logo

లాభంలేదురొయ్యో..!

ఆక్వారంగంలో ఎన్నడూ చూడని పరిస్థితి కనిపిస్తోంది. రొయ్యలకు తెగుళ్లు, ధరల ఒడుదొడుకులు..

Published : 06 Dec 2022 04:00 IST

న్యూస్‌టుడే, ముమ్మిడివరం,అమలాపురం కలెక్టరేట్‌: ఆక్వారంగంలో ఎన్నడూ చూడని పరిస్థితి కనిపిస్తోంది. రొయ్యలకు తెగుళ్లు, ధరల ఒడుదొడుకులు.. ఇలా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని రైతులు ముందుకు సాగారు. ప్రస్తుత పరిస్థితులు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. చెరువులో రొయ్యలు పట్టుబడి చేస్తే.. ఐస్‌ వస్తుందో, రాదో తెలియని స్థితి. ధర ఎంత ఇచ్చినా.. సరకు పట్టుకెళ్లండని వేడుకోవాల్సిన దుస్థితి. ప్రధానంగా నెల నుంచి మారుతున్న పరిస్థితులే కొనసాగితే.. ఆక్వారంగం తిరోగమనం పట్టడం, పంట విరామం ప్రకటించడం ఖాయమనే భావన రైతుల్లో నెలకొంది.

* మధ్యలోనే పట్టుబడి..

ఆక్వా సాగులో 100 కౌంట్‌ ధర గతంలో కిలోకు రూ.220 వరకు ఉండేది. ప్రస్తుతం ఆ ధర రూ.150-180 మాత్రమే. ప్రభుత్వం ఇటీవల మంత్రులతో కమిటీ వేసి ధరల నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించి.. రూ.230 వరకు చెల్లించాలని నిర్ణయించింది. మార్కెట్‌ ఒడుదొడుకులు, ఇతర కారణాలతో రైతులకు ఆ ధర దక్కడం లేదు కదా.. అసలు పట్టుకున్న రొయ్యలను తీసుకెళ్లి ఒబ్బిడి చేస్తే చాలనే పరిస్థితికి వచ్చింది. నెల రోజుల్లో 10 వేల ఎకరాల్లోని చెరువుల్లో రొయ్యలను మధ్యలోనే పట్టుబడి చేసి అమ్ముకున్నట్లు రైతులు చెబుతున్నారు.

* మేత అరువు బంద్‌..

రైతులు చెరువుల వద్ద విద్యుత్తు, డీజిల్‌, రొయ్య పిల్లల కొనుగోలు వంటి వాటికి వెంటనే నగదు చెల్లించి ఆక్వా సాగు ప్రారంభిస్తారు. రొయ్యలకు వినియోగించే మేత, ప్రొ బయాటిక్స్‌ ఇతర మందులను దుకాణాల్లో పంట చేతికొచ్చిన తర్వాత చెల్లించే ఒప్పందంతో అరువుకు తేవడం, పంట అమ్మాక చెల్లిస్తారు. ప్రస్తుతం ఆక్వారంగం సంక్షోభంలోకి వెళ్లడంతో మేత దుకాణదారులు డిసెంబరు 1 నుంచి మేత, ఇతర మందులు అరువు ఇచ్చేదిలేదని రైతులకు  చెప్పేశారు.

* పంట విరామం దిశగా..

ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రైతులు చెరువుల్లో రొయ్య పిల్లలు వేయడం లేదు. ఈ సమయంలో హేచరీలు(రొయ్య పిల్లల తయారీ కేంద్రాలు) సీడ్‌కోసం పెద్దఎత్తున ఆర్డర్లు వచ్చేవని, రైతులు సాగుకు ముందుకు రాకపోవడంతో అమ్మకాలు మందగించాయి. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే వచ్చే ఏడాది మార్చినుంచి పంట విరామం చేపట్టాలని రైతులు భావిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏటా 10 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా దిగుబడి సాధిస్తూ విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చిపెడుతుండగా.. ప్రస్తుతం కుదేలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు..

ఆక్వా సాగులో ప్రస్తుత పరిస్థితి ఎప్పుడూ లేదు. మేత, మందుల ధరలతో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. మరోవైపు వ్యాధుల విజృంభణ.. ఇలా ఎన్ని ఇబ్బందులొచ్చినా సాగు చేస్తున్నాం. ఏం జరిగిందో ఏంటో.. రెండు నెలలుగా సంక్షోభం మొదలైంది. రొయ్యలు పట్టి అమ్ముకోవడానికి నానా కష్టాలు పడాల్సివస్తోంది. దీనిపై ఓ విధానం లేకపోతే ఆక్వా సాగు మనుగడ కష్టమే.

మట్టపర్తి వెంకటేశ్వరరావు, ఆక్వా రైతు, మురమళ్ల, ఐ.పోలవరం మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని