logo

రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాం.. కుట్టకే దోమా!

దోమలకూ బడ్జెట్‌. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ప్రతి ఇంట్లో నెలనెలా పాలు, నీళ్లు, పిల్లల చదువు, వైద్యం, విద్యుత్తు, రేషన్‌ సరకులు...

Updated : 06 Aug 2023 10:58 IST

దోమలకూ బడ్జెట్‌. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ప్రతి ఇంట్లో నెలనెలా పాలు, నీళ్లు, పిల్లల చదువు, వైద్యం, విద్యుత్తు, రేషన్‌ సరకులు... ఇలా ప్రతి దానికీ కొంత కేటాయించుకున్నట్లే దోమల కట్టడికి కొంత మొత్తం పక్కన పెట్టాల్సిన పరిస్థితి. ఒక  ఇంట్లో విద్యుత్తు బిల్లుతో సమానంగా దోమల నివారణకు ఖర్చుపెడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇదిగాక  డెంగీ, మలేరియాతో అనారోగ్యం పాలైతే రూ.వేలు, లక్షల్లో వ్యయం.

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం, కొవ్వూరుపట్టణం: రాజమహేంద్రవరానికి చెందిన రాజేశ్వరరావు ప్రైవేటు ఉద్యోగి. రూ.12 వేల జీతంలో దోమల నివారణకే రూ.700 వరకు ఖర్చు పెడుతున్నారు. జులై నెల విద్యుత్తు బిల్లు రూ.700 వస్తే దానికి సమానంగా దోమల నివారణకు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. జులైలో డెంగీ సోకడంతో రూ.6 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇలా...

  • దోమల నిర్మూలనకుఏడాదికి ప్రభుత్వంకేటాయించే నిధులు: రూ.1.25 కోట్లు (పొగ, పిచికారీ వగైరా...)
  • ఉమ్మడి జిల్లాలో(తూర్పు మన్యంతో కలిపి) ప్రతి మూడేళ్లకోసారి దోమ తెరలకు కేంద్రంఅందించేది:రూ.1.30 కోట్లు
  • 2021 మార్చి నుంచి 2023 జులై నెలాఖరుఅధికారికంగా చూస్తే నమోదైన కేసులు మలేరియా: 226 డెంగీ: 2,036

ఏటా రూ.6 వేలు

దోమల నివారణకు ప్రతి ఇంటా దోమల చక్రాలు, రీఫిల్‌ పరికరాలు, బ్యాట్‌ లు, తెరలు కొనుగోలుకు నెల రూ.500 వరకు ఖర్చు చేస్తున్నారు. జ్వరమొస్తే రూ.500 కాస్తా రూ.5 వేలకు చేరుతోంది. ఉమ్మడి జిల్లాలో రెండేళ్లలో రెండు వేల డెంగీ, 200కు పైగా మలేరియా కేసులు నమోదయ్యాయి. చిన్న ఈగ ఎంత విధ్వంసం సృష్టించగలదో సినిమాలో చూపిస్తే నవ్వుకున్నాం. నిత్య జీవితంలో ఒక దోమ ప్రజారోగ్యాన్ని శాసిస్తుంటే చూస్తూ ఉండి పోతున్నాం.

కొవ్వూరు కౌన్సిల్‌ సమావేశాల్లో సగం సమయం పారిశుద్ధ్య నిర్వహణ అంశంపైనే అధికార, ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం దోమల సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.

ఇలా చేద్దాం..

ప్రభుత్వాలు చేసే నియంత్రణ చర్యలతో పాటు ప్రజలు ఎవరికివారు సామాజిక బాధ్యతగా ఈ విషయంలో దృష్టిసారించాలి.

  • సామాజిక బాధ్యతగా కాలనీ నివాసితులు ఇంటికి నెలకు రూ.10 చొప్పున వేసుకుని పరిసరాల్లోని కాలువల్లో చెత్త తీయించుకుంటే జవాబుదారీతనం ఉంటుంది. మళ్లీ కాలువల్లో చెత్త వేయకూడదనే భావన కలుగుతుందనేది పర్యావరణ నిపుణుల మాట.
  • జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఊరి చివర మురుగుపోయేందుకు అవుట్‌లెట్‌లు లేవు. ఇలాంటిచోట ఇంటి వద్ద ఆరడుగల లోతులో ఇంకుడు గుంతలు తవ్వించుకోవాలి.
  • ఇంటి లోపల ఫ్రిజ్‌ కింద నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, సెప్టిక్‌ ట్యాంకు పైపులకు నెట్‌ కట్టుకోవడం చేయాలి. ఖాళీ స్థలాల్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి.

ఉమ్మడి జిల్లాలో వెయ్యికి పైగా పంచాయతీలు, మూడు నగర పంచాయతీలు, ఏడు పురపాలికలు, రెండు నగరపాలక సంస్థల్లో పారిశుద్ధ్య నిర్వహణ ప్రధాన సమస్యగా మారింది. చెత్త తొలగింపు, దోమల నివారణ కార్యక్రమాలకు సిబ్బంది కొరత ఉంది.

250 హాట్‌ స్పాట్లు

ఏటా మలేరియా, డెంగీ కేసులు అధికంగా నమోదైన ప్రాంతాలను హాట్‌ స్పాట్లుగా గుర్తిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 250 పైగా హాట్‌ స్పాట్లను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో మరింత అప్రమత్తత అవసరం.

ప్రజా భాగస్వామ్యంతోనే సాధ్యం

పరిసరాల శుభ్రతపై అంతా బాధ్యతగా వ్యవహరిస్తేనే దోమల నివారణ సాధ్యమవుతుంది. ప్రజల భాగస్వామ్యం లేకుండా దోమల నివారణ సాధ్యం కాదు. నగర శివార్లలో ఇళ్ల మధ్య నీరు నిలిచిపోయి దోమల లార్వా పెరిగిపోతుంటుంది. అలాంటిచోట పంచాయతీ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతలు తీయించాలి.

డాక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరి, ప్రాంతీయ మలేరియా అధికారిణి, జోన్‌-2

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని