logo

ఓడించలేమా ఒంటి చేత..!

అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా దినోత్సవం ముందురోజే వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా సాయం అందించడం ఎంతో సంతోషం కలిగిస్తోంది.

Published : 30 Apr 2024 06:15 IST

ప్రభుత్వ తీరుపై అక్కచెల్లెమ్మల ఆగ్రహం

ఇటీవల వైఎస్‌ఆర్‌ ఆసరాలో నమూనా చెక్కు ఇస్తున్న వైకాపా ప్రజాప్రతినిధులు

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌: అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళా దినోత్సవం ముందురోజే వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా సాయం అందించడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. మహిళా సాధికారత పట్ల ఇంత చిత్తశుద్ధి చూపిన ప్రభుత్వం దేశ చరిత్రలోనే మరొకటి లేదు.

  • నాలుగో విడత చేయూత కార్యక్రమంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలివి.కానీ చేయూత, ఆసరా నిధులు విడుదలకు ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి నెలలు కావస్తున్నా ఇప్పటివరకు సుమారు 70శాతంపైగా మహిళల ఖాతాలకు జమకాలేదు. వైకాపా ప్రజాప్రతినిధులు నమూనా చెక్కులతో కార్యక్రమాలు ఆర్భాటంగా చేస్తున్నా.. నెలలు దాటుతున్నా సొమ్ము రాలేదు. హామీలు మరిచినందుకు ఓటుతో తగిన గుణపాఠం చెప్పలేమా.. అని మహిళలు అభిప్రాయపడుతున్నారు.

ఆసరా దక్కలేదు: జిల్లాలో ఆసరా పథకానికి 31,093 గ్రూపులు అర్హత సాధించాయి. వీరిలో ఇప్పటివరకు 19,553 గ్రూపులకు నిధులు విడుదల చేశారు. మొత్తం రూ.254.24 కోట్లకుగాను రూ.153.27 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇంకా సుమారు 12 వేల గ్రూపులకు రూ.100 కోట్లపైనే విడుదల కావాల్సిఉంది.
చేయూత లేదు: చేయూతకు సంబంధించి జిల్లాలో నాలుగో విడతకు 89,619 మందిని అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.168.03 కోట్లు విడుదల కావాల్సిఉంది. నేటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు.
వడ్డీకి సున్నా..: జిల్లాలో సుమారు 30 వేల మహిళా సంఘాల సభ్యులకు ఏటా రూ.కోట్ల సున్నావడ్డీ రాయితీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఏటా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు వడ్డీ భారం మహిళలపై మోపుతున్నారు. డ్వాక్రా మహిళలకు రూ.లక్ష వరకు వడ్డీలేని రుణమిస్తామన్న జగన్‌ హామీ నేటికీ అమలు కాలేదు. గత ప్రభుత్వంలో రూ.10 లక్షల వరకు ఎంత రుణం తీసుకున్నా రూ.5 లక్షల వరకు వడ్డీ రాయితీ అందించేవారు. వైకాపా రూ.3 లక్షలకు తగ్గించింది.
ఉన్నతి ఉట్టెక్కింది: గత ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ మహిళల ఉన్నతికి ఒక్కొక్కరికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వడ్డీలేని ఉన్నతి రుణాలిచ్చేవారు. వైకాపా పైసా కూడా కేటాయించలేదు.
అభయహస్తం దారి మళ్లింది: డ్వాక్రా సంఘాల సభ్యురాళ్లకు 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛను ఇచ్చేందుకు 2009లో అభయహస్తం పథకం ప్రవేశపెట్టారు. జిల్లాలో పొదుపు మహిళలు, ప్రభుత్వం వాటా కలిపి సుమారు రూ.60కోట్ల వరకు ఉంది. పొదుపు మహిళలు దాచుకున్న సొమ్ము జగన్‌ నవరత్నాలుకు మళ్లించారు. 11 వేల మందికి నెలకు రూ.500 మాత్రమే అభయహస్తం పింఛను అందజేస్తున్నారు. వీరికి ఒక్క రూపాయీ పెంచలేదు.
మిత్రలకు తీరని ద్రోహం: గత ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమా పథకంలో ఆరోగ్యమిత్రలుగా మండలానికి ఇద్దరు చొప్పున మహిళా సంఘాల్లో సభ్యులు విధులు నిర్వహించేవారు. వైకాపా అధికారంలోకి రాగానే వారిని తొలగించారు. దీంతో పలువురు మహిళలు ఉపాధికి దూరమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని