logo

అన్నదాతకు అండగా ఉంటాం..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ భరోసానిచ్చారు.

Published : 27 Apr 2024 06:31 IST

వైకాపా పన్నే కుట్రల్లో ప్రజలు చిక్కుకోవద్దు
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
మలికిపురం, ద్రాక్షారామ సభల్లో జనసేనాని
ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ, న్యూస్‌టుడే: మలికిపురం, మామిడికుదురు, పి.గన్నవరం, ద్రాక్షారామ, పామర్రు, కాజులూరు

‘‘రాష్ట్రాన్ని సమష్టిగా రక్షించుకుందాం.. రైతులకు అండగా ఉందాం..
యువతకు బాధ్యతనిద్దాం.. ఉపాధి కల్పిద్దాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ,
మైనార్టీలకు చేదోడుగా ఉందాం’


‘‘అమావాస్య రోజున సన్నటి వెలుగు రేఖ ఎలా ఉంటుందో.. నా రాజకీయ జీవితంలో రాజోలు గెలుపు అంతటి గొప్ప వెలుగు రేఖ. ఆ రోజు ఇచ్చిన హారతే.. రాష్ట్రం అంతటికీ వెలుగు చూపాలి. ఆ వెలుగు కోసం పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా.  తెదేపా, భాజపా ఎక్కడ పోటీ చేసినా పూర్తి మద్దతుగా నిలబడదాం.

-జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

మ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంట విరామం అనే మాట వినపడకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ భరోసానిచ్చారు. మ్యానిఫెస్టోలో ప్రకటించే ప్రతి పథకాన్నీ ముందుండి అమలు చేయించే బాధ్యత జనసేన తీసుకుంటుందని హామీ ఇచ్చారు. వారాహి విజయ భేరిలో భాగంగా శుక్రవారం రాత్రి రాజోలు నియోజకవర్గం మలికిపురం, రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఆ ప్రాంతాలు జనసంద్రాన్ని తలపించాయి. కూటమి ప్రభుత్వం వస్తే కోనసీమకు ఏం చేస్తారో వివరిస్తూ.. వైకాపా పాలన దురాగతాలను ప్రజలకు చెబుతూ పవన్‌ ప్రసంగించారు. జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ప్రతిసారీ ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రాజోలులో స్థానిక ఎమ్మెల్యే చేసిన అక్రమాలను తూర్పారబెడుతున్నప్పుడు పవన్‌కు మద్దతుగా ప్రజాగళం హోరెత్తింది.

మీ బలమే నిలబెట్టింది..

‘నేను మొదటి తరం రాజకీయ నాయకుడ్ని.. జగన్‌లా తాతలు, తండ్రులు, 150 ఏళ్ల కాంగ్రెస్‌ నుంచి వచ్చినవాడిని కాదు. చిరంజీవి పెట్టిన భిక్షతో నటనలో రాణించి.. 2009లో రాజకీయ భాగస్వామునై.. దాన్ని నిలబెట్టుకోలేకపోయానన్న బాధ.. మనవల్ల రాజకీయ పార్టీ కాదని అంటే.. పంతంగా తీసుకున్నా. దశాబ్దం నుంచి మీ బలమే జనసేనను నిలబెట్టిందని’ వివరించారు.  

మీరే నా సైన్యం!

‘మీరే నా సైన్యం.. మబ్బుల్లో పరుగెత్తే పిడుగుల్లాంటి నా జనసైనికులతో మనసు విప్పి మాట్లాడుకునే సమయం కోసం ఎదురుచూస్తున్నా. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలతో పది నిమిషాలు మాట్లాడితే చాలదు.. గంట మాట్లాడాలని ఉంది.. కుదిరితే మరోసారి వస్తా.. మనసు విప్పి మాట్లాడతా’..నని ద్రాక్షారామ సభలో పవన్‌కల్యాణ్‌ అన్నారు.

పర్యాటక కేంద్రంగా కోనసీమ..

కోనసీమ ప్రాంతాన్ని ఎకో, టెంపుల్‌ టూరిజం హబ్‌గా తీర్చిదిద్ది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పవన్‌ భరోసా ఇచ్చారు. మోరి, మోరిపాడులో జీడి
పిక్కల పనిని కుటీర పరిశ్రమగా గుర్తించి, మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తామన్నారు. రాజోలులో గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారిని కొందరు ఏజెంట్లు మోసం చేస్తున్నారని, సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆర్థికపరమైన సలహాలు, స్కిల్స్‌పై శిక్షణ ఇస్తామన్నారు.  అంతర్వేది దేవస్థానం భూములను దేవస్థానానికి చెందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మలికిపురం, ద్రాక్షారామ సభల్లో అమలాపురం కూటమి ఎంపీ అభ్యర్థి హరీష్‌మాథుర్‌, రాజోలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్‌..రామచంద్రాపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌, మండపేట అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొన్నారు.


రథం కాలిపోతే అపహాస్యం చేస్తారా?

అంతర్వేదిలో రథం పోతే గుడివాడలో ఒక మంత్రి మాట్లాడతాడు.. కాలిపోతే ఏం అవుద్ది.. కొత్త రథం చేయిస్తామంటాడు. అసలు వీటి ప్రాశస్త్యం తెలుసా? అలా మాట్లాడొచ్చా? ఇలాంటి దుర్మార్గాలు జరిగితే అపహాస్యం చేస్తారా? అని పవన్‌ ధ్వజమెత్తారు. వ్యక్తుల మధ్య గొడవ జరిగితే కులాలకు ఆపాదించవద్దని సూచించారు. వైకాపా పన్నే కుట్రల్లో చిక్కుకోవద్దని అందర్నీ అప్రమత్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని