logo

ఆడపడుచుగా వచ్చా.. ఆశీర్వదించండి: పురందేశ్వరి

మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు.

Published : 27 Apr 2024 06:15 IST

పురందేశ్వరిని, రామకృష్ణారెడ్డిని సత్కరిస్తున్న ముస్లిం పెద్దలు

అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: మీ ఇంటి ఆడపడుచుగా వచ్చానని, ఆశీర్వదించి గెలిపించాలని రాజమహేంద్రవరం ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. అనపర్తి ఎస్‌ఎన్‌ఆర్‌ కల్యాణ మండపంలో శుక్రవారం జరిగిన తెదేపా, భాజపా, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో అనపర్తి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, తెదేపా నేత కే.ఎస్‌.జవహర్‌, మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుతో కలిసి ఆమె పాల్గొన్నారు. మూడు పార్టీల కార్యకర్తలు ఒక చోట సమావేశమైతే నరేంద్రమోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్‌కల్యాణ్‌ శక్తి కనిపిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు అనాలోచితంగా ఫ్యాను స్పీడును 151లో పెట్టేశారని, రాష్ట్రం కకావిలకంగా తయారయిందన్నారు. అప్పు, అవినీతి, అబద్ధాలను పునాదిగా చేసుకొని వైకాపా అయిదేళ్లు పాలన సాగించిందన్నారు. రూ.14 లక్షల కోట్ల అప్పు భారం రాష్ట్రంపై ఉందని, ప్రతి ఒకరిపై రూ.2 లక్షల అప్పు ఉందని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య కేంద్రాలకు డబ్బు ఇచ్చింది మోదీయేనన్నారు. నాడు-నేడు నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులన్నారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరితో కలిసి పోటీ చేయడం అదృష్టంగా బావిస్తున్నానన్నారు. చంద్రబాబు ఆదేశాలతో భాజపాలో చేరానని, బాధతో తెలుగుదేశం పార్టీని వీడుతున్నానన్నారు. ఎన్డీఏ అభ్యర్థులుగా తాను, పురందేశ్వరి విజయం సాధిస్తే కెనాల్‌ రోడ్డును కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించేందుకు, రైల్వే హాల్టులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. తొలుత అనపర్తి శివారు నుంచి కారు ర్యాలీగా పురందేశ్వరిని సభా వేదిక వద్దకు తీసుకువెళ్లారు. ఎన్టీఆర్‌, మూలారెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెదేపాకు చెందిన 20 కుటుంబాలు భాజపాలో చేరగా, పురందేశ్వరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరిని ముస్లిం పెద్దలు సత్కరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని