logo

బలం ప్రదర్శించే ‘అద్దె బలగం’

ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది.

Published : 26 Apr 2024 06:04 IST

ఏజెంట్లను పెంచుకునేందుకు అధికారపక్షం వ్యూహం
స్వతంత్ర అభ్యర్థులను బరిలో నిలిపి లబ్ధికి కుట్ర
న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌

ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ అడ్డదారుల్లో అస్త్రాలను ప్రయోగిస్తోంది. పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్ల బలాన్ని పెంచుకుని లాభపడాలని చూస్తోంది. సామదాన దండోపాయాలను ఉపయోగించి అనుకూలంగా ఓట్లు వేయించుకోవాలని.. లెక్కింపులో బలప్రదర్శన ద్వారా అధికారులపై ఒత్తిడి పెంచాలని యోచిస్తోంది.  కాకినాడ పార్లమెంట్‌ స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొందరు స్వతంత్ర అభ్యర్థులతో అధికార పార్టీ నేతలు నామినేషన్లు వేయించారు.   అధికార పార్టీకి చెందిన  ఏజెంట్లతో పాటు స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లను సైతం తామే నియమించుకోవడం ద్వారా పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల్లో బలం పెంచుకోడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇలా ఒత్తిడి చేసేందుకు..

పొటో ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే, ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఓటేసే వారిని వివిధ కారణాలు చూపి పోలింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకోడానికి అధికార పార్టీ తన ఏజెంట్లను వినియోగించుకోనుంది. ఓటర్లు ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటారు. వీరు మరెక్కడా ఓటు నమోదు చేసుకోరు. సొంత ఊరులో ఓటు ఉండేలా చూసుకుంటారు. వీరు ఓటేసే క్రమంలో అడ్డుకునే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏజెంట్ల ఒత్తిడితో పోలింగ్‌ అధికారులు వెనక్కి తగ్గే అవకాశ లేకపోలేదు. ఇలా అన్ని విధంగా వారికి అనుకూలంగా మార్చుకోడానికి అధికార పార్టీ నేతలు ఈ ఎన్నికల్లో వ్యూహాలు రచిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1,637 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులకు ఒక్కో పార్టీకి ఒక్కో ఏజెంట్‌ను నియమించుకునే అవకాశం ఉంది. పోటీలో ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు ఒక్కొక్కరు చొప్పున ఏజెంట్లను నియమించుకోవచ్చు.  ఈ లెక్కన అధికార పార్టీ ఎక్కువ మంది ఏజెంట్లు ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటోంది.

లెక్కింపు రోజు..

  •  కాకినాడ పార్లమెంట్‌తో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు జిల్లా కేంద్రం కాకినాడలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు రోజున  పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్‌ ఏజెంట్లును నియమించుకోవచ్చు. అధికార పార్టీ నేతలు నామినేషన్లు వేయించిన స్వతంత్ర అభ్యర్థుల తరఫున కౌంటింగ్‌ ఏజెంట్లను వారికి అనుకూలమైన వారిని నియమించుకునేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక్కోసారి పదుల ఓట్ల తేడాతో గెలుపు, ఓటములు తేలే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కౌంటింగ్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఫలితాలు తారుమారు చేసే అవకాశాలు లేకపోలేదు.
  •  కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి  అధికార పార్టీ నేత ఒకరు కాకినాడకు చెందిన కార్మిక నేతతో ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయించారు.  ఇంకా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అధికార పార్టీ నేతలు కొందరు స్వతంత్ర అభ్యర్థులతో నామపత్రాలు దాఖలు చేయించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని