగా పశువులను కబేళాలకు అమ్మేయాల్సిన దుస్థితి ఎదురైంది.

జిల్లావ్యాప్తంగా 5.40 లక్షల ఆవులు, 7.09 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయి. ఏడు  నియోజకవర్గాలూ గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నాయి. పల్లెల్లో దాదాపు ప్రతి ఇంట్లోనూ కనీసం ఒక పాడి ఆవును పోషించే పరిస్థితి ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థలో భాగంగా పశుసంవర్ధక సహాయకుల (ఏహెచ్‌ఏ)ను నియమించేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ మేరకు పోస్టులను మాత్రం భర్తీ చేయలేదు. ఉన్నవారిలో సైతం కొందరు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.

కాగితాల్లోనే మందులు

రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) ద్వారా పశువైద్యాన్ని పాడి రైతుల ఇంటి ముంగిటకే తెచ్చామని ముఖ్యమంత్రి జగన్‌ గొప్పలు చెబుతున్నారు. ఈ వ్యవస్థ ప్రారంభమైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేల విలువైన మందులు సరఫరా చేసింది. ఆ తర్వాత రెండేళ్లపాటు ఔషధాలు ఇచ్చిందే లేదు. దీంతో పశుసంవర్ధక సహాయకులు మందులు రాసిస్తే రైతులు బయట కొనుగోలు చేశారు. ప్రభుత్వం మాత్రం 108 రకాల మందులను ఉంచాలని చెప్పినా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. మూడు నెలలకోసారి ఔషధాలు సరఫరా చేయాల్సి ఉన్నా ఆరు నెలలకోసారి పంపిస్తున్నారు. అవీ అరకొరగా ఇస్తున్నారు.

ఎన్ని గొప్పలో..: మనుషుల ఆరోగ్యానికే కాదు పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత, భరోసా కల్పిస్తూ పాడి రైతులకు, పశు పెంపకందార్లకు మేలు చేసేలా విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యమంత్రి జగన్‌ ఘనంగా ప్రకటించారు. మూగజీవాలకు ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్న ఘనత తనకే దక్కిందని గొప్పలు పోయారు.

క్షేత్రస్థాయిలో దుస్థితి: ముఖ్యమంత్రి చెప్పిన విప్లవాత్మక మార్పులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడా రాలేదు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని పాడి రైతులు పశువులకు వైద్యం చేయించేందుకు కర్ణాటకలోని ప్రైవేటు వ్యక్తులపై ఆధారపడుతున్నారు. కనీసం మందులు కూడా అందుబాటులో లేనందున బయట దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది.  

130 పోస్టులు ఖాళీగానే..  

జిల్లాలోని 31 మండలాల్లో కలిపి 502 మంది పశుసంవర్ధక సహాయకులు సేవలు అందించాలి. ప్రస్తుతం 372 మంది మాత్రమే విధుల్లో ఉండగా 130 పోస్టులు భర్తీ చేయాలి. పలమనేరు, పుంగనూరు, కుప్పం నియోజకవర్గాల్లోనే ఎక్కువగా ఖాళీలున్నాయి. ఈ క్రమంలోనే రైతులు కర్ణాటకలోని ప్రైవేటు పశువైద్యులకు ఫోన్లు చేసి సేవలు వినియోగించుకుంటున్నారు. రూ.400- రూ.800 వారు వసూలు చేస్తున్నారు. పడమటి మండలాల్లోని ప్రజలు పాడిపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. అటువంటప్పుడు ఇక్కడే ఎక్కువ ఖాళీలుంటే ఏవిధంగా జీవనం ముందుకు సాగుతుందో ప్రభుత్వమే చెప్పాలి.

అంతుపట్టని వ్యాధినీ పట్టించుకోక..

కుప్పం మండలం రాజనంలో దాదాపు 20 పాడి ఆవులు మృత్యువాత పడ్డాయి. ఇలా ఎందుకు జరిగిందో రైతులకు ఇప్పటివరకూ అంతుపట్టలేదు. ఈవిషయంలో అవగాహన కల్పించాల్సిన యంత్రాంగం సైతం నిర్లిప్తంగా వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి.


ఈ రైతు పేరు నారాయణప్ప. స్వస్థలం గుడుపల్లె మండలం పెద్దగొల్లపల్లి. ఈయనకు రెండు పాడి ఆవులున్నాయి. వాటికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో కర్ణాటకలోని ప్రైవేటు పశువైద్యుడి వద్దకు తీసుకెళ్తే రూ.2,600 ఖర్చయింది. ప్రభుత్వ వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. గుడుపల్లె మండలంలో 18 మంది పశుసంవర్ధక సహాయకులకుగాను ఇద్దరు మాత్రమే ఉన్నారు.  


ఈయన పేరు ఆర్‌.కృష్ణప్ప. గుడుపల్లె మండలం కాడేపల్లివాసి. పశువైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే మందులు లేవని.. రాసిస్తాం.. బయట కొనుక్కోమని చెప్పారు. ఇలా ఉంటే మా జీవనం ఎలా సాగుతుందని కృష్ణప్ప వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని