logo

అధికార పార్టీకి డీఎస్పీ దన్ను..!

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి అన్ని విభాగాల అధికారులు విధుల్లో తలమునకలై ఉన్నారు.

Published : 05 May 2024 03:58 IST

ఎన్నికల కమిషన్‌కు తెదేపా ఫిర్యాదుతో చర్చనీయాంశం

విజయ్‌పాల్‌

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, దానవాయిపేట: ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి అన్ని విభాగాల అధికారులు విధుల్లో తలమునకలై ఉన్నారు. ఈ సమయంలో నిష్పక్షపాతంగా ఉండాల్సిన అధికారుల్లో కొందరు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ప్రతిపక్షాలను ఉద్దేశపూర్వంగా ఇబ్బందులు పెడుతున్నారనే వాదన తెదేపా నుంచి వినిపిస్తోంది. ఇప్పటివరకు ఆరోపణలు చేసినప్పటికీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసిన సందర్భాలు పెద్దగా లేవు. తాజాగా రాజమహేంద్రవరం సెంట్రల్‌జోన్‌ డీఎస్పీ విజయ్‌పాల్‌ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తెదేపా శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతూ స్వామిభక్తి చూపుతూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు వర్గాల్లో ఆయన వ్యవహరించే శైలి చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారులు సైతం ఆ దిశగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.

ఏడాది క్రితమే బాధ్యతల స్వీకరణ..: రాజమహేంద్రవరం సెంట్రల్‌జోన్‌ డీఎస్పీగా విజయ్‌పాల్‌ గత ఏడాది మే 6న బాధ్యతలు స్వీకరించారు. ఈయన బాధ్యతలు చేపట్టడంలో ఎంపీ మార్గాని భరత్‌ చక్రం తిప్పారన్న ఆరోపణలున్నాయి. ఎన్నికల్లో రాజమహేంద్రవరం నగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండాలని ముందుగానే భరత్‌ నిర్ణయించుకోవడంతో ఆ దిశగా తనకు అనుకూలంగా ఉండే కొందరు పోలీసు అధికారులను నియమించారనే వాదన ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. ఏ అభివృద్ధి పని చేయాలన్నా ఎంపీ కమీషన్‌ వసూళ్లు చేస్తున్నారని పేర్కొంటూ ఇటీవల నగరంలో కరపత్రాలు హల్‌చల్‌ చేశాయి. ఈ సందర్భంగా తనకు ప్రతికూలంగా కరపత్రాలు ముద్రించిన వారిని పట్టుకోవాలని డీఎస్పీని ఎంపీ సూచించగా.. ఆయన ముగ్గురు సీఐలపై తీవ్ర ఒత్తిడి చేశారని పోలీసు వర్గాల్లో అప్పట్లో తీవ్రమైన చర్చ జరిగింది. అధికార పార్టీ నాయకులు ఎన్నికల సదర్భంగా కొంతకాలంగా చీరలు, ఇతర తాయిలాలు పంపిణీ చేస్తున్న విషయం విదితమే. షెడ్యూల్‌ విడుదలై తరువాత ఓ వ్యాన్‌లో తాయిలాలు వచ్చిన విషయం తెలిసినా మిన్నకుండిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం తెదేపా నాయకులను ఇబ్బందులకు గురిచేసేందుకు పాతకేసులు తిరగతోడుతున్నారని తెదేపా నాయకులు ఆరోపిస్తూ, తాజాగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని