logo

Kotappakonda: మహా శివరాత్రి.. కోటప్ప కొండను చేరుకోండిలా..

కోటి వేల్పుల అండ కోటప్పకొండ.. కోటొక్క ప్రభలు తెచ్చామయ్యా వచ్చి ఏలుకోవయ్యా త్రికోటేశ్వరయ్యా అని మనసారా కోరుకుని స్వామి దర్శనం సౌకర్యంగా జరిగి సుఖంగా తిరుగుముఖం పట్టాలంటే అధికారులు..

Updated : 07 Mar 2024 08:16 IST

పోలీసుల సూచనలు పాటిద్దాం
ట్రాఫిక్‌ కష్టాల నుంచి తప్పించుకుందాం
ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట

కోటి వేల్పుల అండ కోటప్పకొండ.. కోటొక్క ప్రభలు తెచ్చామయ్యా వచ్చి ఏలుకోవయ్యా త్రికోటేశ్వరయ్యా అని మనసారా కోరుకుని స్వామి దర్శనం సౌకర్యంగా జరిగి సుఖంగా తిరుగుముఖం పట్టాలంటే అధికారులు, పోలీసుల సూచనలు పాటించాలి. లక్షల్లో వచ్చే భక్తులు, వేలాది వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేశారు. గతేడాది కొన్ని చేదు అనుభవాలతో ఈసారి పకడ్బంది చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రవిశంకర్‌రడ్డి, డీఎస్పీ వర్మ ప్రకటించారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా వాహనాల క్రమబద్ధీకరణతో పాటు, ఘాట్‌రోడ్డు మీదుగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు వెళ్లకుండా చూస్తామంటున్నారు. పైకి కార్లు, ద్విచక్ర వాహనాలను అనుమతించేది లేదని, ఆర్టీసీ బస్సుల్లోనే పయనించాలని, ప్రముఖులకు ఏసీ బస్సులుంటాయని వెల్లడించారు.

ప్రభలు వెళ్లే దారులు

  • చిలకలూరిపేట నుంచి వచ్చేవి పురుషోత్తమపట్నం, యడవల్లి, ఈటీ జంక్షన్‌ మీదుగా రావాలి. ఉదయం 8కి ఆయా గ్రామాల నుంచి బయలుదేరి, సాయంత్రం 4 గంటల్లోపు అన్నీ జంక్షన్‌కు చేరుకోవాలి.
  • నరసరావుపేట నుంచి వచ్చేవి యలమంద, గురవాయపాలెం, స్నానాల ఘాట్‌ నుంచి వచ్చి రెడ్ల సత్రం మీదుగా ఖాళీ స్థలంలోకి చేరుకోవాలి.
  • ప్రభలన్నీ ఒకేసారి వస్తే విద్యుత్తు సరఫరా విషయంలో ఇబ్బందుల్లేకుండా ఉంటాయని, సహకరించాలని విద్యుత్తు అధికారులు కోరుతున్నారు.

వాహనాల్లో వచ్చేవారు

  • నరసరావుపేట నుంచి వాహనాల్లో వచ్చేవారు పెట్లూరివారిపాలెం, అచ్చంపాలెం మీదుగా ఘాట్‌రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో నిలిపి ఆర్టీసీ బస్సుల్లో కొండకు చేరుకోవాలి.
  • చిలకలూరిపేట నుంచి వాహనాల్లో వచ్చేవారు పురుషోత్తమపట్నం, యడవల్లి, ఈటీ జంక్షన్‌ సమీపంలో శారదా ఫార్మసీ కాలేజ్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో వాహనాలను ఆపాలి.
  • వీఐపీలు, వీవీఐపీలు ఈటీ జంక్షన్‌ నుంచి ఎడమవైపు క్వారీ రోడ్డు నుంచి పమిడిపర్రు వైపు ఏర్పాటు చేసిన పార్కింగ్‌లో తమ వాహనాలను ఆపాలి.

తిరుగుపయనం

  • ప్రభలన్నీ వచ్చిన దారిలోనే తిరుగుముఖం పట్టాలి.
  • సాధారణ ప్రజలు, వాహనాల్లో వచ్చేవారు, బస్సులు మాత్రం కొండకావురు నుంచి జేఎన్‌టీయూ, కాకాని దారిలో తిరుగుముఖం పట్టాలి. స్నానాల ఘాట్‌ నుంచి కాల్వరోడ్డు మీదుగా ఏఎం రెడ్డి కాలేజీ వద్దకు చేరుకుని అటు వినుకొండ వైపు, ఇటు నరసరావుపేటకు తిరుగుముఖం పట్టాలి.
  • చిలకలూరిపేట వైపు వెళ్లేవారు ఈటీ జంక్షన్‌ కట్టుబడివారిపాలెం మీదుగా చెరువు రోడ్డు వైపు మళ్లాలి.
  • సంతమాగులూరు, అద్దంకి నుంచి వచ్చేవారు గురిజేపల్లి మీదుగా ఈటీ జంక్షన్‌కు రావాలి. తిరుగుపయనం కూడా ఇదే దారిలోనే.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని