logo

కనుల వైభవం.. సత్యదేవుని విహారం

జై సత్యదేవా అంటూ స్వామి నామస్మరణ నడుమ అన్నవరంలో రథోత్సవం కనులపండువగా సాగింది. దాదాపు 34.1 అడుగుల ఎత్తైన నూతన రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లు బుధవారం ఆశీనులు కాగా భక్తులు దర్శించుకుని పరవశించారు.

Published : 23 May 2024 04:48 IST

వేలాదిమంది భక్తుల నడుమ రథోత్సవం

వేడుకలో పాల్గొన్న భక్తులు

అన్నవరం, న్యూస్‌టుడే: జై సత్యదేవా అంటూ స్వామి నామస్మరణ నడుమ అన్నవరంలో రథోత్సవం కనులపండువగా సాగింది. దాదాపు 34.1 అడుగుల ఎత్తైన నూతన రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లు బుధవారం ఆశీనులు కాగా భక్తులు దర్శించుకుని పరవశించారు. వేదమంత్రోచ్చరణ, మంగళవాయిద్యాల నడుమ రథాన్ని ముందుకు లాగుతూ పూజలు నిర్వహించారు. దేవస్థానం ఛైర్మన్‌ రోహిత్, ఈవో కె.రామచంద్రమోహన్‌లు సాయంత్రం 5 గంటలకు ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. 

స్వామి, అమ్మవార్లను రథం వద్దకు తీసుకువస్తున్న అర్చకులు

అన్నవరంలోని తొలి పావంచాల వద్ద రథం ప్రారంభమై వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద కూడలి నుంచి వెనక్కి  మళ్లించారు. అక్కడ నుంచి టోల్‌గేటు వద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్దకు..తిరిగి తొలిపావంచాల వద్దకు చేరుకుంది. ఎంపీ రఘురామకృష్ణరాజు పాల్గొని రథాన్ని ముందుకు లాగారు. రథం తయారు చేసిన కామేశ్వరరావును ఛైర్మన్, ఈవోలు సత్కరించారు. డీఎస్పీ లతాకుమారి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్సులు, ఇతర వాహనాలను జాతీయ రహదారి మీదుగా దారిమళ్లించారు. అంతకుముందు కొండ దిగువన దేవస్థానం ఉద్యానవనంలో వన విహారోత్సవం జరిగింది. స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో అలంకరించి పెండ్లి పెద్దలు సీతారాముల వారితో పాటు కొండపై నుంచి మెట్ల మార్గం ద్వారా కిందకు తీసుకువచ్చి ఉద్యానవనంలో వేదికపై ఆసీనులను చేశారు.

  • గురువారం ఉదయం 9 గంటలకు కొండ దిగువన పంపా సరోవరంలో శ్రీచక్రస్నానం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు నీలలోహిత గౌరీపూజ, నాకబలి, దండీయాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచన నిర్వహిస్తారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని