logo

హతవిధీ..నీరు ఎలా పారేది

పంట కాలువల నిర్వహణ, దాని స్థితిగతులను జలవనరుల శాఖ పూర్తిగా వదిలేయడంతో అవి అస్తవ్యస్తంగా మారాయి. వీటికన్నా మురుగునీటి కాలువలు ఎంతో నయమనిపిస్తున్నాయి. క్లోజర్‌ పిరియడ్‌లోనూ వీటికి ఏవిధమైన పనులు చేపట్టకపోవడం,

Published : 23 May 2024 05:00 IST

క్లోజర్‌ సమయంలోనూ రూపు మారని కాలువలు
న్యూస్‌టుడే, మామిడికుదురు, రాజోలు

జగ్గన్నపేటలో మురుగునీటితో కలుషితంగా కాలువ

పంట కాలువల నిర్వహణ, దాని స్థితిగతులను జలవనరుల శాఖ పూర్తిగా వదిలేయడంతో అవి అస్తవ్యస్తంగా మారాయి. వీటికన్నా మురుగునీటి కాలువలు ఎంతో నయమనిపిస్తున్నాయి. క్లోజర్‌ పిరియడ్‌లోనూ వీటికి ఏవిధమైన పనులు చేపట్టకపోవడం, కనీసం ఆక్రమణలను తొలగించి.. అక్రమంగా అమర్చిన మురుగునీటి తూరలను మూసివేసేందుకు కార్యాచరణ చేపట్టకపోవడంతో ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి రేగుతోంది. పి.గన్నవరం ప్రధాన పంట కాలువ ఆధారంగా రాజోలు ఉప డివిజిన్‌ పరిధిలో 30 వరకు ఉప ఛానళ్లున్నాయి. రానున్న సార్వాలో దీనిపై రాజోలు, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో 7,195 ఎకరాల వరి ఆయకట్టు ఆధారపడి ఉంది. దీంతో పాటు గుడిమెళ్లంక, అంతర్వేదిపాలెం, రామేశ్వరం, అరవపాలెం, పాశర్లపూడి, ఈదరాడ, ముత్యాలపాలెంలో సమగ్ర రక్షిత మంచినీటి ప్రాజెక్టులకు ఈ కాలువ జలాలే ఆధారం. కాలువలకు పూడికతీత లేకపోవడంతో అస్తవ్యస్తంగా మారాయి. చాకలిపాలెం నుంచి మొగలికుదురు మీదుగా ములికిపల్లి వరకు, పొదలాడ నుంచి రాజోలు, శివకోటి వరకు, తాటిపాక నుంచి నగరం, ఈదరాడ మీదుగా ఆదుర్రు వరకు, నాగుల్లంక నుంచి పెదపట్నం మీదుగా పాశర్లపూడిలంక వరకు, కొర్లగుంట మొదలుకొని మామిడికుదురు నుంచి మాకనపాలెం, పెర్లకాలువ, లూటుకుర్రు వరకు ఏ కాలువ చూసినా పలు రకాల వ్యర్థాలు, చెత్తకుప్పలతో దుర్గంధభరితంగా ఉంది. ఇందులో చివికిపోయిన పాత దుస్తుల మూటలకైతే లెక్కేలేదు. కాలువ నిండా పగిలిన మద్యం సీసాలే. నేలవాలిన చెట్లు కూడా నెలల కాలంగా అలానే ఉండిపోతున్నాయి. కాలువల్లోకి అక్రమంగా అమర్చిన మురుగునీటి తూరలకు లెక్కేలేదు. ఇరువైపులా గట్లు పలు చోట్ల ఆక్రమణల బారిన పడడంతో అవికాస్తా పలు చోట్ల కుంచించుకుపోతున్నాయి. కలుషితంగా మారే ఈ నీరే అటు సాగుకు, ఇటు తాగునీటికి ప్రాణాధారమైనా ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు జలాలను కలుషితం చేస్తుంటే, అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో  అనారోగ్యాలకు కారణమవుతోంది. ఈ విషయాన్ని జల వనరుల శాఖ తాటిపాక విభాగం ఏఈ సుందర్‌సింగ్‌ దృష్టికి తీసుకువెళ్లగా కాలువలో అడ్డంకులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మురుగునీటి తూరలను తొలగించే విషయమై ఆయా పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఆక్రమణలపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

వ్యర్థాలతో గెద్దాడ పంట కాలువ దుర్భరం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని