logo

స్వేచ్ఛను కాలరాశారు

గత ప్రభుత్వం ఉద్యోగులపై అరాచకాలు చేసింది.. మన ప్రభుత్వం రాగానే స్నేహపూర్వక వాతావరణంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించుకోవచ్చని గత ఎన్నికల సందర్భంలో చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

Published : 16 Apr 2024 05:01 IST

ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసనపై వైకాపా ప్రభుత్వం ఉక్కుపాదం

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: గత ప్రభుత్వం ఉద్యోగులపై అరాచకాలు చేసింది.. మన ప్రభుత్వం రాగానే స్నేహపూర్వక వాతావరణంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించుకోవచ్చని గత ఎన్నికల సందర్భంలో చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఉద్యోగ సంఘాలు చిన్నపాటి నిరసన తెలియజేయాలంటేనే భయపడే పరిస్థితి కల్పించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యలపై ఆందోళనలకు పిలుపునిస్తే ముందు రోజే గృహనిర్బంధాలు, బైండోవర్లు చేయించారు. సంఘ కార్యాలయాల వద్ద పోలీసులను ఏర్పాటు చేసి ఎవరూ నిరసన  తెలియజేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కనీసం అడిగేందుకు కూడా అవకాశం లేకుండా చేశారు.


సమస్య పరిష్కరించలేదు

ఏ ఒక్క ఉపాధ్యాయ సమస్య ప్రభుత్వం పరిష్కరించిన దాఖలా లేదు. గతంలో స్నేహపూర్వక ప్రభుత్వమని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసగించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలపై నిర్బంధాలు విధించారు. ప్రభుత్వ విద్యారంగం పరిరక్షణ, ఉపాధ్యాయుల సంక్షేమం గురించి అడుగుతుంటే ప్రభుత్వం ఎన్నో సార్లు అక్రమంగా అడ్డుకుంది.

సాంబశివరావు, బాషాపండిత సంఘం


హామీల అమలు కోరితే అక్రమ నిర్బంధం

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సీపీఎస్‌ రద్దు, డీఏ, పీఆర్‌సీ బకాయిలు విడుదల చేయాలని అడిగిన దానికి అక్రమ నిర్బంధాలు విధించారు. కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పించారు. పిల్లల వద్దే ఉపాధ్యాయులను మర్యాద లేకుండా ఉన్నతాధికారి మాట్లాడారు. విద్యార్థుల ఎదుటే ఉపాధ్యాయులకు నోటీసులు ఇచ్చి వారేదో తప్పు చేసినట్లు వ్యవహరించారు.  

కె.బసవలింగారావు, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు


పోరాటాలు చేసినా ఫలితం లేదు

ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయంగా ఇవ్వాల్సిన డీఏలు, ఏపీజీఎల్‌ఐ రుణాలు, ఇతర బకాయిలు అమలుకు నోచుకోనందునే ఆందోళనలు, నిరసనలు జరిగాయి. సీపీఎస్‌ వారంలో రద్దు చేస్తామని విస్మరించారు. న్యాయమైన డిమాండ్లను సాధించుకునేందుకే పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.

బి.హైమారావు, నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని