logo

జగన్‌ ఏలుబడి.. పర్యాటకం చతికిలపడి..!

‘వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటకం అంటే ప్రజలు అంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా చేస్తాం..’ అంటూ జగన్‌’ ఊదరగొట్టినా.. అయిదేళ్లలో కొత్త ప్రాజెక్టుల ఊసే లేకపోగా ఉన్న పర్యాటకం పడకేసింది.

Updated : 10 May 2024 06:05 IST

కొత్త ప్రాజెక్టుల ఊసులేదు
పాత వాటి ప్రస్తావన శూన్యం
ఈనాడు, రాజమహేంద్రవరం

‘వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పర్యాటకం అంటే ప్రజలు అంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా చేస్తాం..’ అంటూ జగన్‌’ ఊదరగొట్టినా.. అయిదేళ్లలో కొత్త ప్రాజెక్టుల ఊసే లేకపోగా ఉన్న పర్యాటకం పడకేసింది. సుదీర్ఘ సాగర తీరం.. అందమైన గోదావరి నదీ పరివాహకం.. పచ్చదనంతో మనసును కట్టిపడేసే ప్రకృతి సోయగాలు.. ‘తూర్పు’ సొంతం. ఉమ్మడి జిల్లాలో పర్యాటకరంగ అభివృద్ధికి అపార అవకాశాలున్నా పాలకుల నిర్లక్ష్యం పగపట్టింది. పర్యాటకానికి తూర్పు ముఖద్వారమని ప్రగల్భాలు పలికిన అధికార పార్టీ నాయకులు ఆ సంగతే మరిచారు.

మ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అందుబాటులో ఉన్న అపార వనరులను సద్వినియోగం చేసుకుంటే పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించవచ్చు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలున్నా ఆ దిశగా కనీస చర్యలు లేవు అయిదేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాకు సగటున ఏడాదికి 30 లక్షల మంది పర్యాటకులు వస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 10 లక్షలు దాటడం లేదు. జిల్లాలో ఆధ్యాత్మిక పర్యాటకం(టెంపుల్‌ టూరిజం)కు చక్కని అవకాశాలున్నా వాటిని సద్వినియోగం చేసుకుని, పర్యాటకులను ఆకర్షించడంలో జగన్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైమంది.


హేవలాక్‌ నిధులు మళ్లించి..

రాజమహేంద్రవరానికి తలమానికంగా, వందేళ్ల చరిత్ర ఉన్న హేవలాక్‌ వంతెన పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వైకాపా పాలకులు చెప్పారు. వంతెనపై నైట్‌ మార్కెట్‌, లంకల్లో వెళ్లేందుకు వీలుగా మెట్లు, మధ్యలో ఫుడ్‌ స్టాళ్లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు గాలిలో కలిసిపోయాయి. రూ.కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పి పబ్బం గడిపి.. ఆ నిధులు రూ.12 కోట్లు ఇతర అవసరాలకు మళ్లించారు.


కళతప్పిన కాకినాడ తీరం

కాకినాడ గ్రామీణంలోని సూర్యారావుపేట సముద్ర తీరంలో తెదేపా ప్రభుత్వ హయాంలో 50 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.48 కోట్లతో అభివృద్ధి పనులు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. గ్లాస్‌ వంతెన, లేజర్‌షో, వాటర్‌ ఫౌంటేన్‌, గార్డెన్స్‌, పలు విక్రయ శాలలు ఏర్పాటు చేశారు. పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏటా ఉత్సవాలు నిర్వహించి ప్రముఖులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. నిత్యం సందర్శకులతో తీరమంతా సందడిగా ఉండేది. నిర్వహణ లేక అప్పుడు నిర్మించిన కట్టడాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. 


రూ.250 కోట్ల ప్రాజెక్టు పిచ్చుకెత్తుకెళ్లిందా?

తూర్పుగోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల నడుమ ఉన్న పిచ్చుకల్లంక ప్రాజెక్టు పత్తా లేకుండా పోయింది. రూ.250 కోట్లతో అభివృద్ధి చేస్తామని, ఓ ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదిరిందని వైకాపా పాలకులు ఆర్భాటంగా ప్రకటించినా నేటికీ ఆ ఊసేలేదు. 2022 ఆగస్టులో సంస్థ ప్రతినిధులు సీఎంతో సమావేశమై రాష్ట్రంలో ఆ గ్రూపు విస్తరణపై ప్రణాళికలు వేశారు. గత జనవరిలో ఆ సంస్థ సీఈవోతో కోనసీమ కలెక్టర్‌, రాజమహేంద్రవరం ఎంపీ సమావేశమయ్యారు. రెవెన్యూ పరిధిలో ఉన్న 56 ఎకరాలను పర్యాటక శాఖకు బదిలీ చేసినా నేటికీ ఆ ఊసే లేదు.


ఐలాండ్‌పై ఆశలు వదిలేయడమే!

కాకినాడ పోర్టుకు సుమారు 13 కిలోమీటర్ల దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన హోప్‌ ఐలాండ్‌ 2,500 ఎకరాల్లో విస్తరించి ఉంది.  గతంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కాకినాడ పోర్టు నుంచి మోటరైజ్డ్‌ బోటు ద్వారా సందర్శకులు హోప్‌ ఐలాండ్‌కు వెళ్లి ఉత్సాహంగా గడిపేవారు. కచ్చులూరు వద్ద బోటు ప్రమాదం తరువాత బోటు షికారు నిలిచిపోయింది. ఇప్పటికీ పునరుద్ధరించలేదు.


విమాన ప్రదర్శనశాల ఇంకెప్పుడు?

కాకినాడ తీరానికి సుమారు మూడున్నరేళ్ల క్రితం తెచ్చిన యుద్ధ విమాన ప్రదర్శన శాల నేటికీ అందుబాటులోకి రాలేదు. ఎన్నికల కోడ్‌కు ముందు అధికార పార్టీ నాయకులు హడావుడిగా ప్రారంభించినా పనులు మాత్రం పూర్తవ్వలేదు. దీంతో పర్యాటకులను అనుమతించడం లేదు. నిధులు మంజూరు కాకపోవడమే సమస్య.


పాలకులకు పట్టని పర్యాటకం

  • కాకినాడకు విశాలమైన సాగరతీరం ప్రత్యేక ఆకర్షణగా ఉన్నా అక్కడ కనీస వసతులు లేకపోవడంతో వచ్చేవారంతా ఇబ్బందులు పడుతున్నారు.  
  • కాకినాడ జిల్లాలో 20, కోనసీమ జిల్లాలో 19 సాగర తీర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ గుర్తించినా ఆ పనులు గడపదాటలేదు.
  • కాకినాడ తీరాన్ని బ్లూ ఫ్లాగ్‌ హోదాకు అర్హత సాధించే దిశగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలోనూ కదలికలేదు. బ్లూఫ్లాగ్‌ హోదా దక్కాలంటే ఇక్కడి తీరం కాలుష్య రహితంగా మార్చాలి. తీరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలి. నిధుల లేమితో కదలిక లేకుండా పోయింది.
  • కడియం పూల వనాలు దేశవిదేశాల్లోనూ కీర్తి గడించాయి. కడియపులంక ప్రాంతాన్ని ఎకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు దీర్ఘకాలంగా పట్టాలెక్కలేదు.
  • కోనసీమ నదీపాయల్లో అనువైన ప్రాంతాలు గుర్తించి ఏటిగట్లు అభివృద్ధి చేసి.. కేరళ తరహాలో బోటు షికారు తదితర ఏర్పాట్లు చేసే అవకాశలున్నా పాలకులకు పట్టకపోవడం దారుణం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు