logo

తెలియకుండా బాదేస్తున్నారు..

వాడిన విద్యుత్తు కొంత... భారం కొండంత. వినియోగించినది కాకుండా మూడు అదనపు భారాలు. నెలవారీ విద్యుత్తు బిల్లులు చూసి జనం గగ్గోలు పెడుతున్నారు.

Published : 21 Aug 2023 04:54 IST

యూనిట్‌కు రూ.1.10 అదనపు విద్యుత్తు ఛార్జీలు

వాడిన విద్యుత్తు కొంత... భారం కొండంత. వినియోగించినది కాకుండా మూడు అదనపు భారాలు. నెలవారీ విద్యుత్తు బిల్లులు చూసి జనం గగ్గోలు పెడుతున్నారు. ట్రూఅప్‌... ఇంధన సర్దుబాటు ఛార్జీలు అంటూ వ్యాపారులు.. గృహ వినియోగదారుల నడ్డి విరుస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 18.76 లక్షల మందిపై అదనపు ఛార్జీల భారం పడుతుంది.

ఇటీవల కాలంలో వస్తున్న విద్యుత్తు బిల్లులు చూసి వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. వినియోగించిన విద్యుత్తు బిల్లుతోపాటు అదనంగా యూనిట్‌కు రూ.1.10 భారం వేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విద్యుత్తు ఛార్జీలు పెంచడంతోపాటు గతంలో వినియోగించిన దానిపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం వినియోగదారులపై మూడు రకాలుగా అదనపు చార్జీల భారం పడుతోంది. -న్యూస్‌టుడే, దేవీచౌక్‌(రాజమహేంద్రవరం)


మూడు రకాల మోత

  • 2014-19 సంవత్సరాల్లో వినియోగించిన యూనిట్లను ఆధారంగా చేసుకుని ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో  ఆగస్టు 2022 నుంచి జనవరి 2024 వరకు వసూలు చేస్తున్నారు.
  •  దీంతోపాటు 2021-22 సంవత్సరంలో విద్యుత్తు కొనుగోలుకు సంబంధించి ఎఫ్‌పీపీసీఏ(ఇంధన సర్దుబాటు ఛార్జీలు) భారం ఈ ఏడాది మే నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకు వినియోగదారులు మోయాల్సి వస్తోంది.
  •  ఈ ఏడాది జూన్‌ నుంచి ఎఫ్‌పీపీసీఏ-2 యూనిట్‌కు నలభై పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది ఎప్పటి వరకు వసూలు చేస్తారనేది అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు.

 సర్దుబాటు భారం పెరిగి..

ఈ మూడు వెరసి ఇటీవల వస్తున్న విద్యుత్తు బిల్లులు గతంలో కంటే రెట్టింపు ఉంటున్నాయని వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంధన సర్దుబాటు ఛార్జీలు మూడు నెలలకోసారి మారుతుండటం కూడా జులై నెల నుంచి బిల్లు ఎక్కువ రావడానికి ప్రధాన కారణం. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు 0.1975 పైసలు ఉన్న సర్దుబాటు ఛార్జి ఆగస్టు నుంచి 0.6194గా నిర్ణయించారు.


ప్రస్తుతం వసూలు చేస్తున్న వివిధ రకాల ఛార్జీలు(యూనిట్‌కు)

  • ట్రూఅప్‌: ఏడు పైసలు చొప్పున (జనవరి 2024 వరకు)
  • ఎఫ్‌పీపీసీఏ: 2023 మే, జూన్‌, జులై-0.1975 పైసలు
  •  ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు-0.6194 పైసలు,
  • నవంబరు, డిసెంబరు, జనవరి-0.5652 పైసలు
  • ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌-0.6455 పైసలు
  • ఎఫ్‌పీపీసీఏ-2: 0.40 పైసలు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు