logo

అధికారమే లక్ష్యంగా అడ్డదారి..!?

ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Published : 27 Apr 2024 06:14 IST

కూటమి అభ్యర్థులను పోలిన పేర్లున్నవారితో నామపత్రాలు
ఇదంతా వైకాపా పన్నాగమేనని విపక్షాల ఆరోపణలు

చివరి రోజు గురువారం అమలాపురం అసెంబ్లీకి అధికంగా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం వెనక అధికార పార్టీ ప్రోద్బలం ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నవరంగ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆనందబాబు వెంట మంత్రి విశ్వరూప్‌ అనుచరుడు శ్రవణ్‌తోపాటు వైకాపా నేతలే నామినేషన్‌ సమయంలో ఉండటం ఆ పార్టీ వ్యూహాన్ని బయటపెడుతోందని చర్చించుకుంటున్నారు.


నవరంగ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆనందబాబు వెంట మంత్రి విశ్వరూప్‌ అనుచరుడు శ్రవణ్‌

 న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌, గ్రామీణం: ఏది ఏమైనా మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలనే ఉద్దేశంలో అధికార పార్టీ కుటిల పన్నాగాలు పన్నుతోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. అయిదేళ్లపాటు నిరంకుశ పాలన అందించడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైకాపా నాయకులు అధికారమే లక్ష్యంగా ఏయే మార్గాల్లో లబ్ధిపొందవచ్చో.. అన్ని మార్గాలను ఆశ్రయిస్తున్నారని అంటున్నారు. అందుకు ఉదాహరణగా గురువారంతో ముగిసిన నామినేషన్ల తీరునే పేర్కొంటున్నారు.

పి.గన్నవరంలో..

ఈ నియోజకవర్గం నుంచి కూటమి తరఫున జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ బరిలో నిలిచారు. ఓటర్లను ఏమార్చేందుకు కాట్రేనికోన మండలం వేట్లపాలెం గ్రామానికి చెందిన గిడ్డి సత్యనారాయణ అనే పేరున్న వ్యక్తిని జాతీయ జనసేన పార్టీనుంచి ఇక్కడ నామినేషన్‌ వేయించారు.

కొత్తపేటలో అన్నదమ్ముల పేర్లతో..

కొత్తపేట నియోజకవర్గ పరిధిలో కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యానందరావు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన తమ్ముడు బండారు శ్రీనివాసరావు జనసేన తరఫున బరిలో నిలిచారు. ఓటర్లను తికమక పెట్టేందుకు బండారు శ్రీనివాసరావు అనే పేరున్న వ్యక్తిని నవరంగ కాంగ్రెస్‌ పార్టీనుంచి బరిలో నిలిపారు. బండారు శ్రీనివాసరావు వర్గాన్ని అయోమయానికి గురి చేయడమే వీరి ప్రధాన ఉద్దేశమని విపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు.

ఓటర్లను తికమక  పెట్టేందుకేనా..!

కోనసీమ జిల్లావ్యాప్తంగా కూటమి అభ్యర్థుల్లో ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీల నుంచి పోటీ చేసేవారి పేర్లను పోలి ఉన్నవారిని.. పలు పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయించి ఓటర్లను తికమక పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం ద్వారా ప్రతిపక్ష ఓట్లను చీల్చి, తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఉద్దేశం అధికార పార్టీ నాయకుల్లో కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అమలాపురంలో  అమలు..

అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కూటమి తరఫున తెదేపా అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు ఎన్నికల బరిలో నిలిచారు. ఇదే పేరుతో ఉన్న కపిలేశ్వరపురం మండలానికి చెందిన వ్యక్తిని స్వతంత్ర అభ్యర్థిగా అధికార పార్టీ నాయకులు బరిలో నిలిపారు. నవరంగ కాంగ్రెస్‌ పార్టీ తరపున అయితాబత్తుల ఆనందబాబు అనే మరో అభ్యర్థినీ పోటీలో ఉంచారు.

ఈవీఎంలలో  వరుస క్రమంలో పేర్లు

ఈవీఎంలలో తెలుగు అక్షరమాల ప్రకారం అభ్యర్థి పేరులో ఉన్న మొదటి అక్షరం ఆధారంగా వరుస క్రమం నిర్వహిస్తారు. ఈ లెక్కన ఒకే పేరున్న అభ్యర్థులు పోటీలో ఉంటే.. వారి పేర్లు ఒకదాని తరువాత ఒకటి వచ్చే అవకాశాలు ఎక్కువ. పేరు ప్రకారం చూస్తే.. ఓటర్లు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వారంటున్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల పేర్లతో పోలిఉన్న అభ్యర్థులతో నామినేషన్లు వేయించడమనేది పక్కా ప్రణాళిక ప్రకారం చేశారనే వాదన అన్ని నియోజకవర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. వైకాపా జిల్లా ఇన్‌ఛార్జి మిధున్‌రెడ్డి సూచనల మేరకే ఈ తరహా కుట్రలకు తెరతీశారని విపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు