logo

జగన్‌ జమానాలో.. అంపశయ్యపై ఆరోగ్యశ్రీ

క్షేత్రస్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితి దయనీయంగా ఉంది. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం లేదు. రూ.కోట్లల్లో బకాయిలు నెలల తరబడి ఇవ్వకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Published : 06 May 2024 05:59 IST

నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించని సర్కారు
వైద్య సేవలపై తీవ్ర ప్రభావం
న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

దేశంలో మరెక్కడా లేనట్టుగా పేదలకు వైద్య సేవలందిస్తున్నాం.. ఆరోగ్యశ్రీ పథకంలో 3,200 చికిత్సలకు ఉచితంగా వైద్యం చేయిస్తున్నాం.. పైసా ఖర్చు చేయకుండా కార్పొరేట్‌ వైద్యం పొందొచ్చు

... ఇదీ వైకాపా ప్రభుత్వ పెద్దల బడాయి మాటలు


క్షేత్రస్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితి దయనీయంగా ఉంది. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం లేదు. రూ.కోట్లల్లో బకాయిలు నెలల తరబడి ఇవ్వకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బకాయిల పెండింగ్‌ ప్రభావం రోగులకు అందించే వైద్యసేవలపై పడుతోంది. సేవలు ఆపేస్తామని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సంఘం ఆధ్వర్యంలో హెచ్చరిక లేఖలు రాస్తే కొంతమేర విడుదల చేసి మమ అనిపిస్తున్నారు. దీంతో రోగులకు పూర్తిస్థాయి సేవలందడం లేదు. కొందరికి ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పి డబ్బులు చెల్లించుకోవడం.. కొందరి వద్ద పరీక్షల పేరిట అధికంగా వసూలు చేయడం.. కొన్ని న్యూరో సంబంధిత కేసులకు వర్తించదని చెప్పి ప్రభుత్వాసుపత్రులకు పంపేయడం వంటివి ఇటీవల అధికంగా జరుగుతున్నాయి.


జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లావ్యాప్తంగా ఆయా ఆసుపత్రుల పరిధిలో సుమారు రూ.100 కోట్ల వరకు ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో 90 వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి. ఇందులో 53 ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. బకాయిలు అందకపోవడంతో నెట్‌వర్క్‌ ఆసుపత్రులు చేతులెత్తేస్తున్నాయి. ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల గురించి ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో ఆర్థిక భారం పడుతోందని ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు వాపోతున్నాయి.


ఇదీఆసుపత్రుల ఆవేదన ఆరోగ్య

శ్రీకి సంబంధించి ప్రతి చికిత్సకు పథకం ప్రారంభమైనప్పుడు ఎంత ప్యాకేజీ ఇచ్చారో ప్రస్తుతం కూడా అదే ఇస్తుండడంతో నిర్వహణ భారంగా ఉందని ఆయా యాజమాన్యాలు చెబుతున్నాయి. కొన్ని నెలల నుంచి బిల్లులు రాకపోవడం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఫార్మసీ, సర్జికల్‌ సామగ్రి, గుండెకు వేసే స్టంట్లు, ఆర్థో శస్త్రచికిత్సల్లో వేసే రాడ్లు, అంబులెన్సులు, ఉద్యోగులకు వేతనాలు అన్నీ అప్పులు చేసి నెట్టుకొస్తున్నామంటున్నారు. ఈ ప్రభావం రోగులు, వారికి అందించే సేవలపై పడుతోంది. కేంద్రం అందించే ఆయుష్మాన్‌ భారత్‌ నిధులను సైతం మళ్లించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల నుంచి రోగుల వివరాలు ప్రతి నెలా అందజేయాలని ఆదేశిస్తోంది.


జరుగుతోందిలా..

గతంలో ఆసుపత్రులకు ప్రతి మూడు నెలలకు బకాయిలు విడుదలయ్యేవి. ప్రస్తుతం స్వల్ప మొత్తంలో ఇటీవల ఒక 20 శాతం బకాయి వేయడం మినహా సుమారు ఏడు నెలల నుంచి బిల్లులు పూర్తవడం లేదు. ఏదైనా అనారోగ్యంతో వస్తే ఆ సమస్య ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని, వైద్య ఖర్చుల్లో రాయితీ ఇస్తామని చెప్పి చేర్చుకుంటున్నారు. కొన్నిచోట్ల చికిత్సలు చేస్తున్నా ముందుగా పరీక్షలు, స్కానింగులకు అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు ఆరోగ్యశ్రీలో చికిత్సకు అనుమతి రావాలంటే ఆలస్యమవుతుందని చెప్పి పంపేస్తున్నారు. వారు చేసేదిలేక అప్పులు చేసి డబ్బు చెల్లించి చికిత్స తీసుకుంటున్న పరిస్థితులున్నాయి.

తూర్పు గోదావరి జిల్లాలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులివీ

ప్రైవేట్‌ ఆసుపత్రులు 36
దంత వైద్యశాలలు 17
ప్రభుత్వ ఆసుపత్రులు 35 పీహెచ్‌సీలు
జిల్లాలో మొత్తం ఆరోగ్యశ్రీ కార్డులు 4.60 లక్షలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని