logo

కోడ్‌ ఉన్నా.. అంబటికి లేనట్లే!

ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు.

Updated : 28 Mar 2024 13:07 IST

ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఎన్నికల అధికారులు

పొన్నూరు: ఈనెల 18న ములుకుదురులో మహిళలకు చెక్కులు అందజేస్తున్న వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ

 న్యూస్‌టుడే, పొన్నూరు: ఎన్నికల నిబంధనలు అధికార పార్టీకి వర్తించవా.. ప్రతిపక్ష పార్టీలకే వర్తిస్తాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సాక్షాత్తు వైకాపా అభ్యర్థి నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు ఏర్పాటు చేశారు. అయినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సమావేశానికి హాజరైన వాలంటీర్లను ఎన్నికల అధికారులు విధులు నుంచి తొలగించారు. వాలంటీర్లతో సమావేశం నిర్వహించిన వైకాపా నేతలపై చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 జడ్పీ అతిథిగృహమే కార్యాలయంగా..  

పొన్నూరు అసెంబ్లీ వైకాపా నియోజకవర్గ సమన్వకర్తగా అంబటి మురళీకృష్ణను గత నెల 28న నియమించారు. అనంతరం జడ్పీ అతిథిగృహాన్ని వైకాపా కార్యాలయంగా మార్చారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. జిల్లా పరిషత్తు ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేయిస్తామని ప్రకటించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో విచారణ అనే మాట ఒట్టి మాటగానే మిగిలిపోయిందనే ఆరోపణలు వినిపించాయి.

భోజనాలు పెట్టి.. తాయిలాలు ఎరేసి..

ఈ నెల 16న పొన్నూరు వైకాపా అభ్యర్థిగా అంబటి మురళీకృష్ణను ప్రకటించారు. వైకాపా అభ్యర్థిగా అంబటి పేరును ప్రకటించిన కొంత సమయానికే పొన్నూరు జడ్పీ అతిథిగృహంలో పొన్నూరు పట్టణ, మండల పరిధిలోని వాలంటీర్లతో వైకాపా అభ్యర్థి సమావేశం నిర్వహించారు.వాలంటీర్లకు భోజన వసతి కల్పించి ప్రతి ఒక్కరికి లంచ్‌ బాక్సులు బహుమతులుగా ఇచ్చారు. 16వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.

వాలంటీర్లపై చర్యలతో వదిలేసి..

ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత చేబ్రోలు, పెదకాకానిలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. వైకాపా అభ్యర్థి వాలంటీర్లతో సమావేశం నిర్వహించడంపై ఎన్నికల అధికారులకు వరసగా ఫిర్యాదులు వెళ్లాయి. ఆ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు విచారణ చేయించి సమావేశంలో పాల్గొన్న వాలంటీర్లను విధుల నుంచి తప్పించి అధికారులు చేతులు దులిపేసుకున్నారు. సమావేశానికి కారకులైన వైకాపా అభ్యర్థిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రచారంలో చెక్కుల పంపిణీ..

ఈ నెల 18న పొన్నూరు మండల పరిధిలోని ములుకుదురు గ్రామంలో వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార సమయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా చెక్కులు పంపిణీ చేశారని ఎన్నికల అధికారులకు ప్రతిపక్ష పార్టీలు ఫిర్యాదులు చేశాయి. ఎన్నికల అధికారులు రహస్యంగా విచారణ చేసినట్లు సమాచారం. విచారణ కాగితాలకే పరిమితం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని