logo

స్వపక్షంలో విపక్షం

ఇన్నాళ్లూ ప్రతిపక్షం.. సమస్యలను ఏకరవు పెడితే అధికార పక్షం ఎదురుదాడికి దిగేది. కాకినాడ జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం అనూహ్యంగా స్వరం మారింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులను.. సొంత పార్టీ వారే నిలదీశారు.

Updated : 17 Aug 2022 06:49 IST

జడ్పీలో నిరసన.. ఆవేదన స్వరం

మంత్రి వేణు VS ఎమ్మెల్యే చంటిబాబు

ప్రొటోకాల్‌పై అధికార పక్షంలో రగడ

సభ్యుల ఆవేదనను ఆలకిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణ. వేదికపై విప్‌ జగ్గిరెడ్డి, జేసీ శ్రీధర్‌,

జడ్పీ అధ్యక్షుడు వేణుగోపాలరావు, కలెక్టర్లు హిమాన్షు శుక్లా, కృతికా శుక్లా

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, కాకినాడ నగరం: ఇన్నాళ్లూ ప్రతిపక్షం.. సమస్యలను ఏకరవు పెడితే అధికార పక్షం ఎదురుదాడికి దిగేది. కాకినాడ జడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం అనూహ్యంగా స్వరం మారింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులను.. సొంత పార్టీ వారే నిలదీశారు. 28 అజెండా అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా.. నాలుగు అంశాలతోనే సమావేశం రసాభాసగా మారడం.. సుదీర్ఘ చర్చ, నిరసనలతో  సమావేశం అసంపూర్తిగా ముగిసింది.

కనీస గౌరవం ఇవ్వరా..?
వైస్‌ ఛైర్మన్‌ అనుబాబు మాట్లాడుతూ ఆగస్టు 15న జడ్పీటీసీ సభ్యులకు జాతీయ పతాకాన్ని ఎగురవేసే అవకాశం దక్కలేదన్నారు.  పాఠశాలల వద్ద విద్యా కమిటీ ఛైర్మన్లకే అవకాశం ఇచ్చారన్నారు. మరో సభ్యుడు ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సొసైటీ అధ్యక్షులు, సర్పంచులు జెండా ఎగరేస్తే.. మండల స్థాయిలో ఎన్నికైన తమకు అవమానమే మిగిలిందన్నారు. సభ్యులు సంపదరావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ, తమకు మండలాల్లో కూర్చోటానికి సైతం చోటులేదనీ.. న్యాయం చేయకపోతే బహిష్కరిస్తామని సంపదరావు పైకిలేవగా.. పలువురు సభ్యులూ నిరసన తెలిపారు. మంత్రి వేణు సముదాయించారు. దీనిని కేబినెట్‌లో చర్చించాలని ఎమ్మెల్సీ చిక్కాల సూచించారు. జడ్పీటీసీ సభ్యుల ప్రొటోకాల్‌, నిధుల కేటాయింపుపై ప్రభుత్వానికి వివరిస్తామని విప్‌ జగ్గిరెడ్డి హామీ ఇవ్వటంతో వివాదం సద్దుమణిగింది.

దారులు బురద జల్లుతున్నాయ్‌..
పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు తన నియోజకవర్గంలో పలు దారుల పనులు ఆగాయని పేర్కొన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ గుత్తేదారులు టెండర్లు వేసి వదిలేస్తున్నారనీ.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరినా ఫలితం లేదన్నారు. పథకాలు ప్రభుత్వానికి పేరు తెస్తుంటే, అధ్వాన దారులు బురద జల్లుతున్నాయని వ్యాఖ్యానించారు. పెద్దాపురం- జగ్గంపేట రోడ్డు పనులు మూడేళ్లుగా పూర్తికాలేదని గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్‌ దొరబాబు అన్నారు. గొల్లపాలెం- కుయ్యేరు రోడ్డును తవ్వి వదిలేశారని ఎమ్మెల్సీ చిక్కాల పేర్కొన్నారు.

ఎవరికి చెప్పుకోవాలి...
అల్లూరి సీతారామరాజు జిల్లా సమావేశాలకు జడ్పీ అధికారులు రావటం లేదని జడ్పీటీసీ సభ్యులు అచ్యుత రత్నం, వడుగుల జ్యోతి, పండా వెంకటలక్ష్మి ఆరోపించారు. ఎంతో దూరం నుంచి వస్తున్న తాము.. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. ఇలాగైతే తాము వచ్చే సమావేశాలకు హాజరవ్వమని తెలిపారు.

సమస్యలపై చర్చ జరగాలి
రైతు సమస్యలపై ఇక్కడ చర్చ జరిగితేనే.. ప్రభుత్వానికి తెలుస్తుంది. కౌలుదారులకు సాగు హక్కు పత్రాలివ్వాలి. భూ యజమానుల హక్కులకు భంగం కలగదనే భరోసా ఇవ్వాలి. రైతులకు మేలు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమైనప్పుడు కులాలతో పని లేదు. కులాల లెక్కన తీసుకుంటే.. ఫలానా వారికే మేలు జరుగుతుందంటే తేడా వచ్చే వీలుంది. భూ యజమానులు సహకరించక రాయితీలు, విపత్తు సాయం కౌలుదారుకు అందడంలేదు.- త్రిమూర్తులు, ఎమ్మెల్సీ

చిత్తుకాగితం పట్టుకెళ్తే స్టే ఇస్తున్నారు
సీసీఆర్‌సీ కార్డుల విషయంలో రైతులు, కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు.  సాగు హక్కు పత్రం ఇస్తే కోర్టుకెళ్తారని భయం భూ యజమాని రైతుల్లో ఉంది.. ఇలా జరగడం లేదు.. అలా జరగడం లేదని చెప్పొద్దు. చిత్తుకాగితం పట్టుకెళ్తే స్టే ఇచ్చేస్తున్నారు. గ్రామాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బంది పడేవారిని వందమందిని తెమ్మన్నా తెస్తా. సమస్యకు పరిష్కారం చూపమంటే జీవోలు అంటారేంటి.. జడ్పీటీసీ, ఎంపీపీలకు గౌరవం తగ్గింది. -చంటిబాబు, ఎమ్మెల్యే జగ్గంపేట

ప్రభుత్వానికి వివరిస్తా..
గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులు, కౌలు రైతుల సంక్షేమానికి పథకాలు ప్రవేశపెట్టాం. పథకాల అమలుపై ప్రజాప్రతినిధులు సమస్యలు లేవనెత్తారు. వీటి పరిష్కారానికి కృషిచేస్తాం. కౌలు రైతుల సంక్షేమానికి నిర్దేశించిన సీసీఆర్‌సీ కార్డులపై భూ యజమానులు, కౌలు రైతులకు అవగాహన కల్పిస్తాం.
-వేణుగోపాలకృష్ణ, మంత్రి

కౌలు కార్డులపై కస్సుబుస్సు..
* కౌలు రైతుల సాగు హక్కు పత్రాల అంశాన్ని ఎమ్మెల్సీ తోట లేవనెత్తారు. ఈ-క్రాప్‌ బుకింగ్‌ రైతు పేరిట చేస్తూ.. కౌలు రైతుకు కార్డు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయ్‌కుమార్‌ స్పందిస్తూ కౌలు రైతుకు సీసీఆర్‌సీ కార్డు ఇస్తున్నామన్నారు. మంత్రి వేణు స్పందిస్తూ ప్రభుత్వం కౌలు రైతుల ఖాతాల్లోనే డబ్బులు వేస్తోందన్నారు. కొందరు రైతులు డిమాండ్‌ చేసి వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నారని అన్నారు.
* ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ, కౌలు కార్డుల జారీతో వివాదాలు పెరుగుతున్నాయనీ.. ఈ కార్డులతో కోర్టుకు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. మంత్రి వేణు జీవోను చదివి వినిపించి కోర్టుకు వెళ్లే అవకాశమే లేదన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల జోక్యం చేసుకుని జీవోల గురించి మాకూ తెలుసని, సమస్య చక్కదిద్దాలని స్వరం పెంచారు. ఎంపీ గీత జోక్యంతో సద్దుమణిగింది. ఎమ్మెల్సీ ఐవీ మాట్లాడుతూ, జీవోలు ఆంగ్లంలో చదివితే సరిపోదనీ, అందరికీ అర్థమయ్యేలా చెప్పాలన్నారు.


సమస్యలపై ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే చంటిబాబు.. వెనుకే జడ్పీటీసీ సభ్యుల నిరసన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని