logo

జగన్‌ కుతంత్రం.. ఓడిన మానవత్వం

 నా అవ్వాతాతలు ఆనందంగా ఉండాలి. వారికి ఇంటి వద్దే పింఛను అందిస్తున్నాం. వారి చల్లని దీవెనలు అందించాలి. ఇవీ సీఎం జగన్‌ వృద్ధులను ఉద్దేశిస్తూ ఆయా సభల్లో చెప్పే మాటలు.

Updated : 04 May 2024 06:02 IST

ఎండలో మాడిన అవ్వాతాతలు
పొన్నూరులో వృద్ధుడి మృత్యువాత
జగన్‌ అనుకున్నది.. అధికారులు చేశారు
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, జిల్లా పరిషత్తు (గుంటూరు), నెహ్రూనగర్‌, పెదకాకాని, ప్రత్తిపాడు

 నా అవ్వాతాతలు ఆనందంగా ఉండాలి. వారికి ఇంటి వద్దే పింఛను అందిస్తున్నాం. వారి చల్లని దీవెనలు అందించాలి.

ఇవీ సీఎం జగన్‌ వృద్ధులను ఉద్దేశిస్తూ ఆయా సభల్లో చెప్పే మాటలు.

వృద్ధులకు ఇంటి వద్దే సచివాలయ కార్యదర్శుల ద్వారా పింఛను ఇచ్చే అవకాశం ఉన్నా కాదన్నారు. సీఎం జగన్‌ కోరుకున్నట్లే అధికారులు చేశారు. గత నెలలో పోయిన పండుటాకుల ప్రాణాలు చాలదన్నట్లు వ్యవహరించారు.వాడకంలో లేని బ్యాంకు ఖాతాల్లో పింఛను డబ్బులు జమ చేసి తమాషా చూస్తున్నారు. ఈ విధానంతో వృద్ధులకు ఎదురయ్యే పాట్లపై ముందుగానే అప్రమత్తం చేసినా చెవికెక్కించుకోలేదు. ఫలితంగా పొన్నూరులో ఓ వృద్ధుడు ఎండదెబ్బతో మృతి చెందారు. పలుచోట్ల వృద్ధులు సొమ్మసిల్లి పడిపోయారు. జగన్‌ మాటల్లో ఒలకబోసే ప్రేమ చేతల్లో మాయమైంది.  ఓట్ల కుతంత్రంలో మానవత్వం ఓడిపోయింది.

సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో శుక్రవారం రెండో రోజు కూడా బ్యాంకులు, కియోస్క్‌ కేంద్రాల వద్ద అవ్వాతాతలు, వితంతువులు నగదు కోసం పడరాని పాట్లు పడ్డారు. బ్యాంకుల్లో రద్దీ పెరగడంతో కూర్చోవడానికి చోటులేక అవస్థలు పడ్డారు. తీవ్రమైన ఉక్కపోత, వేడిసెగలతో కూడిన గాలులతో వారు అల్లాడిపోయారు. తాగునీరు, నీడ వంటి కనీస సదుపాయాలు కల్పించలేదు.

సొమ్ము జమకాక..

సాంకేతిక కారణాలతో కొందరికి నగదు జమ కాకపోవడంతో వారు గ్రామ సచివాలయాలకు, అక్కడి నుంచి బ్యాంకులకు వెళ్లి ఆరా తీశారు. అక్కడ మరోసారి చూసి బ్యాంకు ఖాతా మనుగడలో లేదని, ఆధార్‌ కార్డు, రెండు ఫొటోలు తీసుకొస్తే ఖాతా అప్డేట్‌ చేసిన తర్వాత నగదు తీసుకోవచ్చని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిగిరారు.  బ్యాంకుల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో వారు ఖాతా మనుగడలో ఉందా? లేదా? చెప్పడానికి కూడా గంటల సమయం తీసుకున్నారు. జిల్లాలో 4వేల మంది బ్యాంకు ఖాతాలు వినియోగంలో లేకపోవడంతో నగదు జమ కాలేదు. వీరందరికీ 4న నగదు పంపిణీ చేయనున్నారు.

3 గంటల పాటు పడిగాపులు

వృద్ధులు నగదు ఉపసంహరణకు ఫారం నింపడానికి కూడా వరుసలో నిలబడాల్సి వచ్చింది. ఒక్కో లబ్ధిదారు కనీసం 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు ఎదురుచూశారు. కొందరు నీరసించిపోవడంతో వారిని కుర్చీల్లో కూర్చోబెట్టారు. గుంటూరు నగరం అరండల్‌పేటలోని ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంకు శాఖల్లో పింఛన్‌దారులు పదుల సంఖ్యలో వచ్చారు. ముట్లూరు కెనరాబ్యాంకు, వట్టిచెరుకూరు చైతన్యగోదావరి బ్యాంకు శాఖలో రద్దీ కొనసాగింది. మంగళగిరి యూనియన్‌ బ్యాంకులో వృద్ధుల రద్దీ పెరగడంతో గేటు వేశారు. రద్దీ తగ్గేవరకు కొందరు బయటే వేచి ఉండాలని చెప్పారు. కొన్ని చోట్ల రాజీనామా చేసిన వాలంటీర్లు, వైకాపా నేతలు బ్యాంకులు, ఆయా మార్గాల్లో వృద్ధులు కనిపిస్తే ప్రతిపక్షాల వల్ల ఇబ్బందులు వచ్చాయని వారికి చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంలో ఉన్నది జగన్‌ కదా? ఆయన సక్రమంగా చేయలేక ఎదుటివారిపై నిందలు వేస్తారా? అని లబ్ధిదారులు వారిని నిలదీశారు.


పింఛను సొమ్ము లేకుండా వెనక్కి వెళ్తున్నా

యూనియన్‌ బ్యాంకు ఖాతాలో పింఛను వేశారు. నగదు విత్‌డ్రా స్లిప్పు రాయించుకున్నాను. టోకెన్‌ ఇచ్చారు. చివరకు ఖాతా పని చేయడం లేదని ఆధార్‌ కార్డు జిరాక్సు ఇవ్వమంటే ఇచ్చా. డబ్బుల కోసం శనివారం రమ్మన్నారు. ఎండలో రాలేక, బండిమీద కూర్చో లేక ఇబ్బంది పడుతున్నా.

కాసమ్మ, ప్రత్తిపాడు

అద్దె, కరెంట్‌ బిల్లు ఎలా కట్టాలయ్యా

మోకాళ్లు అరిగిపోవడంతో నా రెండు కాళ్లు పడిపోయాయి. ఎనిమిదేళ్లుగా నడవడం కాదుకదా సరిగా నిల్చోలేను. పింఛను డబ్బులే నాకు ఆధారం. సచివాలయ సిబ్బందికి ఫోన్‌ చేస్తే నా డబ్బులు బ్యాంకులో పడ్డాయన్నారు. మే 2న నా పెద్ద తమ్ముడు నన్ను తీసుకొని బ్యాంకుకు వచ్చాడు. ఉదయం, సాయంత్రం రెండు సార్లు జనంతో రద్దీగా ఉంది. 3న ఉదయం రమ్మన్నారు. నా పెద్ద తమ్ముడు ఆ రోజు ఉద్యోగానికి సెలవు పెట్టడంతో రూ.800 నష్టపోయాం. ఆటో నడుపుకునే నా చిన్నతమ్ముడు శుక్రవారం బ్యాంకుకు తీసుకొచ్చాడు. రోజంతా ఇక్కడే ఉండడంతో నా వల్ల అతనికి ఆటో అద్దె, బాడుగలు కలిపి రూ.1000 నష్టపోయాడు. మెట్లు ఎక్కలేను. ఆటోలోనే ఉండి నా తమ్ముడి ద్వారా ఫారం తెప్పించి భర్తీ చేసి ఇచ్చా. తీరా చూస్తే నా ఖాతా నాలుగేళ్లుగా వాడడం లేదని వాటి ఖర్చులంటూ రూ.600 మినహాయించి రూ.2400 వస్తాయన్నారు. పింఛను రూ.3వేల కోసం నేను, నా ఇద్దరు తమ్ముళ్లు రెండు రోజులు కష్టపడి తిరిగితే చేతికి రూ.2400 వచ్చింది. ఇంటి అద్దె, కరెంట్‌ బిల్లు ఎలా కట్టాలో అర్థం కావడం లేదయ్యా.

- మేరీ, గుంటూరు

మూడంకెల నంబరిచ్చి పంపేశారు

పింఛను కోసం సచివాలయానికి వెళ్లా. బ్యాంకులో పడ్డాయని చెప్పారు. నాకు బ్యాంకు ఖాతాలేదని మొత్తుకున్నాను. నా మాట వింటేగా. ఇదిగో నీ ఖాతా నంబర్‌ చివరి అంకెలంటూ 283 అని నా చేతిలో రాసి ఇచ్చారు. వెళ్లి పలానా బ్యాంకులో చూసుకోమన్నారు. ఎండలో పడి ఇంతదూరం వచ్చా. క్యూలో నిలబడి నానా అవస్థలు పడి బ్యాంకు వాళ్లకు 282 అంకె చూపించి నా పేరు చెబితే వాళ్లు బ్యాంకు పుస్తకం తీసుకురమ్మంటున్నారు. నాకు బ్యాంకు ఖాతానే లేదంటే వాళ్లు పుస్తకం తెస్తేకాని చెప్పలేమని పంపించారు. ఇదెక్కడి గోలండిబాబు. సచివాలయంలో వాళ్లు, బ్యాంకు వాళ్లు నా పింఛను గురించి సరిగా సమాధానం చెప్పడంలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.

- పోతురాజు

ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది

నా పేరు కొండారెడ్డి అచ్చెమ్మ. తక్కెళ్లపాడు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. బ్యాంకు పాస్‌ పుస్తకం పోయింది. పింఛను నగదు నా ఖాతాలో జమ చేసినట్లు అధికారులు చెప్పారు. పుస్తకం కోసం రెండు రోజులుగా తిరుగుతున్నా. ఎవరూ పట్టించుకోలేదు. ఎర్రటి ఎండలో 1.5 కి.మీ దూరంలో ఉన్న బ్యాంకుకు వచ్చా. ప్రభుత్వం తీవ్ర ఇబ్బంది పెడుతోంది. పింఛను నగదుతో మాత్రలు కొనుగోలు చేసుకోవాలి. 3వ తేదీన వచ్చినా చేతికి పింఛను అందలేదు. బ్యాంకు చుట్టూ తిరగలేకపోతున్నాను. బ్యాంకు పాస్‌ పుస్తకం కోసం ఆధార్‌ కార్డు నకలు, ఫోటోను అధికారులు అడుగుతున్నారు.

- కొండారెడ్డి అచ్చెమ్మ, తక్కెళ్లపాడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని