logo

నాయకా.. ఇంకెన్నాళ్లు ముంచుతారు?

చారిత్రక నగరంలో వర్షం పడిందంటే జనజీవనం స్తంభిస్తోంది. 44.5 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న నగరం చుట్టుపక్కల ముంపు సమస్య వేధిస్తోంది. అభివృద్ధి చేయని కాలువ వ్యవస్థ అయిదేళ్లలో ముగ్గురిని మింగేసింది.

Published : 09 May 2024 05:20 IST

వైకాపా ప్రజాప్రతినిధికి ఇదీ నగరవాసుల ప్రశ్న
ఎందరి ప్రాణాలు తీస్తారని తీవ్ర ఆవేదన
న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, శ్యామలాసెంటర్‌, ఏవీఏ రోడ్డు

‘రాజమహేంద్రవరం అభివృద్ధికి రూ.వందల కోట్లు తెచ్చాం.. రైల్వేస్టేషన్‌.. విమానాశ్రయం.. ఈఎస్‌ఐ ఆసుపత్రి.. ఇలా ఎన్నో అభివృద్ధి చేశాం. చెప్పుకొంటూ పోతే పెద్ద జాబితానే ఉంది. రాజమహేంద్రవరం నగరంలో అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తేనే నాకు ఓటేయండి..’

ప్రస్తుత నగర వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ భరత్‌రామ్‌ నిత్యం చెప్పే మాటలు


మరి అంతలా అభివృద్ధి చేస్తే గంటన్నర వర్షానికే నగరం ఇంతలా మునిగిపోవాలా.. మాకెందుకీ పాట్లు? వాటన్నింటికీ అన్ని కోట్లు ఖర్చుచేశామని చెబుతున్న మీరు.. అయిదేళ్లు అధికారంలో ఉండి రూ.200 కోట్లు కేటాయిస్తే తాత్కాలిక పరిష్కారమైనా లభించి ముంపు సమస్యను ఎందుకు పట్టించుకోలేదు?

ఇదీ నగరవాసుల సూటి ప్రశ్న


చారిత్రక నగరంలో వర్షం పడిందంటే జనజీవనం స్తంభిస్తోంది. 44.5 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న నగరం చుట్టుపక్కల ముంపు సమస్య వేధిస్తోంది. అభివృద్ధి చేయని కాలువ వ్యవస్థ అయిదేళ్లలో ముగ్గురిని మింగేసింది. అరగంట గట్టిగా వర్షం పడినా ఒకపూటంతా నగరవాసులు నరకాన్ని చూడాల్సి వస్తోంది. నలుదిక్కులా ముంపు నీరు చేరి బయటపడే దారితెన్నూ లేకుండా పోతోంది. 


స్తంభిస్తున్న నగర జీవనం

వర్షానికి నగర జీవనం స్తంభిస్తోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారంతా ఎక్కడ ముంపు నీటిలో చిక్కుకుపోతారనే భయాందోళన కుటుంబీకులను వెంటాడుతోంది. వారు ఇల్లు చేరే వరకూ గ్యారంటీ లేని పరిస్థితి. వర్షాకాలంలో పిల్లలను బడికి పంపాలంటే తల్లిదండ్రులు బిక్కుబిక్కుమనే దుస్థితి. ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరడం వల్ల అది
బయటకు వెళ్లే వరకూ నరకం చూస్తున్నారు. దుర్గంధంతో రోజుల తరబడి అవస్థ పడుతున్నారు. చినుకుపడితే తుమ్మలావ, ఆల్కట్‌ గార్డెన్స్‌, రైల్వే స్టేషన్‌ ఎదురుగా ప్రాంతాల్లోకి రెండు, మూడు అడుగుల వరకూ నీరు చేరిపోతుంది. సాధారణ స్థితికి రావడానికి రెండు, మూడు రోజులు పడుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


  • నగరంలో సుమారు 630 కిలోమీటర్ల మేర కాలువల నిర్మాణ వ్యవస్థ ఉంది. వీటిలో సుమారు 120 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువలను విస్తరించాల్సిన ఆవశ్యకత ఉంది.

  • నగరంలో 96 వేల గృహాలుంటే.. లోతట్టు ప్రాంతాల్లోనే 25 వేలున్నాయి. ఈ ప్రాంతాల్లో అవస్థ తీర్చడానికి కనీస  ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదు.

పాలకులు పట్టించుకుంటేగా..

ముంపు సమస్యను వైకాపా ప్రభుత్వం  పట్టించుకోలేదు. 14, 15 ఆర్థిక సంఘం నిధుల్లో ఎక్కువ శాతం రోడ్లు, ఇతర పనులకు వెచ్చించారు. కాలువల విస్తరణ, ముంపు సమస్యపై దృష్టి సారించలేదు. ఒకపక్క నగరానికి చెందిన ప్రజా ప్రతినిధి ప్రత్యేక నిధులు రూ.120 కోట్లు తీసుకొచ్చి రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని గొప్పులు చెప్పినా కనీసం దాంట్లో రూ.20 కోట్లు ఇప్పటికీ అందలేదు. నగరపాలక సంస్థకు చెందిన సాధారణ, కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి రూ.80 కోట్లలో ఎక్కువ శాతం సుందరీకరణకు మాత్రమే ఖర్చుచేశారు. మౌలిక వసతుల పేరుతో రూ.40 కోట్లు వరకూ వెచ్చించారు. వాటిలో కొంత ముంపు నివారణకు వెచ్చిస్తే.. సమస్య కొంత మేరైనా కొలిక్కి వచ్చేదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కాలు కదపలేం.. వాహనం నడపలేం

భారీ వర్షానికి కృష్ణ నగర్‌ రోడ్డులో పూర్తిగా నిండి రోడ్డుకు సమాంతరంగా పారుతున్న పెద్ద కాలువ (మంగళవారం  నాటి చిత్రం)

ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న నగరానికి రోజుకు లక్ష మంది ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. చుట్టు పక్కల నుంచి వైద్యం, విద్య, వ్యాపారం కోసం జనం వస్తుంటారు. వీరంతా కోటిపల్లి బస్టాండ్‌, హైటెక్‌ బస్టాండ్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ మీదుగా ఎక్కువ రాకపోకలు సాగిస్తారు. చినుకుపడితే చాలు ఆయా ప్రాంతాల్లో కాలు కదపలేం.. వాహనం నడపలేం. వరద నీటిలో చిక్కుకుని వాహనాలు మొరాయిస్తాయి.


సుందరీకరణ పేరిట చెరువుల ఉనికి దెబ్బతీశారు
-పతంజలి శాస్త్రి, పర్యావరణ నిపుణుడు

నగరంలో ముంపు సమస్యపై గతంలోనే నివేదిక అందించాం. మురుగు నీటి వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. గోదావరి నది ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని కాలువల వ్యవస్థ మెరుగుపర్చాలి. కాలువలను విస్తరించాలి. ముంపు తీవ్రత తగ్గాలంటే చెరువులను సిద్ధం చేసుకోవాలి. తెలకుల చెరువు, కంబాలచెరువు, ఆర్యాపురం వద్ద చెరువు ఈ కోవలోనే గతంలో ఏర్పాటు చేశారు. సుందరీకరణ పేరుతో వాటి ఉనికిని దెబ్బతీస్తున్నారు.


రూ.200 కోట్లు ఖర్చుచేస్తే చాలు
- రిటైర్డ్‌ మున్సిపల్‌ సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌

నగరంలో ముంపు సమస్య పరిష్కరించేందుకు కాలువల వ్యవస్థ ఆధునికీకరించాల్సి ఉంది. గతంలో రూ.200 కోట్లతో ప్రతిపాదనలు చేశాం. వర్షపు నీటిని మళ్లించి గోదావరిలో కలిసేలా ప్రత్యేకంగా పైపులైన్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావాల్సి ఉంది. భూగర్భ కాలువల నిర్మాణం జరగాలంటే కనీసం రూ.600 కోట్లు అవసరం. ఒకేసారి నిధుల మొత్తం వెచ్చించని పరిస్థితుల్లో దశల వారీగా కేటాయించడం ద్వారా పనులు చేపట్టవచ్చు.


వర్షానికి రూ.2,500 నష్టం
- ఎ.తిరీష్‌

వర్షానికి నా ద్విచక్ర వాహనం పూర్తిగా నీటమునిగింది. ఇంజిన్‌లోకి వరద నీరు, తుక్కు చేరింది. మెకానిక్‌ వద్దకు తీసుకువస్తే ఇంజినిప్పాలంటున్నారు. దీంతో సుమారు రూ.2,500 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ రోజు పనికి కూడా వెళ్లలేని పరిస్థితి. నగరాన్ని సుందరీకరణ చేశామంటున్నారు. ఈ వర్షానికే నీరు నిల్వ ఉండిపోతే.. రేపు వర్షాకాలంలో నగరవాసుల పరిస్థితి ఏంటి.?


ఎంత అభివృద్ధి చేశారో తెలిసిపోయింది!
- బి.శ్రీనివాస్‌

నగరాన్ని అభివృద్ధి చేశాం. రోడ్లు వేస్తున్నాం. సుందరీకరణ చేశామంటున్నారు.. కానీ ఒక్క రోజు కురిసిన వర్షానికే తెలిసిపోయింది మన నాయకులు ఎంత అభివృద్ధి చేశారో. కృష్ణారావుపేటలో కాలువ పనులు చేపట్టి నెలరోజులు కావస్తోంది. ఇక్కడ స్థానికులు నెల రోజులుగా తాగు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. వ్యాపారాలు స్తంభించాయి. ఇంకెప్పుడు రాజమహేంద్రవరం అభివృద్ధి చెందేది..?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని