logo

వివాదాల అగ్గిరాజేస్తున్న వైకాపా

‘అగ్గి’రాజేస్తూ వివాదాలకు వైకాపా నాయకులు కాలుదువ్వుతున్నారు. మాచర్ల, గురజాలను మించిపోయేలా పెదకూరపాడులో ఇటీవల వరుస ఘటనలు భయకంపితులను చేస్తున్నాయి.

Published : 23 Apr 2024 05:41 IST

తెదేపా శ్రేణులే లక్ష్యంగా దాడులు
పెదకూరపాడు నియోజకవర్గంలో వరుస ఘటనలు
క్రోసూరు ఘటనలో ఇంతవరకూ నిందితులనే గుర్తించని పోలీసులు

క్రోసూరు: తెదేపా కార్యాలయం వద్ద మంటలు (పాత చిత్రం)

 ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట : ‘అగ్గి’రాజేస్తూ వివాదాలకు వైకాపా నాయకులు కాలుదువ్వుతున్నారు. మాచర్ల, గురజాలను మించిపోయేలా పెదకూరపాడులో ఇటీవల వరుస ఘటనలు భయకంపితులను చేస్తున్నాయి. చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం పక్షపాత ధోరణి అవలంబించడం వల్లే తమపై దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

  •  మార్చి 15న అమరావతి మండలం ధరణికోటలో వైకాపా కార్యాలయానికి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పటించారు. అర్ధరాత్రి కావడంతో పూర్తిగా కాలిపోయింది. ఉదయం చూసేసరికి బూడిద మిగిలింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అనుమానితుల పేరిట ఓ ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారితో నియోజకవర్గంలో కీలకమైన ఓ ముగ్గురు తెదేపా నేతల పేర్లు చెప్పించి వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. గంటల వ్యవధిలోనే ఐదుగురిని అరెస్టు చేశారు.
  •  ఈనెల 8న క్రోసూరులో తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగళం భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభ అయిపోయాక అర్ధరాత్రి 12 గంటల సమయంలో క్రోసూరులోని తెదేపా కార్యాలయాన్ని గుర్తుతెలియని దుండగులు తగులబెట్టారు. కార్యాలయం పూర్తిగా మంటల్లో కాలి బూడిదైంది. 15 రోజులవుతున్నా అనుమానితులను గుర్తించలేదు. ఎవరో కూడా తెలుసుకునేప్రయత్నం చేయడం లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

పై రెండు ఘటనల విషయంలో స్థానిక పోలీసులు అధికార పార్టీకి అంటకాగుతున్నారని, అందుకే వైకాపా కార్యాలయం తగులబడితే ఒకలా.. తెదేపా కార్యాలయం తగులబడితే మరోలా చర్యలు తీసుకున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. క్రోసూరులోని తెదేపా కార్యాలయంపై దాడి ఘటన కేసులో ఇంతవరకూ చర్యలు లేకపోవడంతో తెదేపా శ్రేణులనే లక్ష్యం చేస్తూ ఇటీవల వరుస దాడులు పెదకూరపాడు నియోజకర్గంలో చోటుచేసుకుంటున్నాయి. తమను పోలీసులు ఏమీ అనరులే, కేసులు నమోదు చేయరులే.. అరెస్టు చేయరు అన్న ధోరణిలో వైకాపా కార్యకర్తలు పెట్రేగిపోతున్నారు. తాజాగా ఆదివారం అర్ధరాత్రి బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెంలో తెదేపా కార్యాలయానికి ఎవరో గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. మంటలు చెలరేగడంతో అక్కడే నిద్రపోతున్న కొందరికి మెలకువ వచ్చి ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు భారీగా చెలరేగి కార్యాలయం మొత్తం కాలిపోయింది. అక్కడే ఓ కానిస్టేబుల్‌ విధులు నిర్వర్తిస్తున్నా సరే కార్యాలయానికి నిప్పు పెట్టడం గమనార్హం.

తెదేపా పేరు ఎత్తితే చాలు వైకాపా నాయకులు బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఈనెల 19న బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంలో తెదేపా ఎన్నికల ప్రచార రథం తిరుగుతోంది. వాహనాన్ని అడ్డగించి వెనక్కి వెళ్లిపోవాలంటూ అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త గాదె నాగార్జునరెడ్డి బెదిరించాడు. ప్రచార వాహన డ్రైవరుతో గొడవ పెట్టుకున్నాడు. అంతేకాకుండా వాహనంపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. మంటలు రేగడంతో స్థానికులు కొందరు అడ్డుకుని ప్రమాదాన్ని నిలువరించారు. మంటలు ఆర్పిన స్థానికులపై కూడా వైకాపా కార్యకర్త మీ సంగతి తేలుస్తా అంటూ బెదిరించాడు.  ఇలా తెలుగుదేశం పార్టీ శ్రేణులే లక్ష్యంగా పెదకూరపాడు నియోజకవర్గంలో వరుస దాడులు చోటుచేసుకుంటున్నా పోలీసుల చర్యలు లేకపోవడంతో వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల జాబితాలో మాచర్ల, గురజాలను పెదకూరపాడు మించిపోయే ప్రమాదం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు