logo

వైకాపా నాయకులు చెబితేనే జీతాలిస్తారా!

రాజీనామాలు చేసి మేము చెప్పినట్లుగా ప్రచారంలోకి వస్తేనే అన్ని సవ్యంగా మీకు ఉంటాయి.. జీతాలు కూడా పడతాయంటూ వైకాపా నాయకుల ఆదేశాలతో రాజీనామా పత్రాలిచ్చేసిన వారిలో కొంతమందికి జీతాలు పడడం చర్చనీయాంశంగా మారింది.

Published : 07 May 2024 04:35 IST

రాజీనామాలు చేయని వాలంటీర్ల ఆందోళన

సీతానగరం, న్యూస్‌టుడే: రాజీనామాలు చేసి మేము చెప్పినట్లుగా ప్రచారంలోకి వస్తేనే అన్ని సవ్యంగా మీకు ఉంటాయి.. జీతాలు కూడా పడతాయంటూ వైకాపా నాయకుల ఆదేశాలతో రాజీనామా పత్రాలిచ్చేసిన వారిలో కొంతమందికి జీతాలు పడడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ రాజీనామాలు చేయనివారికి జీతాలు పడకపోవడం.. ఇది మావల్లనేనంటూ కొంతమంది వైకాపా నాయకులు గర్వంగా చెప్పుకోవడంపై విధుల్లో ఉన్నవారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీతానగరం మండలంలోని గ్రామసచివాలయాల పరిధిలో 286 మందితో వైకాపా నాయకులు గతంలో రాజీనామాలు చేయించారు. 55 మంది రాజీనామాలు చేసేందుకు మొండికేశారు. వీరిపై బెదరింపులకు దిగినా నిరాకరించారు. అయితే తమకు జీతాలు వేయకుండా రాజీనామాలు చేసిన వారికి మార్చినెలతోపాటు ఏప్రిల్‌లో కొన్నిరోజులకు జీతాలు వేయడమేమిటంటూ పలుచోట్ల వాలంటీర్లు అధికారులను నిలదీస్తున్నారు. వైకాపా నాయకుల వద్దకు వెళ్లితే మీరు కూడా రాజీనామాలు చేసి పత్రాలు మాకిచ్చేయండి చాలు మీ జీతాలు వచ్చే బాధ్యత మాది అంటున్నారని పలువురు వాపోతున్నారు. రాజీనామాలు చేసి వైకాపాకు ప్రచారం చేయడం మాకిష్టం లేదు.. జీతాలు ఇవ్వకపోయినా ఫర్వాలేదంటూ మండలంలోని రఘుదేవపురం గ్రామ సచివాలయానికి చెందిన ఓ వాలంటీరు అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. జీతాలు మాకు ఎందుకు పెట్టలేదని ఓ గ్రామ సచివాలయం పరిధిలోని వాలంటీర్లు కార్యదర్శిని అడుగుతుంటే మీరు హాజరువేయకపోవడం వల్లేనని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. డివైజర్లు, ఫోన్లు తీసుకుంటే హాజరు ఎలా వేస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది వైకాపా నాయకులతో కలిసి ఉద్యోగులు ఆడుతున్న పెద్ద డ్రామా అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని