logo

ఇదేం ఉచితం.. జగనన్నా..!

విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో నిరుపేదలు, అభాగ్యులకు 25 శాతం సీట్లు కల్పించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ చట్టం ప్రకారం ఉచిత సీట్లను రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరం నుంచే కేటాయిస్తున్నారు.

Updated : 10 Mar 2024 07:57 IST

ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు సీట్లు
‘అమ్మఒడి’ నుంచి ఫీజు వసూలు

న్యూస్‌టుడే, కాకినాడ నగరం: విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో నిరుపేదలు, అభాగ్యులకు 25 శాతం సీట్లు కల్పించాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ చట్టం ప్రకారం ఉచిత సీట్లను రాష్ట్రంలో 2022-23 విద్యా సంవత్సరం నుంచే కేటాయిస్తున్నారు. ఐబీ, ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ, రాష్ట్ర సిలబస్‌ బోధించే ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. వాస్తవానికి ఈ చట్టం కింద చేరే పిల్లలకు బోధనా రుసుములు (ఫీజు) ప్రభుత్వమే చెల్లించాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరో మార్గం సూచించింది. ‘అమ్మఒడి’ పథకం నుంచి ఫీజు తీసుకోవాలని సూచించింది. అర్బన్‌ ప్రాంతాల్లో రూ.8 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6 వేల చొప్పున ఫీజుగా నిర్దేశించి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించింది. అయితే ‘అమ్మఒడి’ నిధులు వచ్చేలోగా ఆయా పాఠశాలలకు తల్లిదండ్రులే ఫీజు చెల్లించాలని విద్యా శాఖ అధికారులు పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఉచిత ప్రవేశాలని చెప్పి ఫీజు వసూలు చేస్తారా అని తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు.

  • కాకినాడ జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరంలో 215 మందికి, 2023-24లో 1,141 మంది పిల్లలకు ఆయా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించారు. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
  • ఈ చట్టం కింద పేద వర్గాలకు కేటాయించాల్సిన సీట్ల భర్తీపై మార్గర్శకాలున్నాయి. వాటి ప్రకారం అనాథలు, హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం, నిరుపేద ఎస్సీ పిల్లలకు 10 శాతం, ఎస్టీ చిన్నారులకు 4 శాతం, బీసీ, మైనారిటీ, ఓసీ తదితర ఆర్థికంగా వెనకబడిన వర్గాల పిల్లలకు 6 శాతం చొప్పున సీట్లకు దరఖాస్తుల స్వీకరణ అనంతరం లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ఫీజు విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. ఉచిత సీట్లని ప్రకటించినా ఆయా విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం అందించే ‘అమ్మఒడి’ సాయం నుంచే ఫీజు వసూలు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించడం వివాదాస్పదంగా మారింది. ఇలాగైతే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించుకుంటామని చెబుతున్నారు. ప్రభుత్వ బడుల్లో ఏకరూప దుస్తులు, బూట్లు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు అమ్మఒడి సాయం కూడా అందేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పథకంలో చేరే పిల్లలకు తల్లి లేదా తండ్రి లేకపోవడం, కొందరికి ఇద్దరూ లేకపోవడం.. ఇద్దరూ ఉంటే వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడం, కొందరు సంరక్షుల వద్ద పెరగడం ఇవన్నీ ప్రతికూలతలుగా మారుతున్నాయి.

పాత బకాయిల వసూళ్లకే..

ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఫీజుపై ఎలాంటి ఒత్తిడి లేదు. 2022-23 విద్యా సంవత్సరంలో చాలామంది ‘అమ్మఒడి’ సొమ్ము ఫీజుగా చెల్లించలేదు. ఈ కారణంగా ఆయా పాఠశాలల యజమానులు మాపై ఒత్తిడి తెస్తున్నారు. కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. పాత బకాయిలు చెల్లించాలని సూచిస్తున్నామే తప్ప ఎవరినీ ఒత్తిడికి గురిచేయడం లేదు.

పి.రమేష్‌, సమగ్ర శిక్ష ఇన్‌ఛార్జి ఏపీసీ, డీఈవో


తల్లిదండ్రులపై ఒత్తిడి..

ప్రభుత్వం ముందుగా ఉచిత సీట్లను ప్రకటించింది. తీరా ప్రవేశాలు కల్పించాక ‘అమ్మఒడి’ పథకంలో రూ.13 వేలు చొప్పున జమయ్యే నిధుల నుంచి కోత పెడుతోంది. అయితే చిన్నారుల తల్లి లేదా సంరక్షకుల ఖాతాలో జమవుతున్న ఈ సొమ్మును వారు తమ అవసరాలకు ఖర్చు చేస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరంలో 215 మందికి ప్రవేశాలు కల్పించగా వీరిలో సగానికిపైగా విద్యార్థులకు ఫీజు జమకాలేదు. 2023-24 విద్యా సంవత్సరం మరో నెల రోజుల్లో ముగియనుంది. వీరికి ఇంకా అమ్మఒడి పథకం డబ్బులు ఖాతాల్లో జమకాలేదు. వచ్చే జూన్‌ నెలలో వచ్చే అవకాశముందని సమాచారం. ఈలోగా 2024-25 విద్యా సంవత్సరంలో 25 శాతం సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్రైవేటు పాఠశాలల యజమానులు ఫీజు కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టు వారికి అనుకూలంగా స్పందించడంతో ఫీజు బకాయిలు చెల్లించాలని తల్లిదండ్రులపై విద్యా శాఖ యంత్రాంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి తెస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని