logo

వేతనానికి విన్నవించినా.. యాతనే మిగిల్చారు

ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు.

Published : 26 Apr 2024 06:09 IST

 న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం

ఆంధ్రా పేపరుమిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులు వీరు.. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కష్టానికి తగిన వేతనం లేదు.. నాలుగేళ్లుగా వేతన సవరణ ఒప్పందం అమలు కావడంలేదు. సమస్యలు, డిమాండ్లకు పరిష్కారం లభించడంలేదు. అనేకసార్లు ఆందోళనలు చేస్తూ వస్తున్నా యాజమాన్యం దిగిరాలేదు. గత మూడేళ్లలో 40 సార్లు సమావేశాలు జరిపినా ఫలితంలేదు. వీరి గోడును అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. మెరుగైన వేతన ఒప్పందం జరిగేలా చూస్తామంటూ హామీలిస్తూ వచ్చారేతప్ప పరిష్కారం చూపలేకపోయారు. యాజమాన్యంతో చర్చించి డిమాండ్ల పరిష్కారానికి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరి 26న సమ్మె నోటీసు ఇచ్చారు. వేతన సవరణ ఒప్పందం అమలుతో పాటు 23 డిమాండ్లను యాజమాన్యం ముందు పెట్టారు. సానుకూలంగా స్పందించకపోవడంతో ఈ నెల 2 నుంచి మిల్లు లోపలే బైఠాయించి సమ్మెకు దిగారు. అధికారులు ఇరువర్గాల ప్రతినిధులతో చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు.

కలెక్టరేట్‌కు వచ్చిన పేపరుమిల్లు కార్మికులు

సీఎం దృష్టికి తీసుకెళ్లినా..

ఈ నెల 18న నగరంలో బస్సు యాత్ర చేపట్టిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో యాజమాన్యం బుధవారం నుంచి అర్ధాంతరంగా లాకౌట్‌ ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్పందించిన ఉన్నతాధికారులు మళ్లీ ఇరువర్గాల ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరపగా ఇటు కార్మికులు సమ్మె విరమించేందుకు.. అటు యాజమాన్యం మిల్లు తెరిచేందుకు అంగీకారం తెలిపాయి. కార్యకలాపాలు, ఉత్పత్తి యథాస్థితికి చేరుకున్న తర్వాత కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి చర్చలు జరిపేందుకు యాజమాన్యం అంగీకారం తెలిపినప్పటికీ ఎంతవరకు న్యాయం చేస్తారనేది వేచి చూడాల్సి ఉందని పలువురు కార్మికులు అంటున్నారు. చర్చల సందర్భంగా కలెక్టరేట్‌ వద్దకు వచ్చిన పలువురు కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

న్యాయం చేయాలంటూ జగన్‌ కాన్వాయ్‌ దగ్గరకు చేరుకున్న కార్మికులు (పాత చిత్రం)

ఎంపీ కనీసం పట్టించుకోలేదు..

ఇటీవల ఇక్కడ దివంగత నేత వై.ఎస్‌.ఆర్‌. విగ్రహావిష్కరణకు వచ్చిన ఎంపీ భరత్‌రామ్‌ కార్మికులకు వేతన ఒప్పందం చేయించేస్తామని చెప్పుకొచ్చినా ఇప్పటివరకు జరగలేదు. 24 రోజులుగా సమ్మె చేస్తున్నా కనీసం పలకరించిదిలేదు. మా గురించి పట్టించుకున్నదీ లేదు. కాంట్రాక్టు వర్కర్లకు రూ.9 వేలు, శాశ్వత ఉద్యోగులకు రూ.30 వేలకు మించి జీతం రావడంలేదు. కొన్ని పోస్టులు రూ.15 లక్షలు, రూ.20 లక్షలకు అమ్ముకున్నారు. తండ్రి పోస్టుల్లో వచ్చిన వారు ట్రైనీలుగా పనిచేస్తున్నప్పటికీ వారికి ఇచ్చేది రూ.8 వేలు మాత్రమే. క్యాంటీన్‌ సౌకర్యాలు, అలవెన్సులు, సిక్‌ లీవులు ఇవ్వడంలేదు. పక్షవాతంతో కాళ్లు, చేతులు పడిపోయి మంచాన పడినవారికి మందుల ఖర్చులకు డబ్బులు ఇవ్వడంలేదు. కరోనాతో 29 మంది చనిపోతే యాజమాన్యం ఆదుకోలేదు. కరోనా అలవెన్సులు ఇప్పటివరకు ఇవ్వలేదు.

 సీహెచ్‌వీ దుర్గారావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని