logo

అనపర్తి.. వీడిన అనిశ్చితి

అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది.

Published : 24 Apr 2024 06:44 IST

కమలం గుర్తుతో పోటీచేయనున్న నల్లమిల్లి

ఆన్‌లైన్‌లో సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటున్న నల్లమిల్లి.. వేదికపై భాజపా నేతలు సూర్యనారాయణరాజు, సిద్ధార్థనాథ్‌ సింగ్‌, అరుణ్‌సింగ్‌, పురందేశ్వరి, శివరామకృష్ణంరాజు

 ఈనాడు, రాజమహేంద్రవరం: అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థి స్థానంపై కొన్నిరోజులుగా నెలకొన్న ఉత్కంఠ వీడింది. కూటమి పెద్దల నిర్ణయంతో సుమారు 27 రోజుల తర్వాత అనిశ్చితికి తెరపడింది. మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భాజపా తరఫున ఇక్కడినుంచి పోటీ చేయనున్నారు. తెదేపా విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాలోనే అనపర్తి నుంచి నల్లమిల్లిని ప్రకటించిన విషయం తెలిసిందే. పొత్తు నేపథ్యంలో మారిన సమీకరణాలతో ఆ స్థానాన్ని భాజపాకు కేటాయించడంతో మాజీ సైనికుడు కృష్ణంరాజు పేరును ప్రకటించారు. దీంతో మార్చి 28న నల్లమిల్లి క్యాడర్‌తో సమావేశమయ్యారు. ‘న్యాయం కోసం నల్లమిల్లి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఇతర ముఖ్యనాయకులతో పలు దఫాలుగా నల్లమిల్లి చర్చలు జరిపారు. ఈ క్రమంలో అనేక ప్రతిపాదనలు వచ్చినా.. కూటమి అభ్యర్థి గెలవాలనే లక్ష్యంతో తాజా నిర్ణయం తీసుకున్నారు.

 జెండాలు వేరైనా అజెండా ఒక్కటే

 నల్లమిల్లి కుటుంబానికి 40 ఏళ్లుగా తెదేపాతో అనుబంధం.. తొమ్మిదిసార్లు సైకిల్‌ గుర్తుతో పోటీ చేశారు. మారిన సమీకరణాలతో నల్లమిల్లి మంగళవారం భాజపాలో చేరారు. తొలిసారిగా కమలం గుర్తుతో బరిలో నిలవనున్నారు. అందరితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. జెండాలు వేరైనా అందరి అజెండా ఒక్కటేనన్నారు. ‘కమలం’ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ప్రచారం చేస్తామన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకే గుర్తుతో పోటీలో ఉండడంతో ఇద్దరికీ విజయావకాశాలు మెండుగా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని