logo

వైకాపా పాలనలో 20 ఏళ్లు వెనక్కు

మోదీకి దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్న సీఎం జగన్‌.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ వారసుడు ఎలా అవుతారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

Updated : 30 Apr 2024 07:05 IST

పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: మోదీకి దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్న సీఎం జగన్‌.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రాజకీయ వారసుడు ఎలా అవుతారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, సిటీ, గ్రామీణ నియోజక వర్గాల అభ్యర్థులు బోడ వెంకట్‌, బాలేపల్లి మురళీధర్‌లతో కలిసి సోమవారం రాత్రి ఆమె నగరంలో బస్సుయాత్ర చేపట్టారు. శ్యామలా థియేటర్‌ సమీపంలో సభలో ఆమె మాట్లాడారు. వైకాపా విధానాలతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా అంశాన్ని ఉద్యమంలా చేపట్టిన జగన్‌.. అధికారం వచ్చాక కేంద్రం కాళ్ల కింద తాకట్టుపెట్టారన్నారు. అయిదేళ్ల పాలనలో కనీసం రాజధాని కూడా కట్టలేని పరిస్థితికి దిగజారిపోయారన్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తానని ప్రకటించి విస్మరించారన్నారు. చివరకు జగన్‌ సర్కారే మద్యం అమ్మే పరిస్థితికి వచ్చిందన్నారు.

కేంద్రంతో జగన్‌ అక్రమ పొత్తు

రాష్ట్రంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు నేరుగా భాజపాతో పొత్తు పెట్టుకుంటే.. జగన్‌ మాత్రం అక్రమ పొత్తు కొనసాగిస్తున్నాడని ఆరోపించారు. భాజపా మతతత్వ పార్టీ అని, రాజశేఖర్‌రెడ్డి వారసురాలిగా కేంద్రంపై యుద్ధం చేస్తున్నానన్నారు. కాంగ్రెస్‌ మాత్రమే ప్రత్యేక హోదా తీసుకొస్తుందని స్పష్టం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 0.8 శాతం ఓట్లు లేని భాజపా రాష్ట్రాన్ని కబ్జా చేయాలని చూస్తోందన్నారు. పురందేశ్వరి భాజపాలో కొనసాగడంతో ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నికల్లో విచక్షణతో ఓటు వేయాల్సి ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని