logo

సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహిద్దాం

పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు హింస, రీపోలింగ్‌ లేకుండా విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శివశంకర్‌ కోరారు.

Published : 18 Apr 2024 05:29 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ శివశంకర్‌, పక్కన ఎస్పీ బిందుమాధవ్‌, జేసీ శ్యాంప్రసాద్‌ తదితరులు

నరసరావుపేట అర్బన్‌: పల్నాడు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు హింస, రీపోలింగ్‌ లేకుండా విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శివశంకర్‌ కోరారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆర్వోలు, ఈఆర్వోలు, సెక్టార్‌ అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వహించాలని, సీ విజిల్‌ యాప్‌ అమలులో జిల్లా ముందు వరసలో ఉందని, ఎన్నికల నిర్వహణకు సంబంధించి తనిఖీలు ముమ్మరం చేయాలని చెప్పారు. జిల్లాలో 557 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, సిబ్బంది నిజాయతీతో బాధ్యతలు నిర్వహించాలని సూచించారు.  పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూల నియంత్రణకు ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ, విశ్రాంత పోలీస్‌ అధికారుల సహకారం తీసుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతించిందని తెలిపారు. ఈవీఎంల కమిషనింగ్‌ మే 1, 2 తేదీల్లో ఉంటుందని వివరించారు. అలాగే హోం ఓటింగ్‌ మే 8, 9 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మే 13న పోలింగ్‌ ఉ.7 నుంచి సా.6 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.

ఒకే సమయంలో రెండు పార్టీల ర్యాలీలు వద్దు : ఎస్పీ బిందుమాధవ్‌ మాట్లాడుతూ వివిధ పార్టీలకు ఒకే రోజు ఒకే సమయంలో ర్యాలీల నిర్వహణకు అనుమతించవద్దని పేర్కొన్నారు. వీలైనంత వరకు మరుసటి రోజుకు మార్చుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిబంధనల ప్రకారం నామినేషన్‌ రోజున అభ్యర్థికి అవసరమైన మేర మాత్రమే ఇతరులను అనుమతించాలని చెప్పారు. పోలింగ్‌ రోజున 144వ సెక్షన్‌ అమలులో ఉంటుందని, ఎంసీసీ అమలులో అధికారులు మరింత చురుగ్గా వ్యవహరించాలని చెప్పారు. జేసీ శ్యాంప్రసాద్‌, డీఆర్వో వినాయకం, ఎఎస్పీ రాఘవేంద్ర, వివిధ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని