logo

జలంకారప్రాయం

కుప్పాన్ని పులివెందులలా చూస్తామని జగన్‌ వల్లెవేసిన మాటలు.. ఐదేళ్ల పాలనలో ఉద్దరించేశామని స్థానిక నేతల సుద్ధులు, మాటలకు.. చేతలకు పొంతన లేదని.. కుప్పంపై కక్ష సాధిస్తున్నారని ప్రస్ఫుటమవుతోంది.

Published : 08 May 2024 05:43 IST

జగనన్న కక్ష సాధింపునకు నిదర్శనం
మూతపడిన నీటి పథకాలు.. నిరుపయోగంగా ట్యాంకులు
న్యూస్‌టుడే, కుప్పం

శాంతిపురం: రాళ్లబూదుగూరు వద్ద ఎన్టీఆర్‌ శుద్ధజలం ప్లాంట్‌  మూతపడిన దృశ్యం

కుప్పాన్ని పులివెందులలా చూస్తామని జగన్‌ వల్లెవేసిన మాటలు.. ఐదేళ్ల పాలనలో ఉద్దరించేశామని స్థానిక నేతల సుద్ధులు, మాటలకు.. చేతలకు పొంతన లేదని.. కుప్పంపై కక్ష సాధిస్తున్నారని ప్రస్ఫుటమవుతోంది. తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి నియోజకవర్గం కావడంతో ఈవిధంగా చేస్తున్నారని ప్రజలే చెబుతున్నారు. ఎన్టీఆర్‌ శుద్ధజలం పథకాన్ని వైకాపా నీరుగార్చిన విధానం ఇందుకు నిదర్శనం.


రూ.2కే 20 లీటర్ల లక్ష్యం.. రూ.25 కోట్లతో పనులు

శాంతిపురం, కుప్పం, గుడుపల్లె, రామకుప్పం మండలాల్లోని 76 వేల కుటుంబాలకు శుద్ధజలాన్ని అందించే పథకాన్ని 9 ఏళ్ల కిందట చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి కుటుంబానికి రూ. 2కే 20 లీటర్లు ఇచ్చేలా రూ.25 కోట్లతో పనులు చేశారు. 16 చోట్ల తాగునీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో బోర్లు తవ్వి.. శుద్ధ జల కేంద్రాలు నెలకొల్పారు. 202 గ్రామాల్లో పంపిణీ ట్యాంకులు కట్టారు. కేంద్రాల నుంచి ట్రాక్టర్‌ ట్యాంకర్లతో ట్యాంకులకు తరలించేవారు. ప్రీపెయిడ్‌ కార్డులను వినియోగించి నీటిని తీసుకునే విధంగా ఐదేళ్ల పాటు విజయవంతంగా నడిపించారు.

శాంతిపురం: మూలన పడిన ట్యాంకరు


లక్ష్యానికి తూట్లు.. ప్రచారానికి రూ.20 లక్షలు

2019లో జగన్‌ పాలన వచ్చిన వెంటనే శుద్ధజలం పథకానికి మంగళం పాడేశారు. కొద్ది రోజులకే ధరను రూ.5కు పెంచారు. ప్రీపెయిడ్‌ కార్డులపై జగన్‌ చిత్రాన్ని వేసుకున్నారు. ప్లాంట్‌లు, ట్యాంకర్లు, ట్యాంకులపై జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్రాలు వేసుకున్నారు. వీటికి పంచాయతీల నిధులు రూ. 20 లక్షలు స్టిక్కర్ల గుత్తేదారుకు కట్టబెట్టారు. తర్వాత ఏడాది నీటి పథకాల నిర్వహణను గాలికొదిలేశారు. నీటి శుద్ధి ప్లాంట్లు మూతపడ్డాయి. అందులోని సామగ్రి తుప్పు పట్టింది. గ్రామాల్లోని ట్యాంకులు అలంకారంగా మారాయి. ట్రాక్టర్లు, ట్యాంకర్లలో కొన్నింటిని అధికార పార్టీ నేతలు వాడుకుంటున్నారు. కొన్ని మూలనపడి పాడైపోతున్నాయి. జనం ప్రైవేటులో 20 లీటర్లకు రూ.20 చెల్లించి కొనుగోలు చేయాల్సిన దుస్థితి తెచ్చారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు