logo

భవిష్యత్తు మనదే

‘ఎన్నికలకు సరిగ్గా వారం ఉంది. మా ప్రసంగాలు వినండి. కూటమి మ్యానిఫెస్టో చదవండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని పవన్‌కల్యాణ్‌ కోరారు. కాకినాడ జిల్లా తునిలోని గొల్ల అప్పారావు కూడలిలో వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆదివారం సాయంత్రం ఆయన ప్రసంగించారు.

Published : 06 May 2024 06:32 IST

మ్యానిఫెస్టో చదవండి.. కూటమికి ఓటెయ్యండి
వైకాపా కోటలు బద్దలే
వారాహి విజయభేరి సభలో జనసేనాని
ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, తుని, తుని పట్టణం, తుని గ్రామీణం

వేదికపై పవన్‌ కల్యాణ్‌, అభ్యర్థులు ఉదయ్‌ శ్రీనివాస్‌, యనమల దివ్య, అనిత

‘ఎన్నికలకు సరిగ్గా వారం ఉంది. మా ప్రసంగాలు వినండి. కూటమి మ్యానిఫెస్టో చదవండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి’ అని పవన్‌కల్యాణ్‌ కోరారు. కాకినాడ జిల్లా తునిలోని గొల్ల అప్పారావు కూడలిలో వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆదివారం సాయంత్రం ఆయన ప్రసంగించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఏకం కావాలన్నారు. ఈ ఎన్నికలను ప్రత్యేక దృష్టితో చూసి కూటమిని గెలిపించాలన్నారు.. ఓట్లు అడగడానికి కాదు.. అభ్యర్థించడానికి వచ్చాన’న్నారు.

అంతా రాష్ట్రం బాగుకోసమే

‘తుని ఆడబిడ్డల, తలుపులమ్మ తల్లి ఆశీస్సులతో కూటమి అఖండ విజయం సాధిస్తుంది. వైకాపా అవినీతి కోటలు బద్దలు కొడుతున్నాం. వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదని అందరం ఏకతాటిపైకి వచ్చాం. ఇంట్లో ఆడవారినీ తిట్టే పరిస్థితిని తట్టుకుని నిలబడ్డామంటే రాష్ట్రం బాగు కోసమే’ అని పవన్‌కల్యాణ్‌ అన్నారు.

హాజరైన జన సందోహం

మర్చిపోలేని రైలు ఘటన..

‘తుని అంటే ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రం. కాపు రిజర్వేషన్‌కు సంబంధించి ఇక్కడ రైలు తగలబెట్టేశారనే భావన ప్రతి ఒక్కరి మనుసులో ఉండిపోయింది. దాన్ని చెరపడానికే నేను 2018లో రైలులో తుని వచ్చాను. సుఖశాంతులతో ఉండాలనే సంకేతాలు పంపాలని రైల్వేస్టేషన్‌కు వచ్చానని’ పవన్‌కల్యాణ్‌ అన్నారు. కార్యక్రమంలో కాకినాడ లోక్‌సభ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌, తుని, పాయకరావుపేట అభ్యర్థులు యనమల దివ్య, వంగలపూడి అనిత, కూటమి నాయకులు యనమల రాజేష్‌, తుమ్మల రామస్వామి, తోట సుధీర్‌, తదితరులు పాల్గొన్నారు.


బంగాళాఖాతంలో కలిపేశావా జగన్‌..

తుని నియోజకవర్గంలో దివిస్‌ సమస్య ఎక్కువగా ఉంది. జగన్‌ వచ్చి దివిస్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పి ప్రారంభించారు. సముద్రంలోకి వదిలిన కలుషిత జలాలతో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుంది. నేను మాట ఇస్తున్నా. పరిశ్రమ కాలుష్యం మత్స్యకారుల జీవితాలకు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే.. పవన్‌ కల్యాణ్‌, తెదేపా, భాజపా ముందుండి.. కాలుష్యం వారి జీవితాలను నాశనం చేయకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని