logo

మద్య ‘నిషా’దం.. బతుకుల్లో ‘విషాదం’

ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మద్యం అలవాటున్నవారిపై వల విసిరేందుకు ఊరూవాడా డంప్‌లు వెలుస్తున్నాయి. నాసిరకం, గోవా మద్యం పేరుతో వందలాది బాక్సుల్లో సీసాలు ప్రత్యక్షమవుతున్నాయి.

Updated : 09 May 2024 05:37 IST

ఎన్నికల్లో ప్రలోభాలతో వల
ఉచితంగా ఇచ్చారని తాగితే ప్రాణాన్ని ఫణంగా పెట్టినట్లే
కుటుంబాలను కూల్చేస్తున్న మహమ్మారి
ఈనాడు, కాకినాడ - న్యూస్‌టుడే, కంబాలచెరువు

ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మద్యం అలవాటున్నవారిపై వల విసిరేందుకు ఊరూవాడా డంప్‌లు వెలుస్తున్నాయి. నాసిరకం, గోవా మద్యం పేరుతో వందలాది బాక్సుల్లో సీసాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఉచితంగా వస్తుంది కదాని ఈ ప్రలోభాల ఉచ్చులో పడి ఏమాత్రం తాగినా చెల్లించుకునే మూల్యం కూడా ఎక్కువే. జీవితాంతం ఆరోగ్య సమస్యలతో సతమతమవ్వాల్సి వస్తోంది. మృత్యువూ పొంచే ఉంటుంది. ఇప్పటికే అనేకమంది వ్యాధులబారిన పడి లక్షలాది రూపాయలు వైద్యానికి ఖర్చుచేస్తున్నారు. బతుకే ఛిద్రమవుతోంది. ఆర్థిక చిక్కుల్లో పడి ఆ కుటుంబం పడే ఆవేదన అంతాఇంతాకాదు.


కాకినాడ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌)లో అయిదేళ్ల కాలంలో మానసిక సమస్యలతో వైద్యం పొందిన వారి సంఖ్య 1,09,240 మంది. వీరిలో ఒక్క మద్యపాన వ్యసనపరులే 12,253 మంది. ఇక్కడ వ్యసన విముక్తి కేంద్రం (ఆల్కహాల్‌ అండ్‌ డ్రగ్‌ డీ ఎడిక్షన్‌ సెంటర్‌) 2020 మే 28న ప్రారంభమైంది. ఈ ఏడాది మార్చి 24 వరకు ఔట్‌ పేషెంట్లుగా (ఓపీ) 12,126 వైద్య సేవలు పొందితే.. ఇన్‌పేషెంట్లుగా 908 మంది చేరి వైద్యం పొందారు. 13,304 మంది చికిత్స పొందారు.

కాకినాడ జీజీహెచ్‌లోని వ్యసన విముక్తి కేంద్రంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న వైద్య బృందం


కోనసీమలోనూ పెరుగుతున్న కేసులు...

అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రిలో 2020 ఆగస్టులో వ్యసన విముక్తి కేంద్రం ఏర్పాటుచేశారు. 90 శాతం మంది రోగులు చీప్‌లిక్కర్‌ను తాగి ఒళ్లు గుల్లచేసుకుంటున్నారు. ఇక్కడ 8,711 మంది మానసిక, ఇతర సమస్యలతో ఆసుపత్రిలో చేరితే.. అందులో మందుబాబులు 7,600 మంది ఉన్నారు. ఇన్‌పేషెంట్లుగా 150 మంది చేరి చికిత్స పొందారు.


ఊరూవాడా  మద్యం పరవళ్లు..

ఉమ్మడి జిల్లాలో 402 మద్యం దుకాణాలు.. 27 బార్లు, క్లబ్బులు ఇతరత్రా ప్రాంగణాల్లో అమ్మకాలు సాగుతున్నాయి. అలవాటున్నవారు సంపాదన అంతా తాగుడుకే ఖర్చుపెడుతున్నారు. గతంలో ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు రూ.2వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు రూ.3వేల కోట్లకుపైనే.. ఇక నాటు సారా ప్రభావం ఉమ్మడి జిల్లాలో 36 మండలాల పరిధిలోని 120 గ్రామాల్లో ఉంటే.. ఏటా అక్రమ వ్యాపారం రూ.200 కోట్లకుపైనే సాగుతున్నట్లు అంచనా.


మృత్యుముఖంలోకి..

  • మద్యంలో హానికరమైన కెమికల్‌ కాంపౌండ్స్‌ ఉన్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. కొన్ని బ్రాండ్లలో వైరాగెలాల్‌, ఐసోఫ్లోరిక్‌ యాసిడ్‌, డైఈథేల్‌ ప్యాలెట్‌ వంటి ·కెమికల్‌ కాంపౌండ్‌ ఉందని తేల్చింది. కళ్లు ఎర్రబడడం, మెదడు సూదులతో గుచ్చినట్లు అవుతుందని తేల్చారు. మెదడు, శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తి మృత్యువాత పడే ప్రమాదం ఉందని వెల్లడించారు.
  • ఉమ్మడి జిల్లాలో అనధికారికంగా తయారవుతున్న నాటుసారాలో కిక్కుకోసం బ్యాటరీల్లోని కార్బన్‌, యూరియా, డీఏపీ కలుపుతుండడంతో ప్రాణాలమీదికి వస్తోంది.
  • వ్యసనపరులు ఆరోగ్యం గుళ్ల చేసుకుని ఆర్థో, న్యూరో, సైకియాట్రి విభాగాను ఆశ్రయిస్తున్నారు.

మత్తులో మెడ, చేతిపై కోసుకున్న వ్యక్తి

ఉమ్మడి జిల్లాలో ఎన్నికల్లో పంచేందుకు విచ్చలవిడిగా మద్యం దిగుమతి అవుతోంది. ఇటీవల కాకినాడ, కాట్రేనికోన, పిఠాపురం, రాయవరం తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున పట్టుబడింది. పిఠాపురంలో పట్టుకున్న సరకైతే ఏకంగా రూ.80 లక్షల పైమాటే. గోవా మద్యం సీసాలూ కనిపించాయి. ఈ నేపథ్యంలో మద్యం జోలికి ఎవరూ వెళ్లకూడదని, తమ జీవితాన్ని దిశానిర్దేశం చేసే ఎన్నికల్లో బాధ్యతతో వ్యవహరిం చాలని మహిళలు కోరుకుంటున్నారు.


రూ.లక్షలు ఖర్చుపెట్టినా మనిషి దక్కలేదు..
- ధనలక్ష్మి, ఆల్కాట్‌గార్డెన్స్‌, రాజమహేంద్రవరం

మా తమ్ముడు ప్రైవేటు ఉద్యోగి (45). పదిహేనేళ్ల నుంచి మద్యం తాగేవాడు. గ్యాస్ట్రిక్‌, కడుపునొప్పి వచ్చేవి. రెండేళ్ల క్రితం కాళ్లు చేతులకు నీరు పట్టేసి, కడుపు ఉబ్బిపోయింది. కాలేయం దెబ్బతిందని వైద్యులు చెప్పారు. అప్పటి నుంచి ప్రతి నెలా ఆసుపత్రికి వెళ్లి పొట్టకు సూది పెట్టి నీరు బయటికి తీసేవారు. కాలేయం పూర్తిగా దెబ్బతిని మృతిచెందాడు. బయట అప్పులు చేసి మరీ ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించాం.


తండ్రి లేని పిల్లలయ్యారు..
- పి.ఝాన్సీ, కాతేరు

నా భర్తను పోగొట్టుకున్నా. నా ఇద్దరు పిల్లలకు తండ్రి ప్రేమ దూరమైంది. ఏడాది క్రితం పచ్చకామెర్లు వచ్చాయి. చికిత్స తీసుకున్న కొద్ది రోజుల తరువాత వెంటనే మళ్లీ మద్యం తాగేయడంతో పరిస్థితి తీవ్రతరమైంది. కొన్నిసార్లు మూర్ఛ వచ్చి పరిస్థితి దారుణంగా ఉండేది. ఆస్తులు అమ్ముకుని మరీ చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. ఈ ఏడాది మార్చిలో కడుపు ఉబ్బి, శరీరమంతా నీరు పట్టేసి చనిపోయారు. మద్య రహిత సమాజం వస్తేనే బతుకులు బాగుపడతాయి.


రోగుల్లో శారీరక, మానసిక సమస్యలు..
- డాక్టర్‌ వి.వి.వరప్రసాద్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, సైకియాట్రి విభాగం, కాకినాడ జీజీహెచ్‌

మద్యం మోతాదు ఎక్కువ తీసుకోవడంతో బ్రెయిన్‌లో టోలరెన్స్‌ పెరిగి బానిసలయ్యే పరిస్థితి ఉంటుంది. గ్యాస్ట్రిక్‌, కడుపునొప్పి, వాంతులు, లివర్‌ ఇన్ఫెక్షన్‌ వస్తుంటాయి. నిద్ర పట్టకపోవడం, ఆకలి వేయకపోవడం, చేతులు వణకడం వంటి సమస్యలతో రోగులు వస్తుంటారు. ఫిట్స్‌ వస్తే మెదడుకు ప్రమాదం. మానసిక పరిస్థితి బాగులేక ఆవేశంలో ఉరివేసుకోవడం, బ్లేడుతోనో కత్తితోనో గాయపరచుకోవడం వంటి పరిస్థితుల్లో వైద్యశాలకు వసున్నవారూ ఉన్నారు.


కాలేయం, గుండెపై తీవ్ర ప్రభావం
- డాక్టర్‌ పీవీవీ సత్యనారాయణ, జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌వోడీ, రాజమహేంద్రవరం జీజీహెచ్‌

మద్యానికి బానిసైనవారు.. నాసిరకం, కల్తీ మద్యం తాగుతున్న వారికి కాలేయం, గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒక్కోసారి మెదడులో నరాలు పగిలి స్ట్రోక్‌ వస్తుంది. కాలేయం దెబ్బతింటే పచ్చకామెర్లు వస్తాయి. అక్కడే జాగ్రత్తలు తీసుకోకపోతే చికిత్స చేయడానికి కూడా ఉండదు. అలానే పొట్టలో అల్సర్లు వస్తాయి. పొట్ట, శరీరమంతా నీరు పట్టేస్తుంది. దీనికి చికిత్స ఉన్నా రికవరీ సరిగా ఉండదు. మరణాల రేటు అధికం. గుండె పనితీరు తగ్గి ఆల్కహాలిక్‌ కార్డియో మయోపతి వస్తుంది. దీని వల్ల గుండె ఆగిపోయి మనిషి చనిపోతారు. తీవ్ర మతిమరుపు, మానసిక సమస్యలు వేధిస్తాయి. ఫిట్స్‌ వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదముంది. ఇలాంటి కేసులు ప్రస్తుతం రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు విపరీతంగా వస్తున్నాయి. మొత్తం కేసుల్లో 20 శాతం ఇలాంటి మద్యం తాగడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులతోనే.. ఇక కల్తీ మద్యం తాగితే అయిదేళ్లలో క్షీణించే ఆరోగ్యం ఏడాదిలోనే పూర్తిగా దెబ్బతిని చికిత్స చేయడానికి అవకాశమే ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని