logo

పెద్దిరెడ్డి 142 ఆస్తుల వివరాలు వెల్లడించలేదు

ఎన్నికల అఫిడవిట్‌లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలు బహిర్గతం చేయలేదని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్ర యాదవ్‌ ఆరోపించారు.

Published : 08 May 2024 05:37 IST

చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరిన బీసీవైపీ అధినేత

ఈనాడు, చిత్తూరు: ఎన్నికల అఫిడవిట్‌లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలు బహిర్గతం చేయలేదని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్ర యాదవ్‌ ఆరోపించారు. పెద్దిరెడ్డి, ఆయన భార్య స్వర్ణలత పేరిట ఉన్న 142 ఆస్తుల వివరాలు ప్రస్తావించనందున అనర్హత వేటు వేయాలని కోరుతూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌కు ఈనెల 6న ఆయన లేఖ రాశారు. మంగళవారం ఈ ప్రతిని మీడియాకు విడుదల చేశారు. జిల్లాలోనే వెల్లడించని ఆస్తులు ఇన్ని ఉంటే రాష్ట్రం, దేశవిదేశాల్లో ఇంకెన్ని భూములు, స్థలాలు కూడబెట్టారో అంతుపట్టడం లేదన్నారు. ఎన్నికల నియమావళి, చట్టాలు ఉల్లంఘించినందున 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా చూడాలన్నారు. రామచంద్ర యాదవ్‌ పేర్కొన్న వివరాల మేరకు పెద్దిరెడ్డికి పుంగనూరు, చౌడేపల్లె, పులిచెర్ల మదనపల్లె, తిరుపతి గ్రామీణ, రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో భూములున్నాయి. ఎక్కువగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తోన్న పుంగనూరులోనే ఉన్నాయి. సింహభాగం ఆయన భార్య స్వర్ణలత పేరిటే ఉన్నాయి.  పి.స్వర్ణలత పేరుతో పుంగనూరులోని సర్వే నంబర్లు 255/5బి, 267/1బి, 267-1ఎ/3ఏ, 267-2బి, 268/3, 472/1, పి.రామచంద్రారెడ్డి పేరిట రాగానిపల్లెలోని సర్వే నంబర్లు  289ఏ, 291/1, 291/2, 291/3 స్థలాలు ఉన్నా అఫిడవిట్‌లో చూపలేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు