logo

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌లో రెండవ నంబరు ప్లాట్‌ఫామ్‌ వద్ద సోమవారం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఇక్కడి పట్టాలు(ట్రాక్‌) సమస్యే దీనికి కారణంగా తెలుస్తుంది.

Published : 07 May 2024 04:23 IST

రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌లో ఘటన

రైల్వేస్టేషన్‌లోని రెండవ ప్లాట్‌ఫామ్‌ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌ బోగి

వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌లో రెండవ నంబరు ప్లాట్‌ఫామ్‌ వద్ద సోమవారం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఇక్కడి పట్టాలు(ట్రాక్‌) సమస్యే దీనికి కారణంగా తెలుస్తుంది. ఎరువుల లోడుతో పారాదీప్‌ నుంచి బళ్లారి వెళ్తున్న ఈ గూడ్స్‌ ఉదయం 6.20 గంటల సమయంలో ఇక్కడి ప్రధాన రైల్వేస్టేషన్‌కు వచ్చింది. రెండవ నంబరు ప్లాట్‌ఫామ్‌పై నుంచి వెళ్తుండగా వెనుక నుంచి అయిదవ బోగీ చక్రం పట్టా తప్పింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు పట్టాలు తప్పిన బోగి నుంచి మిగతా బోగీలను వేరుచేసిన తర్వాత ఉదయం 8.30 గంటల సమయంలో దీనిని పట్టా ఎక్కించి అక్కడి నుంచి తొలగించారు. ఈ సమయంలో రెండో ప్లాట్‌ఫామ్‌ పైనుంచి వెళ్లాల్సిన మిగతా రైళ్లను వేరే ట్రాక్‌ మీదుగా మళ్లించారు. మిగతా రైళ్ల రాకపోకలకు ఆటంకం లేకుండా చూసినప్పటికీ క్లియరెన్స్‌ కోసం ఉదయం 6.40 గంటల సమయంలో ఇక్కడి ఒకటో నంబరు ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన షాలిమార్‌-సికింద్రాబాద్‌ సూపర్‌ఫాస్ట్‌ రైలును మాత్రం 15 నిమిషాల పాటు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడ్డారు. ఇక్కడి రెండవ ప్లాట్‌ఫామ్‌లో ట్రాక్‌ సమస్య కారణంగా గతంలోనూ కొంతకాలం రైళ్లు నిలపడం మానేసి మరమ్మతులు చేశారు. ట్రాక్‌ పూర్తిగా తొలగించి కొత్తగా వేసేందుకు ప్రతిపాదనలు ఉండటంతో ప్రస్తుతం దీనిపై ఎక్కువ రైళ్లను ఆపడంలేదు. ఈ స్టేషన్‌ మీదుగా ప్రతిరోజూ 160 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ఎక్స్‌ప్రెస్‌లు 90 వరకు ఉండగా మిగతావి గూడ్స్‌లే. రెండవ ప్లాట్‌ఫామ్‌పై ట్రాక్‌ సమస్య ఉండటంతో దీనిపై కొన్ని ఎక్స్‌ప్రెస్‌లను ఆపడం తగ్గించి గూడ్స్‌ రైళ్లనే ఎక్కువగా పంపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని