logo

ఎవరి చెవిలో పువ్వులు పెడతారు?

మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా..

Updated : 27 Apr 2024 06:34 IST

గెలుపు కోసం వైకాపా నేతల హామీల బాకాలు

కాకినాడ-రాజమహేంద్రవరం కలిపేస్తారట..

‘‘కాకినాడ, రాజమహేంద్రవరం లను జంట నగరాలైన హైదరాబాద్‌- సికింద్రాబాద్‌లా ఎందుకు కలపకూడదండీ.. రోడ్లు, వంతెనలు అభివృద్ధి చేసి జంట నగరాలు చేసేస్తాం... నా ఆస్తి అమ్మయినా సరే మోరంపూడి పై వంతెన పూర్తిచేస్తానని చెబుతున్నా. (రాజమహేంద్రవరం నగర వైకాపా అభ్యర్థి, ఎంపీ మార్గాని భరత్‌ హామీలివి)  

400 గ్రామాలకు రూ.400 కోట్లు ఇస్తారట..

‘‘కాకినాడ పార్లమెంటు పరిధిలో 400 గ్రామాలు దత్తత తీసుకుంటా.. రాబోయే అయిదేళ్లలో ఒక్కో గ్రామానికి రూ.కోటి చొప్పున రూ.400 కోట్లు ఖర్చుచేసి అభివృద్ధి చేస్తా.. నిరుద్యోగ యువతకు భారీ నైపుణ్య అభివృద్ధి కేంద్రం పెట్టి.. ఏటా 5 వేల నుంచి 6 వేల మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో చేరేలా చూస్తాం. పరిశ్రమలు తీసుకొస్తా’. (కాకినాడ వైకాపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ ప్రవచనం)


ఈనాడు, కాకినాడ: మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పే వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగనే జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు. తాజాగా ఎన్నికల ప్రచారానికి వచ్చినా.. గత హామీలు గుర్తుకొచ్చాయో ఏమో.. కొత్తవాటి ఊసే లేకుండా ప్రతిపక్షాలపై విమర్శలకే పరిమితమయ్యారు. మా నాయకుడి కంటే మేమేం తక్కువా..? అనుకున్నారేమో..అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీచేస్తున్న వైకాపా అభ్యర్థులు ఎడాపెడా ఆచరణ సాధ్యంకాని హామీలు దంచేస్తున్నారు. ప్రస్తుతం కొందరు నేతల హామీలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. వీరి మాటలు వింటుంటే.. ఎవరు వెర్రివాళ్లనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి.

అంతన్నారు.. ఇంతన్నారు..

రాజమహేంద్రవరం ఎంపీగా వైకాపా ఎంపీ భరత్‌ తన మార్కు చూపలేకపోయారు. తాజా ఎన్నికల్లో ఈ సిటీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. హామీలు గుప్పించేస్తున్నారు. 2022 జులై 16న మాట్లాడుతూ.. వచ్చే ఏడాదికి మోరంపూడి ఫ్లై ఓవర్‌ పూర్తిచేస్తాం అన్నారు. మాటిచ్చి రెండేళ్లయినా పూర్తిచేయలేకపోయారు. ఇప్పుడు జంట నగరాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు.

ఆ లెక్కేంటో చెప్పరూ

కాకినాడ[ లోక్‌సభ వైకాపా అభ్యర్థి చలమలశెట్టి గతంలో ప్రజారాజ్యం, వైకాపా, తెదేపా నుంచి పోటీచేసి ఓడారు. ఇప్పుడు మళ్లీ పోటీ చేస్తూ మ్యానిఫెస్టో తెరమీదికి తెచ్చారు. ఎంపీ నిధులు ఏటా రూ.5కోట్లకు మించి వచ్చే పరిస్థితిలేదు.. ఈయన, కుటుంబ సభ్యుల ఆస్తి అఫిడవిట్‌ ప్రకారం రూ.149.99 కోట్లు చూపారు. మరి అయిదేళ్లలో 400 గ్రామాలకు రూ.400 కోట్లు ఎలా ఖర్చుచేస్తారనే ప్రశ్న ఎదురవుతోంది.

స్కిల్‌ రాగం

వైకాపా జమానాలో రోడ్లు, వీధి దీపాలు లేవని కాకినాడ గ్రామీణంలోని ఓ ఐటీ సంస్థ వెళ్లిపోతోంది. శంకుస్థాపనలు చేసినా కదలిక లేని పారిశ్రామిక ప్రాంగణాలూ ఉన్నాయి. సవ్యంగా నడుస్తున్న స్కిల్‌ కేంద్రాలపై బురద జల్లి.. ఇప్పుడు కొత్తగా వీరు స్కిల్‌ రాగం వినిపిస్తున్నారు. రూ.500 కోట్లతో సైన్స్‌ ఎంటర్‌, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్‌ వంటి ప్రాజెక్టులే అయిదేళ్లలో ఈ ప్రభుత్వం చేయలేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని