logo

జనాలకు జగన్‌ గండం

ముఖ్యమంత్రి సభ అంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో మంగళవారం మేమంతా సిద్ధం సభ జరిగింది. ఈ నేపథ్యంలో కోరుకొండ బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిపివేశారు.

Published : 08 May 2024 06:24 IST

సీఎం జగన్‌ కాన్వాయ్‌ వస్తుంటే జనాన్ని పక్కకు నెట్టేస్తున్న పోలీసులు

ఈనాడు, రాజమహేంద్రవరం, కోరుకొండ, గోకవరం, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, ఏవీఏ రోడ్డు, రాజానగరం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి సభ అంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్నారు. రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో మంగళవారం మేమంతా సిద్ధం సభ జరిగింది. ఈ నేపథ్యంలో కోరుకొండ బస్టాండ్‌ వద్ద ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిపివేశారు. నిత్యం రాజమహేంద్రవరం నుంచి గోకవరం, రంపచోడవరం, మారేడుమిల్లి, భద్రాచలం మీదుగా బస్సులు వెళ్తాయి. ఆ బస్సులు కోరుకొండ రాకుండా జంబుపట్నం, నర్సాపురం, కణుకూరు, తిరుమలయపాలెం, రంప ఎర్రంపాలెం, వీర్లంకపల్లి మీదుగా గోకవరం వైపు మలిచారు. సుమారు 15 కి.మీ చుట్టూ తిరిగి వెళ్లడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కోరుకొండ బస్టాండ్‌ నుంచి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంకు వెళ్లే రహదారిలో సభ పెట్టడంతో ఆలయానికి వెళ్లే ప్రతీ మార్గం మూసేశారు. పక్క వీధుల్లోనూ వాహనాలను అనుమతించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటల నుంచి ఆంక్షలు మొదలైపోయాయి.

గంటన్నర ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌

పోలీసుల ఆంక్షలతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలిస్తున్న 108 వాహనం అందులో చిక్కుకుంది. సుమారు గంటన్నర సేపు అందులో చిక్కుకోవడంతో రోగి సహాయకులు తీవ్ర అసహనానికి గురయ్యారు.

ఇరుకు రోడ్డులో తోపులాట

వేదికను ఇరుకు రోడ్డులో ఏర్పాటు చేశారు. కాన్వాయ్‌ వచ్చే సమయంలో రోప్‌ పార్టీ వారందరినీ పక్కకు నెట్టడంతో ఇరుకు రోడ్డులో తోపులాట జరిగింది. ఎక్కువ మంది జనాలు వచ్చారని చూపించేందుకు ఇలా చేశారని సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ సైతం రోడ్డులో వెళ్లలేక కేవలం జామర్‌ వాహనంతోపాటు ఆయన వెనుక ఒక కారులో మాత్రమే వెళ్లాల్సి వచ్చింది. జగన్‌ మాట్లాడుతుంటే చాలామంది వెనుదిరిగారు.

జనాల తరలింపు..

పలు విద్యాసంస్థలకు చెందిన సుమారు 300 బస్సుల్లో జనాలను తరలించారు. దూరాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కరికీ రూ.200 నుంచి రూ.500 వరకు ఇచ్చినట్లు అక్కడకు వచ్చిన వారు చెబుతున్నారు. కొన్ని గ్రామాల నుంచి ఉపాధి హామీ కూలీలకు మస్తర్లు వేసి తరలించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు