logo

రాజధాని వద్దంటూ.. లోకల్‌ ఎలా అవుతారు?

‘అమరావతిని రాజధానిగా వద్దని, మూడు రాజధానులు కావాలంటూ మీరు పక్కా లోకల్‌ అని వాహనాలపై ఎలా రాసుకుంటారు’ అని వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్యని ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రశ్నించారు.

Published : 04 May 2024 05:27 IST

మాట్లాడుతున్న గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి పెమ్మసాని, ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులు తదితరులు

వట్టిచెరుకూరు, న్యూస్‌టుడే: ‘అమరావతిని రాజధానిగా వద్దని, మూడు రాజధానులు కావాలంటూ మీరు పక్కా లోకల్‌ అని వాహనాలపై ఎలా రాసుకుంటారు’ అని వైకాపా ఎంపీ అభ్యర్థి కిలారి రోశయ్యని ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రశ్నించారు. వట్టిచెరుకూరు మండలంలోని పలు గ్రామాల్లో ప్రత్తిపాడు అభ్యర్థి బూర్ల రామాంజనేయులతో కలిసి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఈ ప్రాంతం రైతులకు నిలయం, రైతు బాంధవులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, యలమంచిలి శివాజీ,  ఆచార్య ఎన్‌జీ రంగా లాంటి మహానుభావులు పుట్టి పెరిగిన గడ్డ అని అభివర్ణించారు. వారంతా రైతులు, వ్యవసాయం అభివృద్ధికి కృషి చేశారని వివరించారు. నా చిన్నప్పుడు ఈ ప్రాంతంలో రైతులకు టమాటాలకు కిలోకి రూ. 2 మాత్రమే ధర దక్కేదని కొన్ని ప్రాంతాల్లో ఇదే ధరకు అమ్ముతూ రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన పొలాలకు సంబంధించిన పాస్‌ పుస్తకాలు, ధ్రువపత్రాలు ప్రభుత్వం తీసుకుని నకలు కాపీలు మనకు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. ఇలా ఏ రాష్ట్రంలో కూడా లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చే వరకు భూములను రిజిస్ట్రేషన్‌ చేయెద్దని సూచించారు. ఎన్నికల అనంతరం మనం మళ్లీ ఇదే విధంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించుకోవాలని చెప్పారు. సీఎం జగన్‌ 123 సార్లు బటన్‌ నొక్కరని, ఆయన కూర్చీ దిగేందకు ప్రజలందరూ ఈ నెల 13న బటన్‌ నొక్కడానికి సిద్ధమయ్యారని వివరించారు.

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఘనస్వాగతం

వట్టిచెరుకూరు మండలంలోని ప్రచారం నిర్వహించిన గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి పెమ్మసాని, ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులకు ఘనస్వాగతం లభించింది. వింజనంపాడులో వారికి పొక్లెయిన్‌ సహాయంతో రెండు గజమాలలను వేశారు. చమళ్లమూడిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి తెదేపా అభ్యర్థులు పూలమాలలు వేశారు. కాట్రపాడులో పూజలు చేశారు. నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు, రవి దేవరాజ్‌, మన్నవ పూర్ణచంద్రరావు, ఎన్‌.నాగరాజు, జి.చింపిరయ్య, రామ్‌, సాంబశివరావు, హరిబాబు, గంగాధరరావు, కిరణ్‌కుమార్‌, మురళి, శ్రీనివాసరావు, సర్పంచులు రాజ్యలక్ష్మి, విజయ్‌కుమార్‌, శంకర్‌, వెంకటరావు, శివపార్వతి, ఎంపీటీసీలు కోటేశ్వరరావు, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని